వెస్టిండీస్‌లో టీమ్ ఇండియా.. ధావన్ గెలిపిస్తాడా?
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను వన్డేలకు పక్కనపెట్టారు. దీంతో తాత్కాలికంగా శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ అప్పగించారు. ఈ విషయంలోనే టీమ్ ఇండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా వన్డే, టీ20 సిరీస్‌లను గెలుచుకొని సగర్వంగా మరో పర్యటనకు వెళ్లింది. ఇంగ్లాండ్ టూర్‌లో ముందు ఆడిన ఏకైక టెస్టు.. గత ఏడాది జరగాల్సిన మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ఓడినా.. మొత్తానికి టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది. అయితే షెడ్యూల్ ప్రకారం జరిగిన టీ20, వన్డే సిరీస్‌లలో భారత జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి సగర్వంగా రెండు సిరీస్‌ల విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ను గెలిచిన తర్వాత అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. పరిమిత ఓవర్ల సిరీస్ (వన్డే, టీ 20) మొత్తం భారత జట్టు గెలుచుకోవడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు.
ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ చేరుకున్నది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. అయితే భారత జట్టు ముందుగా వన్డే సిరీస్‌తో పర్యటన ఆరంభించనున్నది. ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను వన్డేలకు పక్కనపెట్టారు. దీంతో తాత్కాలికంగా శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ అప్పగించారు. ఈ విషయంలోనే టీమ్ ఇండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
శిఖర్ ధావన్ చాలా అనుభవం ఉన్న బ్యాటర్. గత కొన్నేళ్లుగా టీమ్ ఇండియా ఓపెనర్‌గా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాలు కూడా అందించాడు. అయితే గత కొంతకాలంగా ధావన్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన తొలి వన్డేలో ధావన్ 54 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 110 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత ఓపెనింగ్ బ్యాటర్లు చాలా ధీమాగా మ్యాచ్‌ను 19వ ఓవర్‌లోనే ముగించారు. ఒకవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా ఆడుతుంటే.. ధావన్ మాత్రం అతడికి సపోర్ట్‌గా నిలిచాడు. అదే సిరీస్‌లో జరిగిన మిగతా రెండు మ్యాచ్‌లలో ధావన్ అత్యంత పేలవ ప్రదర్శన చేశాడు. రెండో వన్డేలో 9 పరుగులకు ఔటవగా, కీలకమైన మూడో వన్డేలో ఓకే ఒక పరుగు చేసి పెవీలియన్ చేరాడు.
వెస్టిండీస్ సిరీస్‌కు ధావన్‌ను చాలా కాలం క్రితమే కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే ఎంపిక చేయడంతో.. సెలెక్టర్లకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. రోహిత్ వన్డేల నుంచి కాస్త రెస్ట్ కోరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు తిరగి రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు తీసుకుంటాడు. కానీ ఇప్పుడు వన్డే సిరీస్‌కు ఫామ్‌లో లేని ధావన్ కెప్టెన్‌గా రావడంపై టీమ్ ఇండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే, ధావన్ కెప్టెన్‌గా భారత జట్టు శ్రీలంక టూర్ వెళ్లింది. ఆ సమయంలో టీమ్ ఇండియా ప్లేయర్లు అందరూ ఇంగ్లాండ్‌లో ఉన్నారు. కానీ శ్రీలంక బోర్డు కోరిక మేరకు బీసీసీఐ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడటానికి శ్రీలంకకు 'బి' టీమ్‌ను పంపింది. అప్పుడే రాహుల్ ద్రవిడ్ తాత్కాలిక కోచ్‌గా భారత జట్టు వెంట వెళ్లాడు. ఆ సిరీస్‌లో భారత జట్టు అనుకున్నంతగా రాణించక పోయినా.. ద్రవిడ్ కోచింగ్ నైపుణ్యాలు తెలిశాయి. ఆ తర్వాత ద్రవిడ్ ఏకంగా టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా నియమించబడ్డాడు.
ఇప్పుడు అదే ద్రవిడ్ కోచ్‌గా శిఖర్ ధావన్ వన్డేలకు మరోసారి కెప్టెన్‌గా వెస్టిండీస్‌లో పర్యటిస్తున్నాడు. ధావన్ ఫామ్‌లో లేకపోయినా.. జట్టులోని ఇతర సభ్యులు మంచి టచ్‌లో ఉండటంతో టీమ్ ఇండియా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్లు లేకుండానే విండీస్ గడ్డపై భారత జట్టు వన్డే సిరీస్‌ను రేపటి నుంచి (22 జూలై) ఆడబోతోంది.
వన్డే మ్యాచ్ షెడ్యూల్ :
జూలై 22, శుక్రవారం : తొలి వన్డే (క్వీన్స్ పార్క్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
జూలై 24, ఆదివారం : రెండో వన్డే, క్వీన్స్ పార్క్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
జూలై 27, బుధవారం : మూడో వన్డే, క్వీన్స్ పార్క్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
భారత జట్టు :
శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ ( వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, శార్దుల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్