Telugu Global
Sports

క్రికెటర్లకు ఎట్టకేలకు అమెరికా వీసాలు

ఆటంకాలు తొలగడంతో యథావిధిగా శని, ఆదివారాలలో ఫ్లోరిడాలోని బౌల్డరహిల్స్‌ స్టేడియంలో చివరి రెండు మ్యాచ్‌లు యథాతధంగా జరుగనున్నాయి.

US Visa For Indian Cricketers
X

భారత్- వెస్టిండీస్ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో భాగంగా అమెరికా గడ్డపై జరగాల్సిన ఆఖరి రెండుమ్యాచ్ లకు లైన్ క్లియర్ అయ్యింది. కరీబియన్ ద్వీపాలలోని సెయింట్ కిట్స్ లో మూడో టీ-20 మ్యాచ్ ముగించుకున్న రెండుజట్ల క్రికెటర్లకు ఎట్టకేలకు అమెరికా వీసాలు లభించాయి.

గయానా అధ్యక్షుని జోక్యంతో..

ముందుగా నిర్ణయించిన ప్రకారం ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి రెండు టీ-20 మ్యాచ్ లను అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా ఆగస్టు 6, 7 తేదీలలో నిర్వహించాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు సైతం చేసింది. అయితే.. అమెరికా ప్రభుత్వం నుంచి వీసాల జారీ సకాలంలో జరగకపోడంతో.. ఈ మ్యాచ్ లను పోర్డ్ ఆఫ్ స్పెయిన్ వేదికగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మరోవైపు.. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలి జోక్యం చేసుకోవ‌డం ద్వారా క్రికెటర్ల వీసాల జారీకి మార్గం సుగమమయ్యింది. ఆలస్యంగానైనా రెండుజట్ల ఆటగాళ్లకు వీసాలు జారీ చేయడంతో ఫ్లోరిడా మ్యాచ్ లకు తెరలేవనుంది.

ఫ్లోరిడా చేరిన క్రికెట్ జట్లు..

అమెరికా గడ్డపై టీ-20 సమరం కోసం రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్, నికోలస్ పూరన్ కెప్టెన్సీలోని విండీస్ జట్ల ఆటగాళ్లు రెండురోజుల ఆలస్యంగా ఫ్లోరిడాలో అడుగుపెట్టారు. సిరీస్ లోని నాలుగు, ఐదు మ్యాచ్ లను ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్, లాడెర్ హిల్ గ్రౌండ్స్ లోనూ నిర్వహించడానికి రంగం సిద్ధమయ్యింది. భారతజట్టు కరీబియన్ ద్వీపాల పర్యటన అవాంతరాలు, ఆటంకాలతో ఆరంభమైన విషయం తెలిసిందే. ట్రినిడాడ్ నుంచి సెయింట్ కిట్స్ ద్వీపానికి రెండు జట్ల కిట్‌ రాక ఆలస్యంతో రెండో టీ-20 మ్యాచ్‌ మూడు గంటలు ఆలస్యంగా ఆరంభం కాగా, మూడో మ్యాచ్‌ గంటన్నర ఆలస్యంగా నిర్వహించారు. ఇపుడు వీసాల జారీలో సైతం గయానా దేశాధ్యక్షుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ వీసాలు సకాలంలో జారీకాని పక్షంలో చివరి రెండు మ్యాచ్‌లు పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కానీ ఆటంకాలు తొలగడంతో యథావిధిగా శని, ఆదివారాలలో ఫ్లోరిడాలోని బౌల్డరహిల్స్‌ స్టేడియంలో చివరి రెండు మ్యాచ్‌లు యథాతధంగా జరుగనున్నాయి.

రోహిత్ శర్మ ఫిట్..

వెస్టిండీస్‌తో మూడో టీ-20లో బ్యాటింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బందిపడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై బీసీసీఐ వివరణ ఇచ్చింది. రెండురోజుల విశ్రాంతితో రోహిత్ పూర్తిగా కోలుకున్నాడని, మ్యాచ్ ఫిట్ నెస్ తో ఉన్నాడని, సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచులకూ అందుబాటులో ఉంటాడని ప్రకటించింది. వెన్నెముక కండరాలు పట్టేయడంతో రోహిత్.. మూడో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ అసౌకర్యానికి గురై అర్థాంతరంగా ఉపసంహరించుకున్నాడు. 5 బంతుల్లో ఓ సిక్సర్, ఓ బౌండ్రీతో 11 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ లు ముగిసే సమయానికి భారత్ 2-1 ఆధిక్యంతో పైచేయి సాధించింది. మొదటి మూడు మ్యాచ్‌లలో అవకాశం దక్కని హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు చివరి రెండు టీ-20లకు తుదిజట్టులో చేరే అవకాశం ఉంది. గత రెండు టీ-20లలో విఫలమైన అవేశ్ ఖాన్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్‌కూ విశ్రాంతి ఇవ్వనున్నారు.

First Published:  5 Aug 2022 10:51 AM IST
Next Story