200వ మ్యాచ్ లో రాజస్థాన్' రాయల్ ' విన్!
ఐపీఎల్ తొలిసీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తన ద్విశతక పోరును విజయంతో ముగించింది. హోంగ్రౌండ్ జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ప్రస్తుత సీజన్లో తొలివిజయం నమోదు చేసింది.
ఐపీఎల్ తొలిసీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తన ద్విశతక పోరును విజయంతో ముగించింది. హోంగ్రౌండ్ జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ప్రస్తుత సీజన్లో తొలివిజయం నమోదు చేసింది...
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ 8వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ మరోసారి టేబుల్ టాపర్ గా నిలిచింది.
హోంగ్రౌండ్ జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన కీలక సమరంలో నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ ను 32 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా 10 పాయింట్లతో అగ్రస్థానం సంపాదించింది.
యశస్వి జైశ్వాల్ షో...
ఈ కీలక పోరులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయటానికి మొగ్గుచూపిన రాజస్థాన్‌కు ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్ - జోస్ బట్లర్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు.
యువ బ్యాటర్ జైస్వాల్ ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ పరుగులు సాధించడం పైనే దృష్టికేంద్రీకరించాడు. చెన్నై ఓపెనింగ్ బౌలర్ ఆకాశ్‌సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీషాట్లతో జైస్వాల్ విరుచుకు పడ్డాడు. మూడు బౌండ్రీలతో స్కోరుబోర్డును పరుగులెత్తించాడు.
సీనియర్ ఓపెనర్ జోస్ బట్లర్ సైతం బ్యాటు ఝులిపించడంతో చెన్నై బౌలింగ్ ఎటాక్ కకావికలైపోయింది.
ఆకాశ్ తర్వాతి ఓవర్ లోనూ జైశ్వాల్ అదే దూకుడు కొనసాగించాడు. మూడు ఫోర్లు, ఒక భారీ సిక్స్‌తో పరుగుల పంట పండించుకొన్నాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా తన బ్యాట్ కు పని చెప్పాడు. ఓపెనర్లు ఇద్దరు చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసే సరికి రాజస్థాన్ 64 పరుగుల స్కోరుతో 200 లక్ష్యానికి గురిపెట్టింది. ఈ క్రమంలో యశస్వి జైశ్వాల్ కేవలం 26 బంతుల్లో అర్థశతకం సాధించాడు. మరోవైపు స్పిన్నర్ జడేజా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి..బట్లర్ ఔట్ కావడంతో రాజస్థాన్ తొలివికెట్ నష్టపోయింది. 86 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. యశస్వి జోరుకు బ్రేకులు వేసేందుకు కెప్టెన్ ధోనీ తరచూ బౌలర్లను మార్చినా, పలు రకాల వ్యూహాలు అనుసరించినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. అయితే..ఇంపాక్ట్ బౌలర్ గా బౌలింగ్ కు దిగిన దేశ్‌పాండే ఓవర్‌లో జైస్వాల్‌తో పాటు కెప్టెన్ సంజు శాంసన్(17) సైతం ఒకరి వెనుక ఒకరుగా అవుటయ్యారు. డెత్ ఓవర్లలో యువ జోడీ జురెల్, పడిక్కల్ చెలరేగడంతో రాయల్స్200 పరుగుల లక్ష్యాన్ని చేరుకోగలిగింది.
తొలిసారిగా 200 స్కోరు..
ఐపీఎల్ వేదికగా జైపూర సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ తొలిసారిగా 200కు పైగా స్కోరు చేయడం ద్వారా రికార్డు సృష్టించింది.
జైపూర్ వేదికగా ఈ ఘనత సాధించిన తొలిజట్టుగా రికార్డులో చేరింది.రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్లకు 202 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.
యశస్వీ 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు చేయగలిగాడు. జోస్ బట్లర్(27) మరోసారి విఫలమయ్యాడు. తుషార్ దేశ్‌పాండే ఒకే ఓవర్‌లో సంజూ శాంసన్(17), యశస్వీని ఔట్ చేసి రాజస్థాన్ దూకుడుకు పగ్గాలు వేయగలిగారు. . ఆ తర్వాత వచ్చిన సూపర్ హిట్టర్ హెట్‌మెయిర్(8) కూడా తక్కువకే ఔటయ్యాడు.
పథిరన వేసిన 20వ ఓవర్లో ధ్రువ్ జురెల్(34) చెలరేగిపోయాడు. తొలి బంతిని సిక్స్‌గా మలిచాడు. రెండో బంతికి థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ బాదాడు. వైడ్ అయిన నాలుగో బంతికి పరుగుకు ప్రయత్నించాడు. ధోనీ తన మార్క్ త్రోతో అతను రనౌటయ్యాడు. ఐదో బంతిని దేవ్‌దత్ పడిక్కల్(27) బౌండరీకి పంపాడు. ఆఖరి బాల్‌కు 3 పరుగులు వచ్చాయి. దాంతో, రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో తుషార్‌దేశ్‌పాండే రెండు వికెట్లు, తీక్షణ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. జైపూర్ వేదికగా ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలి 200 స్కోరు కావడం విశేషం.
జంపా , అశ్విన్ స్పిన్ లో చెన్నై గల్లంతు!
మ్యాచ్ నెగ్గాలంటే 203 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన చెన్నైకి మెరుపు ఆరంభం దక్కలేదు. ప్రారంభ ఓవర్ లోనే సూపర్ ఓపెనర్ డేవన్ కాన్వే వికెట్ నష్టపోడం ద్వారా ఆత్మరక్షణలో పడిపోయింది.
లెగ్ స్పిన్నర్ ఆడం జంపా తన మొదటి ఓవర్లలోనే డేంజర్ మాన్ డెవాన్ కాన్వే(8)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత.. రుతురాజ్ గైక్వాడ్(47)ను సైతం పెవిలియన్ దారి పట్టించాడు.
అశ్విన్ ఒకే ఓవర్లో అజింక్యా రహానే(15), ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అంబటి రాయుడు(0)ను ఔట్ చేశాడు. దాంతో, 73 పరుగుల స్కోరుకే చెన్నై నాలుగు టాపార్డర్ వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు శివం దూబే, మోయిన్ అలీ(23) ఎదురుదాడికి దిగినా ప్రయోజనం లేకపోయింది. ఐదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యంతో పరిస్థితి చక్కదిద్దటానికి ప్రయత్నించి విఫలమయ్యారు.రహానే(15), రాయుడు(0) విఫలం కావడం చెన్నై పరాజయానికి కారణమయ్యింది.
కుల్దీప్ వేసిన 20వ ఓవర్లలో చెన్నై విజయానికి 37 పరుగులు కావాలి. ఆఖరి బంతికి శివం దూబే అవుట్ కావడంతో(52) చెన్నై ఓటమి, రాజస్థాన్ గెలుపు ఖాయమైపోయాయి. అల్ రౌండర్ రవీంద్ర జడేజా 21 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. చివరకు చెన్నై 6 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రవీంద్ర జడేజాకు ఇది 300వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. 300కు టీ-20 మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో జడేజా చేరగలిగాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆడం జంపా 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.
రాయల్స్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ప్రస్తుత సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన 8 రౌండ్ల మ్యాచ్ ల్లో రాజస్థాన్ రాయల్స్ 5 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో 10 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.
చెన్నై సైతం 8 రౌండ్లలో 5 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో లీగ్ టేబుల్ మూడోస్థానంలో కొనసాగుతోంది.