Telugu Global
Sports

నేటినుంచే భారత్- వెస్టిండీస్ టీ-20 సిరీస్ షో!

టీ-20 టాప్ ర్యాంకర్ భారత్ కు 7వ ర్యాంకర్ వెస్టిండీస్ సవాలు విసురుతోంది. బ్రయన్ లారా స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు తొలిపోరు ప్రారంభంకానుంది.

నేటినుంచే భారత్- వెస్టిండీస్ టీ-20 సిరీస్ షో!
X

నేటినుంచే భారత్- వెస్టిండీస్ టీ-20 సిరీస్ షో!

టీ-20 టాప్ ర్యాంకర్ భారత్ కు 7వ ర్యాంకర్ వెస్టిండీస్ సవాలు విసురుతోంది. బ్రయన్ లారా స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు తొలిపోరు ప్రారంభంకానుంది...

కరీబియన్ ద్వీపాలలో భారత పర్యటన ఆఖరి అంకానికి చేరింది. రెండుమ్యాచ్ ల టెస్టు, మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ముగియడంతో..ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ కు ఈరోజు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని తారుబా వేదికగా తెరలేవనుంది.

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం చిట్టిపొట్టి టీ-20 ఫార్మాట్లో భారత్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా ఉంటే..వెస్టిండీస్ 7వ ర్యాంకులో కొనసాగుతోంది.

రోహిత్, విరాట్ లేకుండానే....

వైట్ బాల్ క్రికెట్లో భారత సూపర్ స్టార్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలకు ఎంపిక సంఘం విశ్రాంతినిచ్చింది. ఐపీఎల్ 16వ సీజన్లో అత్యుత్తమంగా రాణించిన యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ లాంటి పలువురు యువక్రికెటర్లకు చోటు కల్పించింది.

హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని భారత టీ-20 జట్టుకు పవర్ ఫుల్ కరీబియన్ జట్టు నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.

యశస్వి, తిలక్ వర్మలకు చాన్స్...

సీనియర్ స్టార్ల స్థానాలను భర్తీ చేయటానికి జట్టులో తొలిసారిగా చేరిన డాషింగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, మిడిలార్డర్ ఆటగాడు తిలక్ వర్మ..భారత్ తరపున టీ-20 అరంగేట్రానికి ఎదురుచూస్తున్నారు.

శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్థిక్ పాండ్యాలతో భారత బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

పేస్ బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్, స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహాల్, రవి బిష్నోయ్ లతో బలంగా ఉంది.

ఓపెనర్లలో శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్ , మిడిలార్డర్లో సంజు శాంసన్, తిలక్ వర్మ, స్పిన్నర్లలో యజువేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్ ల నడుమ తుదిజట్టులో స్థానం కోసం గట్టి పోటీ నెలకొని ఉంది.

హేమాహేమీలతో కరీబియన్ ఆర్మీ...

మిగిలిన ఫార్మాట్లలో ఎలా ఉన్నా..టీ-20 ఫార్మాట్లో మాత్రం వెస్టిండీస్ అత్యంత ప్రమాదకరమైన జట్టుగా ఉంది. రోవ్ మన్ పావెల్ నాయకత్వంలోని వెస్టిండీస్ జట్టు ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో 2-1తో విజేతగా నిలవడం ద్వారా మరో సిరీస్ విజయానికి గురి పెట్టింది.

కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, షాయ్ హోప్, షిమ్రోన్ హెట్ మేయర్, జేసన్ హోల్డర్, అకిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెకోయ్, ఓషియానే థామస్ లతో కరీబియన్ ఆర్మీ...భారత్ కు సవాలు విసురుతోంది.

లారా స్టేడియంలో పరుగుల వెల్లువే!

వన్డే సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ కు వేదికగా నిలిచిన తారుబా బ్రయన్ లారా స్టేడియం బ్యాటర్ల స్వర్గధామమని తేలిపోయింది. భారతజట్టు 50 ఓవర్లలో మ్యాచ్ లో 351 పరుగుల భారీస్కోరు సాధించడంతో పాటు 200 పరుగుల విజయంతో సిరీస్ ను 2-1తో కైవసం చేసుకోగలిగింది.

ఈ రోజు జరిగే తొలి టీ-20 మ్యాచ్ కు సైతం లారా స్టేడియమే ఆతిథ్యమిస్తోంది. 200కు పైగా స్కోర్లు నమోదు కావడం ఖాయమని క్యురేటర్ మాత్రమే కాదు..ఈ స్టేడియం గత రికార్డులు సైతం చెబుతున్నాయి.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ ధూమ్ ధామ్ సమరంలో రెండుజట్లు స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే రసవత్తర పోరు ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  3 Aug 2023 11:45 AM IST
Next Story