ఫైనల్లో దక్షిణాఫ్రికా..సెమీస్ లో తేలిపోయిన అప్ఘనిస్థాన్!
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు దక్షిణాఫ్రికా తొలిసారిగా చేరుకొంది. తొలిసెమీఫైనల్లో సంచలనాల అప్ఘనిస్థాన్ తేలిపోయింది.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు దక్షిణాఫ్రికా తొలిసారిగా చేరుకొంది. తొలిసెమీఫైనల్లో సంచలనాల అప్ఘనిస్థాన్ తేలిపోయింది.
2024- టీ-20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో ఎలాంటి సంచలనం నమోదు కాలేదు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని బ్రయన్ లారా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్ పోరులో 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ తేలిపోయింది. గ్రూప్ లీగ్ నుంచి సూపర్ -8 రౌండ్ వరకూ న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మేటిజట్లపై సంచలన విజయాలతో తొలిసారిగా నాకౌట్ రౌండ్ చేరిన అప్ఘన్ ఘోరపరాజయం చవిచూసింది.
56 పరుగులకే కుప్పకూలిన అప్ఘనిస్థాన్....
ఫైనల్లో చోటు కోసం జరిగిన ఈ నాకౌట్ పోరులో కీలక టాస్ నెగ్గిన అప్ఘన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని ఓటమి కొనితెచ్చుకొంది. బౌలర్లకు అత్యంత అనువుగా ఉన్న వాతావరణం, వికెట్ పైన కేవలం 56 పరుగులకే ఆలౌటయ్యింది.
రౌండ్ డౌన్ ఆటగాడు అజంతుల్లా ( 10 ) మినహా మిగిలిన అప్ఘన్ బ్యాటర్లు సింగిల్ డిజిట్, డకౌట్లకే పరిమితమయ్యారు. ఓపెనర్లు గుర్బాజ్ 0, ఇబ్రహీం జడ్రాన్ 2, వన్ డౌన్ గుల్బదీన్ 9, ఆల్ రౌండర్ నబీ 0 పరుగులకు అవుటయ్యారు. మిడిలార్డర్ బ్యాటర్లలో కరోటీ 2, జన్నత్ 8, కెప్టెన్ రషీద్ 8 పరుగులు మాత్రమే చేయగలిగారు.
కేవలం 11.5 ఓవర్లలోనే అప్ఘన్ జట్టు 56 పరుగులకే కూలిపోయింది.
సఫారీ బౌలర్లలో మార్కో జెన్సన్ 3,రబడ, నోర్గే చెరో 2 వికెట్లు, లెఫ్టామ్ స్పిన్నర్ షంషీ 3 వికెట్లు పడగొట్టారు.
8.5 ఓవర్లలోనే సఫారీల విన్...
మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 57 పరుగులు మాత్రమే చేయాల్సిన దక్షిణాఫ్రికా కేవలం 8.5 ఓవర్లలోనే 9 వికెట్ల విజయంతో ప్రపంచకప్ ఫైనల్ కు తొలిసారిగా చేరుకోగలిగింది.
డాషింగ్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ 5 పరుగులకే అవుట్ కాగా...రీజా హెండ్రిక్స్ 25, కెప్టెన్ మర్కరమ్ 23 పరుగులతో అజేయంగా నిలిచారు. దక్షిణాఫ్రికా విజయంలో ప్రధానపాత్ర వహించిన లెఫ్టామ్ పేసర్ మార్కో జెన్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ప్రపంచకప్ సెమీస్ చరిత్రలో ఇదే అత్యల్పస్కోరు..
2008 నుంచి జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ తొమ్మిది టోర్నీల సెమీస్ లో అప్ఘన్ సాధించిన 56 పరుగులే అత్యల్పస్కోరు కావడం విశేషం. అంతేకాదు..40 ఓవర్లపాటు సాగాల్సిన ఈ మ్యాచ్ కేవలం 20 ఓవర్లలోనే ముగియటం మరో రికార్డు.
ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల సెమీస్ లో భాగంగా ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లు ఆడిన సఫారీటీమ్ 6 పరాజయాలు, ఒకే ఒక్క గెలుపుతో నిలిచింది. 1999 ప్రపంచకప్ సెమీస్ లో భాగంగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది.
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ సెమీస్ వరకూ దక్షిణాఫ్రికాజట్టుకు ఇది వరుసగా 8 విజయం. టీ-20 ఫార్మాట్లో సఫారీజట్టు ఎనిమిది వరుస విజయాలు సాధించడం ఇదే మొదటిసారి.
ప్రపంచకప్ సెమీస్ లో ఇదే అతిపెద్ద వికెట్ల విజయం కూడా కావడం మరో రికార్డు. సఫారీ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్కే గ్రూప్ లీగ్ నుంచి సెమీస్ వరకూ 13 వికెట్లు పడగొట్టడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.
ఈనెల 29న బార్బడాస్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగే ప్రపంచకప్ టైటిల్ పోరులో..భారత్- ఇంగ్లండ్ జట్ల నడుమ జరిగే రెండో సెమీఫైనల్లో నెగ్గినజట్టుతో దక్షిణాఫ్రికా తలపడనుంది.
అప్ఘన్ ఓటమి భారత్ పుణ్యమే- మైకేల్ వాన్..
ప్రపంచకప్ సెమీస్ లో అప్ఘనిస్థాన్ ఘోరపరాజయానికి భారతజట్టే కారణమంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత మైకేల్ వాన్ ఆరోపించారు. వాస్తవానికి ట్రినిడాడ్ వేదికగా భారత్ ఆడాల్సిన సెమీఫైనల్స్ మ్యాచ్ ను గయానాకు మార్చి..వేరే వేదికలో ఆడాల్సిన అప్ఘన్ మ్యాచ్ ను ట్రినిడాడ్ అండ్ టొబాగోకు మార్చడం అన్యామంటూ విరుచుకుపడ్డారు.
భారత్ ప్రయోజనాల కోసం నిర్వాహక సంఘం ఇలా చేయటం అన్యామంటూ మండిపడ్డారు. గయనా కాలమానం ప్రకారం..భారత్ లో రాత్రి 8 గంటలకు సెమీస్ మ్యాచ్ ప్రత్యక్షప్రసారం ఉండడంతో..రేటింగ్ కోసం, బ్రాడ్ కాస్టర్ కోసం సెమీస్ వేదికను మార్చారంటూ వాన్ వివరించాడు.