భారత్- దక్షిణాఫ్రికా పోరుకు వానముప్పు..?
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచ కప్ ను అకాలవర్షాలు వెంటాడుతున్నాయి. పెర్త్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం జరిగే సూపర్ -12 కీలక పోరుకు సైతం వరుణగండం పొంచి ఉంది.
కంగారూల్యాండ్ లోని ఏడు వేదికల్లో గత రెండువారాలుగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో ఇప్పటికే నాలుగు కీలక మ్యాచ్ లు వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిపోయాయి. ప్రధానంగా మెల్‌బోర్న్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ లు అకాలవర్షాలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్ఘనిస్థాన్ లాంటి జట్లు పూర్తిపాయింట్లు సాధించే అవకాశం ఉన్న మ్యాచ్ ల్లో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.
మరోవైపు సిడ్నీ, పెర్త్ నగరాల లాంటి ఇతర వేదికల్లో జరిగిన మ్యాచ్ లు అభిమానులను ఓలలాడిస్తుంటే.. మరోవైపు మెల్‌బోర్న్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ లు వర్షంతో కనీసం ఒక్క బంతీ పడకుండా రద్దుకావడంతో నిర్వాహక సంఘం సైతం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. మెల్‌బోర్న్ వేదికగా జరగాల్సిన నాలుగు మ్యాచ్ లు రద్దయిన నేపథ్యంలో..పెర్త్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే కీలక పోరుకు భారత్, దక్షిణాఫ్రికాజట్లు సై అంటే సై అంటున్నాయి.
పెర్త్‌నూ కమ్ముకున్న కారుమేఘాలు..
సూపర్ -12 రౌండ్ గ్రూప్ -2 టాపర్ స్థానం కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడుతున్నాయి. టాప్ ర్యాంకర్ టీమిండియా పాక్, డచ్ జట్లను ఓడించడం ద్వారా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు మాత్రం జింబాబ్వేతో వర్షంతో అర్థాంతరంగా ముగిసిన మ్యాచ్ లో పాయింట్లు పంచుకోవడంతో పాటు.. బంగ్లాదేశ్ ను చిత్తు చేయడం ద్వారా 3 పాయింట్లతో భారత్ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది.
ఆదివారం పెర్త్ వేదికగా జరిగే మూడోరౌండ్ పోరు రెండుజట్లకూ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టుకే గ్రూపు టాపర్ స్థానంతో పాటు సెమీస్ చోటు ఖాయమవుతుంది. పదునైన బౌలింగ్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికా, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. సూపర్ సండే ఫైట్ గా జరిగే ఈమ్యాచ్ ను సైతం వరుణదేవుడు భయపెడుతున్నాడు.
సిడ్నీకి 3వేల కిలోమీటర్లు.. సింగపూర్, ఇండోనేసియాలకు అత్యంత సమీపంలో ఉన్న పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో గత కొద్దిరోజులుగా భారీగా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం పెర్త్ స్టేడియం పరిసర ప్రాంతాలను నీలిమేఘాలు కమ్ముకొని ఉన్నాయి. మ్యాచ్ జరిగే ఆదివారం రోజూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అడపాదడపా చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
సాధారణంగా ఆస్ట్రేలియాలో అక్టోబర్ మాసంలో వేసవికాలం మొదలవుతుంది. అయితే అనూహ్యంగా అకాలవర్షాలు కురివటం ఆస్ట్రేలియా వాణిజ్య రాజధాని మెల్‌బోర్న్ ను మాత్రమే కాదు ప్రపంచకప్ నిర్వాహక సంఘాన్ని, అభిమానులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.