Telugu Global
Sports

టీమిండియా ఓడిపోవడానికి కారణాలివే..

ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలయింది. ఏ దశలోనూ ఇంగ్లండ్ కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది.

The reasons why Team India lost the Semi-Final Against England
X

టీమిండియా ఓడిపోవడానికి కారణాలివే..

ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలయింది. ఏ దశలోనూ ఇంగ్లండ్ కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. టీమిండియా నిజంగా అంత వీక్‌గా ఉందా? అసలు మ్యాచ్ ఓడిపోడానికి కారణాలేంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

కీలక మ్యాచ్‌లో ఇలా ఘోరంగా ఓటమిపాలయినప్పుడు విమర్శలు రావడం సహజం. అలాగే ఇలాంటి సమయంలోనే జట్టు తప్పొప్పులను ఒకసారి రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. టీమిండియా ఓటమికి ప్రధానంగా కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేంటంటే..

వీక్ బౌలింగ్

జట్టుకి బుమ్రా లాంటి కీలక పేసర్ దూరం కావడం టీమిండియాకు తట్టుకోలేని దెబ్బ. బుమ్రాను భర్తీ చేసే మరో ఆటగాడు టీంలో లేని పరిస్థితి. మంచి పేస్ బౌలింగ్‌తో పాటు ఎంతో అనుభవం ఉన్న షమీని జట్టులోకి తీసుకున్నప్పటికీ అతను అనుకున్నంతగా రాణించలేదు. మిగతా బౌలర్లు అప్పుడప్పుడు మెరిపించినా పూర్తి స్థాయిలో నిలకడగా రాణించలేకపోయారు. దాంతో ఛేజింగ్ అయితే తప్ప టీమిండియా గెలవలేని పరిస్థితి వచ్చింది.

టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్

టాప్ ఆర్డర్‌‌గా బరిలోకి దిగుతున్న రోహిత్, రాహుల్‌లు ఏ మ్యాచ్ లోనూ అనుకున్నంతగా రాణించట్లేదు. పవర్ ప్లేలో మంచి రన్ రేట్, స్కోర్ సాధించడంతో ఫెయిల్ అవుతూ వస్తున్నారు. దీంతో మిడిల్ ఆర్డర్‌‌లో ఆడే సూర్య కుమార్ యాదవ్, కోహ్లీ, పాండ్యాపై ఆధారపడాల్సి వస్తుంది. జట్టులో ఆ ముగ్గురు తప్ప మరెవరూ బ్యాట్‌తో సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది కూడా టీమిండియా ఫెయిల్యూర్‌‌కు మరో ముఖ్య కారణం.

కుర్రాళ్లు లేరు

మిగతా సమయాల్లో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చినా ప్రపంచకప్ లాంటి కీలక టోర్నీల్లో బీసీసీఐ సీనియర్లకే మొగ్గు చూపుతుంది. కుర్ర ఆటగాళ్ల కంటే మూడు పదులు దాటిన ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. జట్టులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ(35), కోహ్లీ(34), దినేష్ కార్తీక్(37)షమీ(32), భువీ(31), సూర్యకుమార్ యాదవ్(32)ల్లో.. కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్‌ను మినహాయిస్తే మిగిలిన ఏ ఒక్కరూ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందుకే టీమిండియాకు యువ ఆటగాళ్ల అవసరం ఉందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

ఇంగ్లండ్ ఆటతీరు

టీమిండియా సంగతి అటుంచితే సెమీస్‌లో ఇంగ్లండ్ అద్భుతంగా రాణించింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. మరీ ముఖ్యంగా.. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (86), జాస్ బట్లర్(80) పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్ స్టాండర్డ్స్‌ను మరోసారి గుర్తు చేశారు. ఓపెనర్లు రాణిస్తే మ్యాచ్ వన్ సైడ్ ఎలా అవుతుందో తెలియజేశారు. టీమిండియా ఓపెనర్ల పేలవ ప్రదర్శన, ఇంగ్లండ్ ఓపెనర్ల అద్భుత బ్యాటింగ్ కారణంగా టీమిండియా మ్యాచ్‌ను జారవిడుచుకోక తప్పలేదు.

First Published:  11 Nov 2022 11:46 AM GMT
Next Story