Telugu Global
Sports

నేటినుంచే ప్రపంచకప్ సూపర్-12 హంగామా

ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ లో అసలుసిసలు పోరుకు రంగం సిద్ధమయ్యింది. గతవారం రోజులుగా జరిగిన తొలిదశ అర్హత రౌండ్ పోటీలు ముగియటంతో సూపర్ -12 రౌండ్లో తలపడే జట్లేవే తేలిపోయింది.

నేటినుంచే ప్రపంచకప్ సూపర్-12 హంగామా
X

ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ లో అసలుసిసలు పోరుకు రంగం సిద్ధమయ్యింది. గతవారం రోజులుగా జరిగిన తొలిదశ అర్హత రౌండ్ పోటీలు ముగియటంతో సూపర్ -12 రౌండ్లో తలపడే జట్లేవే తేలిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో రన్నరప్ న్యూజిలాండ్ పోరుతో 12జట్ల సూపర్ సమరానికి తెరలేవనుంది....

2022 ప్రపంచకప్ టీ-20 సమరంలోని తొలిదశ ఎనిమిదిజట్ల క్వాలిఫైయింగ్ దశ సంచలనాలతో ముగిసింది. రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ తొలిదశ నుంచే నిష్క్ర్రమించడం, జింబాబే తొలిసారిగా సూపర్ -12 రౌండ్ కు అర్హత సంపాదించడం, నెదర్లాండ్స్, ఐర్లాండ్ జట్లు మెయిన్ రౌండ్ కు అర్హత సాధించడం జరిగిపోయాయి.

దీంతో ..మొత్తం 12జట్ల గ్రూప్ లీగ్ పోరుకు రంగం సిద్ధమయ్యింది.

అక్టోబర్ 22 నుంచి నవంబర్ 6 వరకూ జరిగే లీగ్ సమరంలో మొత్తం 12 జట్లు రెండుగ్రూపులుగా పోటీపడతాయి.

భారత్ కు భలే గ్రూపు.....

గ్రూప్-1 లీగ్ లో మాజీ చాంపియన్లు భారత్, పాకిస్థాన్ తో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ , గ్రూప్ -2లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్, మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, శ్రీలంక, అఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి.

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బో్ర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే సమరంలో మాజీ చాంపియన్లు భారత్, పాకిస్థాన్ ఢీ కొంటాయి.

ఈనెల 27న సిడ్నీ వేదికగా జరిగే రెండోరౌండ్ పోటీలో నెదర్లాండ్స్, 30న పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికా, నవంబర్ 2న అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్, నవంబర్ 6న మెల్బోర్న్ వేదికగా జింబాబ్వేజట్టుతోనూ భారత్ తన మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

గ్రూపులీగ్ దశలో మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో తలపడతాయి. నవంబర్ 9, 10 తేదీలలో సెమీఫైనల్స్, 13న ఫైనల్స్ నిర్వహిస్తారు.

విజేతలకు 45 కోట్ల భారీ ప్రైజ్ మనీ...

ఈ టోర్నీని మొత్తం 45 కోట్ల రూపాయల ( 56 లక్షల డాలర్ల)ప్రైజ్ మనీతో నిర్వహిస్తున్నారు. విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు 13 కోట్ల 50 లక్షల 35వేల 440 రూపాయల ప్రైజ్ మనీ అందచేయనున్నారు.

రన్నరప్ జట్టుకు 6 కోట్ల 52 లక్షల 64వేల 280 రూపాయలు దక్కనున్నాయి. సెమీస్ లో ఓడిన రెండుజట్లకు చెరో 3 కోట్ల 26 లక్షల 20వేల 220 రూపాయల చొప్పున ఇస్తారు. సూపర్ -12 రౌండ్ నుంచే నిష్క్ర్రమించినజట్లకు 57 లక్షల రూపాయల చొప్పున, సూపర్ -12 రౌండ్లో విజయం సాధించిన జట్లకు మ్యాచ్ కు 32 లక్షల 62వేల 22 రూపాయల చొప్పున అందచేస్తారు.

గత ప్రపంచకప్ విజేతకు 11 కోట్ల 90 లక్షలు ప్రైజ్ మనీగా చెల్లించగా...ప్రస్తుత టోర్నీలో ఆ మొత్తం 13 కోట్ల 50 లక్షలకు పెరిగింది.

ఆస్ట్ర్రేలియాలోని ఏడు ప్రధానవేదికల్లో నిర్వహిస్తున్న ఈటోర్నీ ప్రత్యక్షంగా లక్షలాదిమందిని, పరోక్షంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను రానున్న మూడువారాలపాటు అలరించనుంది.

2007 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన టాప్ ర్యాంకర్ భారత్ తో పాటు ఆతిథ్య ఆస్ట్ర్రేలియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు డార్క్ హార్స్ గా టైటిల్ వేటకు దిగుతున్నాయి.

రానున్న కొద్దివారాలపాటు నిలకడగా రాణించినజట్టే విశ్వవిజేతగా నిలవడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  22 Oct 2022 10:26 AM IST
Next Story