భారత్ కు సెమీస్ బెర్త్..జింబాబ్వేతో నేడే ఆఖరి సూపర్ ఫైట్
ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ కు చోటు ఖాయమైన నేపథ్యంలో ఈరోజు జింబాబ్వేతో జరిగే ఆఖరిరౌండ్ పోరుకు రోహిత్ సేన సిద్ధమయ్యింది. మెల్బోర్న్ వేదికగా ఈరోజు జరిగే సూపర్-12 ఆఖరిరౌండ్ పోరులో విజయమే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతోంది.
ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ కు చోటు ఖాయమైన నేపథ్యంలో ఈరోజు జింబాబ్వేతో జరిగే ఆఖరిరౌండ్ పోరుకు రోహిత్ సేన సిద్ధమయ్యింది. మెల్బోర్న్ వేదికగా ఈరోజు జరిగే సూపర్-12 ఆఖరిరౌండ్ పోరులో విజయమే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. ఈ సూపర్ సండే ఫైట్ భారతకాలమాన ప్రకారం మధ్యాహ్నం 2-30కి ప్రారంభమవుతుంది..
టీ-20 ప్రపంచకప్ సూపర్-12 పోరు క్లయ్ మాక్స్ దశకు చేరుకొంది. ఇప్పటికే సెమీఫైనల్స్ నాకౌట్ కు మూడు( భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ )జట్లు చేరుకోడంతో..భారత్-జింబాబ్వే జట్ల మధ్య జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ నామమాత్రంగా మిగలనుంది.
గ్రూప్ -2 ఆఖరి రౌండ్ పోరులో దక్షిణాఫ్రికా ను పసికూన నెదర్లాండ్స్ చిత్తు చేయడంతో..ఆఖరిరౌండ్ మ్యాచ్ ఆడకుండానే సెమీస్ లో భారత్ చోటు ఖాయమైపోయింది. మొదటి నాలుగురౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి 6 పాయింట్లతో టాపర్ గా నిలిచిన భారత్ నాలుగో విజయంతో సూపర్ -12 గ్రూప్ సమరాన్ని ముగించాలన్న లక్ష్యంతో ఉంది.
గత ఎనిమిదేళ్ల కాలంలో తొలిసారిగా ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ కు తొలిసారిగా అర్హత సాధించిన జింబాబ్వే తో భారత్ తొలిసారి పోటీపడబోతోంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ కు దూరమైన జింబాబ్వే తన ఆఖరిపోరాటంలో భారత్ కు గట్టిపోటీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది.
వానగండం లేనట్లే...!
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా ప్రస్తుత ప్రపంచకప్ లో భాగంగా జరగాల్సిన మూడుమ్యాచ్ లు వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిన నేపథ్యంలో..ఈరోజు జరిగే మ్యాచ్ కు ఏవిధమైన ఆటంకం ఉండబోదని వాతావరణశాఖ ప్రకటించింది.
మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఫాస్ట్ , స్వింగ్ బౌలర్లకు పిచ్, వాతావరణం అనువుగా ఉంటుందని స్టేడియం క్యూరేటర్ చెబుతున్నారు.
ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే..నంబర్ వన్ భారత్ కు జింబాబ్వే ఏమాత్రం సరిజోడీ కాకపోయినా...మాజీచాంపియన్ పాకిస్థాన్ పై సాధించిన ఒక్క పరుగు సంచలన విజయంతో కెప్టెన్ రోహిత్ పూర్తిజట్టుతోనే పోటీకి దిగాలని నిర్ణయించాడు.
ఇప్పటి వరకూ ఆడిన నాలుగురౌండ్లలో మూడు విజయాలు, ఓ ఓటమితో 6 పాయింట్లు సాధించిన భారత్...జింబాబ్వేను సైతం ఓడించగలిగితే గ్రూపు టాపర్ గా సెమీస్ కు చేరుకోగలుగుతుంది.
తుదిజట్టులో ఎలాంటి మార్పులుచేర్పులు లేకుండానే భారత్ పోటీకి దిగనుంది.
బలహీనంగా జింబాబ్వే బ్యాటింగ్..
ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ ల్లో జింబాబ్వే ఓపెనర్లు తమజట్టుకు చక్కటి ఆరంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. సీన్ విలియమ్స్, సికిందర్ రజా లాంటి ఒకరిద్దరు సీనియర్ బ్యాటర్లు మాత్రమే జట్టును ఆదుకొంటూ వస్తున్నారు.
షమీ, భువీ, అర్షదీప్, అశ్విన్, పాండ్యా, అక్షర్ లతో కూడిన భారత్ బౌలింగ్ ఎటాక్ ను ఎదుర్కొని జింబాబ్వే ఏమాత్రం పరుగులు సాధించగలదన్నది అనుమానమే.
మరోవైపు...నాలుగుమ్యాచ్ ల్లో మూడు నాటౌట్ హాఫ్ సెంచరీలతో 220 పరుగులు సాధించిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ మరో 68 పరుగులు సాధించగలిగితే టీ-20 క్రికెట్లో 4వేల పరుగుల మైలురాయిని చేరుకోగలుగుతాడు.
ఇక...ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో 35 పరుగులు చేస్తే..2022 సీజన్లో 1000 పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచే అవకాశం ఉంది.
జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్ రజా ఈ ఏడాది ఆడిన 23 టీ-20ల్లో 701 పరుగులతో దూకుడుమీద కనిపిస్తున్నాడు.
టాస్ గెలిచిన కెప్టెన్లకు పరాజయాలే ఎక్కువ...
ప్రస్తుత ప్రపంచకప్ లో టాస్ నెగ్గిన కెప్టెన్ల విజయం శాతం 33గా మాత్రమే ఉండటంతో..టాస్ కు అంతగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. జింబాబ్వే ప్రత్యర్థిగా టీ-20ల్లో 5-2
రికార్డుతో ఉన్న భారత్ ...ప్రపంచకప్ లో ప్రత్యర్థిగా పోటీ పడనుంది.
ఫాస్ట్ బౌలర్లకు అనువుగా ఉండే మెల్బో్ర్న్ పిచ్ పైన పేస్, స్వింగ్ బౌలర్లకు చేతినిండా పనే అని చెప్పక తప్పదు. ఇదే గ్రౌండ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన
ఉత్కంఠభరిత పోరులో 4 వికెట్ల విజయం సాధించిన భారత్ మరో విజయంతో గ్రూపు టాపర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ కు..11వ ర్యాంకర్ జింబాబ్వే ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే.!