Telugu Global
Sports

ప్రపంచకప్ లో భారత మ్యాచ్ లకు జనమే జనం!

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో భారత మ్యాచ్ లకు అభిమానులు వెల్లువెత్తుతున్నారు. మెల్బోర్న్, పెర్త్, అడిలైడ్ లాంటి వేదికలు కిటకటలాడుతూ నిర్వాహక సంఘానికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

ప్రపంచకప్ లో భారత మ్యాచ్ లకు జనమే జనం!
X

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో భారత మ్యాచ్ లకు అభిమానులు వెల్లువెత్తుతున్నారు. మెల్బోర్న్, పెర్త్, అడిలైడ్ లాంటి వేదికలు కిటకటలాడుతూ నిర్వాహక సంఘానికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి...

కంగారూల్యాండ్ లోని ఏడు స్టేడియాలు వేదికలుగా జరుగుతున్న 2022 టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో భారతజట్టు ఆడిన మ్యాచ్ లకు అభిమానులు భారీసంఖ్యలో తరలిరావడంతో నిర్వాహక సంఘం మాత్రమే కాదు..కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఉబ్బితబ్బిబవుతున్నాడు.

సూపర్ -12 గ్రూప్ -2 రౌండ్లో భాగంగా మెల్బోర్న్, సిడ్నీ, పెర్త్ , అడిలైడ్ వేదికలుగా టాప్ ర్యాంకర్ భారత్ ఆడినమ్యాచ్ లకు అభిమానులు రికార్డుస్థాయిలో హాజరయ్యారు.

నిండుకుండలా మెల్బోర్న్ స్టేడియం...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికల్లో ఒకటైన మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ ఆడిన రెండుమ్యాచ్ లకు కలిపి... లక్ష 70 వేల మందికి పైగా అభిమానులు హాజరు కావడం ఓ రికార్డుగా నిలిచిపోతుంది.

సాధారణంగా స్థానిక లేదా ఆతిథ్యజట్టు ఆడుతుంటే అభిమానులు భారీసంఖ్యలో తరలి రావడం, స్టేడియాలు కిటకిటలాడటం సహజం. అయితే..దానికి భిన్నంగా ఓ విదేశీజట్టుగా భారత్ ఆడిన మ్యాచ్ లకు అభిమానులు పోటెత్తడంతో నిర్వాహక అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఆతిథ్య ఆస్ట్ర్రేలియా క్రికెట్ బోర్డు కాసులపంట పండించుకొంటున్నాయి.

భారత్-పాక్ మ్యాచ్ కు 90వేలమంది...

మెల్బోర్న్ వేదికగా ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ -2 తొలిరౌండ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ తలపడితే..90వేల 293మంది అభిమానులు హాజరయ్యారు.

మెల్బోర్న్ స్టేడియం కెపాసిటీ 90వేలు కాగా...ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ కే 90వేల 293మంది హాజరు కావడం సరికొత్త రికార్డుగా నిలిచింది.

ఆస్ట్ర్రేలియాలోని భారత్, పాక్ సంతతి అభిమానులతో పాటు..భారత ఉపఖండ దేశాల సంతతి అభిమానులు సైతం భారీసంఖ్యలో హాజరయ్యారు. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ సూపర్ సండే సమరానికి స్టేడియం కిటకిటలాడి పోయింది. మెల్బోర్న్ స్టేడియం నిండుకుండలా మారిపోయింది.


భారత్- జింబాబ్వే మ్యాచ్ కు సైతం...

భారత్- జింబాబ్వేజట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన సూపర్ -12 ఆఖరిరౌండ్ మ్యాచ్ కు సైతం 82వేల 507 మంది అభిమానులు హాజరు కావడం విశేషం. పసికూన నెదర్లాండ్స్ చేతిలో దిగ్గజ దక్షిణాఫ్రికాజట్టు అనూహ్య పరాజయం పొందటంతో ఆఖరిరౌండ్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ కు సెమీస్ బెర్‌ ఖాయమైనా..అభిమానులు భారీగానే తరలి వచ్చారు. వాస్తవానికి 88వేల మంది వరకూ రాగలరని ఆతిథ్య ఆస్ట్ర్రేలియాక్రికెట్ సంఘం అంచనావేసింది. అయినా 82వేల 507 మంది హాజరు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.

సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్, అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్, పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాజట్లతో భారత్ ఆడిన మ్యాచ్ లకు సైతం అభిమానులు అంచనాలకు మించి హాజరయ్యారు.

మరోవైపు..వేదికతో సంబంధం లేకుండా తాము ఎక్కడ మ్యాచ్ లు ఆడినా అభిమానులు భారీగా హాజరు కావడం పట్ల భారత కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు.

తమ మ్యాచ్ లను చూడటానికి వస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.తమను అభిమానిస్తున్న వారికోసం అత్య్తుత్తమస్థాయిలో రాణించడానికి తమజట్టు ప్రయత్నిస్తోందని చెప్పాడు. అభిమానుల ఆశీసులే తమకు బలమని ప్రకటించాడు.

అడిలైడ్ ఓవల్ వేదికగా గురువారం భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ పోరుకు సైతం స్టేడియం కిటకిటలాడి పోనుంది. ఒకవేళ ప్రపంచకప్ ఫైనల్స్ కు

దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్లు చేరుకొంటే...ఈ నెల 13న మెల్బోర్న్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ కు లక్షమందికి పైగా హాజరైనా ఆశ్చర్యపోనక్కరలేదు.

First Published:  7 Nov 2022 1:52 PM IST
Next Story