Telugu Global
Sports

బంగ్లా వికెట్ కీపర్ కు విరాట్ కానుక!

విరాట్ కొహ్లీ గొప్ప క్రికెటర్ మాత్రమేకాదు..అంతే గొప్పమనసున్న ఆటగాడు కూడా. బంగ్లాదేశ్ తో ప్రపంచకప్ సూపర్ -12 పోరు ముగిసిన రోజు విరాట్ తన పెద్దమనసును, క్రికెట్ స్ఫూర్తిని మరోసారి చాటుకొన్నాడు.

బంగ్లా వికెట్ కీపర్ కు విరాట్ కానుక!
X

విరాట్ కొహ్లీ గొప్ప క్రికెటర్ మాత్రమేకాదు..అంతే గొప్పమనసున్న ఆటగాడు కూడా. బంగ్లాదేశ్ తో ప్రపంచకప్ సూపర్ -12 పోరు ముగిసిన రోజు విరాట్ తన పెద్దమనసును, క్రికెట్ స్ఫూర్తిని మరోసారి చాటుకొన్నాడు...

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్-2 రౌండ్ మొదటి నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో ఇప్పటికే మూడు అజేయ అర్థశతకాలు సాధించిన భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ మరోసారి తన పెద్దమనసును, క్రీడాస్ఫూర్తిని చాటుకొన్నాడు. క్రికెట్ ను పెద్దమనుషుల, మర్యాదస్తుల క్రీడ అని ఎందుకంటారో తన చేతల ద్వారా నిరూపించాడు.

అడిలైడ్ ఓవల్ వేదికగా బంగ్లాదేశ్ తో ఉత్కంఠభరితంగా సాగిన నాలుగోరౌండ్ థ్రిల్లర్ మ్యాచ్ లో భారత్ 5 పరుగుల విజయం సాధించడంలో విరాట్ ప్రముఖపాత్ర పోషించాడు. 44 బాల్స్ లో 64 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం అందుకొన్నాడు. అయితే...తమతో తుదివరకూ పోరాడి ఓడిన బంగ్లాస్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్ కు విరాట్ ఓ బ్యాట్ ను కానుకగా ఇచ్చి మరీ అభినందించాడు.

భారత గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన లిట్టన్ దాస్..

భారత్ సాధించిన 185 పరుగుల భారీలక్ష్యఛేదన కోసం బ్యాటింగ్ కు దిగిన బంగ్లా ఓపెనర్ లిట్టన్ కుమార్ దాస్ సునామీ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచి భారీషాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గ్రౌండ్ నలుమూలలకూ సిక్సర్లు, బౌండ్రీలు బాదుతూ మెరుపులు మెరిపించాడు. ఒకదశలో భారత కెప్టెన్ తో పాటు..అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.

కేవలం 21 బాల్స్ లోనే రికార్డు హాఫ్ సెంచరీతో తనజట్టు సంచలన విజయం ఆశలు చిగురింపచేశాడు. ఒంటిచేత్తో బంగ్లాదేశ్ కు సంచలన చేజింగ్ విజయం అందించేలా కనిపించాడు.

వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి లిట్టన్ దాస్ కేవలం 27 బాల్స్ లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగుల స్కోరు సాధించాడు. వర్షంతో గంటపాటు మ్యాచ్ నిలిచిపోయిన తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన లిట్టన్ ను ఓ సూపర్ త్రోతో రాహుల్ పడగొట్టడంతో ఓ మెరుపు ఇన్నింగ్స్ కు తెరపడినట్లయ్యింది.

లిటన్ అవుట్ కావడంతోనే బంగ్లా వికెట్ల పతనం ప్రారంభమయ్యింది. ఆట మొదటి 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు సాధించిన బంగ్లాజట్టు ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు నష్టపోయి 5 పరుగుల ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో విరాట్ కొహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. అయితే తన ఆటతీరుతో మైమరపించిన బంగ్లా వికెట్ కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్ ను విరాట్ అభినందించి మరీ ఓ బ్యాటును కానుకగా అంద చేశాడు.

తాము డైనింగ్ హాల్ లో కూర్చొని ఉన్న సమయంలో విరాట్ తమవద్దకు వచ్చి లిట్టన్ ను అభినందించి..తాను ఉపయోగించే ఓ బ్యాటును కానుకగా ఇచ్చాడని..బంగ్లా క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ జలాల్ యూనుస్ తెలిపారు.

లిట్టన్ క్రికెట్ జీవితంలో ఇదో అపూర్వఘట్టంగ మిగిలిపోతుందని, విరాట్ బహుకరించిన బ్యాట్ అపురూపమైన కానుకగా గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు.

మొత్తం మీద ..ప్రత్యర్థిజట్టు తరపున అద్భుతంగా రాణించిన ఓ ఆటగాడిని అభినందిస్తూ బ్యాటు బహుకరించిన విరాట్ క్రీడాస్ఫూర్తికి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.

First Published:  4 Nov 2022 12:38 PM IST
Next Story