Telugu Global
Sports

నేడే భారత్- దక్షిణాఫ్రికా సూపర్...ఫైట్!

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ -2 లీగ్ లో మరో అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమయ్యింది. పెర్త్ వేదికగా ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో టాప్ ర్యాంకర్ భారత్, మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

నేడే భారత్- దక్షిణాఫ్రికా సూపర్...ఫైట్!
X

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ -2 లీగ్ లో మరో అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమయ్యింది. పెర్త్ వేదికగా ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో టాప్ ర్యాంకర్ భారత్, మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి....

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ గ్రూప్ -2 లీగ్ లో వరుసగా మూడో విజయానికి టాప్ ర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూకుడుమీదున్న

రోహిత్ సేనను దెబ్బతీయాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికాజట్టు సిద్ధమయ్యింది.

వెస్టర్న్ ఆస్ట్ర్రేలియాలోని పెర్త్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ సూపర్ సండే వార్...భారత కాలమానప్రకారం సాయంత్రం 4-30 గంటలకు ప్రారంభమవుతుంది.

బ్యాటర్ల సత్తాకు సవాల్....

కంగారూల్యాండ్ లోనే ఫాస్టెస్ట్ పిచ్ గా పేరుపొందిన పెర్త్ స్టేడియం వికెట్ ...రెండుజట్ల పేసర్లకు చెలగాటం... బ్యాటర్లకు ప్రాణసంకటంగా మారనుంది. పేస్ తో పాటు విపరీతమైన బౌన్స్ తో కూడిన పెర్త్ పిచ్ పైన దూకుడుగా ఆడే స్ట్ర్రోక్ మేకర్లకే పరుగుల మోత మోగించే అవకాశం ఉంటుంది.

డాషింగ్ ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ, రాహుల్, మిస్టర్ డిపెండబుల్ విరాట్ కొహ్లీ, 360 కోణంలో గ్రౌండ్ నలుమూలలకూ షాట్లు కొట్టడంలో మొనగాడు సూర్యకుమార్ యాదవ్, పవర్ హిట్టర్ హార్ధిక్ పాండ్యాలతో భారత టాపార్డర్ అత్యంత పటిష్టంగా సమతూకంతో కనిపిస్తోంది. అయితే నోర్జే, రబడ, ఎన్గిడీ, క్లాసెన్, జెన్సన్ లతో కూడిన

పవర్ ఫుల్ సఫారీ పేస్ ఎటాక్ నుంచి గట్టిపోటీనే ఎదురుకానుంది.

ఇటు సూర్య...అటు రూసో...

రెండుజట్లలోనూ పలువురు సూపర్ స్టార్ బ్యాటర్లున్నా...భారత్ తరపున నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్, సఫారీ డైనమైట్, ప్రపంచకప్ సెంచరీ హీరో రీలీ రూసో

ఈరోజు జరిగే సూపర్ డూపర్ ఫైట్ కి ప్రత్యేక ఆకర్షణ మాత్రమే కాదు...కీలకం కానున్నారు.

ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లోనే అత్యధిక టీ-20 పరుగులు సాధించిన సూర్యకుమార్ యాదవ్...సఫారీ ఫాస్ట్ బౌలర్లను ఏ రేంజ్ లో ఎదుర్కొనగలడన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక..వీరబాదుడు రూసో గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది. ప్రపంచకప్ కు సన్నాహకంగా భారత్ తో జరిగిన తీన్మార్ సిరీస్ ఆఖరిమ్యాచ్ లో రూసో సూపర్ సెంచరీ సాధించాడు. అంతేకాదు..ప్రస్తుత ప్రపంచకప్ లో తొలిశతకం బాదిన బ్యాటర్ గా కూడా రూసో నిలిచాడు. భారత బౌలర్లకు ఓపెనర్ డీ కాక్ తో పాటు రూసో నుంచే అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది.

భారత్ కు అశ్వినే కీలకం...

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కువ మంది ఎడమచేతి బ్యాటర్లు ఉండడంతో భారత జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు చేతినిండా పనేనని చెప్పక తప్పదు. పైగా..

సఫారీలు ప్రత్యర్థులుగా అశ్విన్ కు 9 మ్యాచ్ ల్లో 10 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు సైతం 11 మ్యాచ్ ల్లో 14 వికెట్లు పడగొట్టిన ఘనత ఉంది.

భారత్ ప్రత్యర్థిగా ప్రస్తుత సీజన్లో ఆడిన 9 మ్యాచ్ ల్లో ...7 ఇన్నింగ్స్ లో సఫారీటీమ్ పవర్ ప్లే ఓవర్లలోనే 17 వికెట్లు కోల్పోడం కూడా భారత బౌలర్ల ఆత్మవిశ్వాసానికి అదనపు బలం కానుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకే ....

పెర్త్ వేదికగా జరిగిన గత 21మ్యాచ్ ల్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లే 13సార్లు విజయాలు సాధించాయి. గత రికార్డులను బట్టి చూస్తే...టాస్ నెగ్గినజట్టు మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే భారత్ దే పైచేయిగా కనిపిస్తోంది. సఫారీలపై టీ-20లో 13 విజయాలు, 9 పరాజయాల రికార్డుతో భారత్ ఆధిక్యంలో ఉంది. అంతేకాదు..టీ-20 ప్రపంచకప్ లో సైతం దక్షిణాఫ్రికా పై భారత్ 4-1 విజయాల రికార్డుతో ఉంది.

వానబెడద లేనట్లే....

ప్రస్తుత ప్రపంచకప్ లో వానదెబ్బతో పలుమ్యాచ్ లు రద్దయిన నేపథ్యంలో జరుగనున్న భారత్- దక్షిణాఫ్రికాజట్లకు ఎలాంటి అంతరాయం ఉండబోదని, ఆకాశం మేఘావృతమై ఉన్నా...మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశమే లేదని వాతావరణశాఖ తాజా నివేదిక ద్వారా తెలిపింది.

ఈ మ్యాచ్ లో నెగ్గినజట్టుకే గ్రూపు టాపర్ గా నిలవడంతో పాటు...సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఈరోజు సాయంత్రం 4-30 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ దేశవిదేశాలలోని కోట్లాదిమంది భారత క్రికెట్ అభిమానులకు పసందైన క్రికెట్ విందుగా మిగిలిపోనుంది.

First Published:  30 Oct 2022 10:28 AM IST
Next Story