Telugu Global
Sports

ప్రపంచకప్ లో నేడే భారత్- పాక్ సమరం!

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో అతిపెద్ద సమరానికి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ప్రపంచకప్ లో నేడే భారత్- పాక్ సమరం!
X

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో అతిపెద్ద సమరానికి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మరోవైపు ఈ సూపర్ డూపర్ ఫైట్ కు వానతో అంతరాయం కలిగే అవకాశం ఉంది....

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న 2022 టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రెండోరోజు పోటీలలోనే అతిపెద్ద సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా పేరున్న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు ( భారత కాలమానం ప్రకారం 1-30 గంటలకు ) ప్రారంభంకానుంది.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ సూపర్ సండే మెగా సమరంలో విజయమే లక్ష్యంగా ఇటు భారత్, అటు పాక్ జట్లు బరిలోకి దిగుతున్నాయి.

సమఉజ్జీల సమరం...

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన జట్లుగా భారత్, పాక్ జట్లకు పేరుంది. ఈ రెండుజట్లలోనూ పలువురు ప్రపంచమేటి ఆటగాళ్లున్నారు. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ ప్రపంచ నంబర్ వన్ గా ఉంటే...పాకిస్థాన్ మాత్రం మూడోర్యాంకులో కొనసాగుతోంది.

ఈ రెండుజట్లూ ముఖాముఖీ తలపడితే మాత్రం అది ఓ యుద్ధంలా..భావోద్వేగాల సమరంలానే సాగుతుంది. అయితే..టీ-20 ప్రపంచకప్ లో భాగంగా మాత్రం ఈ రెండుజట్లూ ఇప్పటి వరకూ ఆరుసార్లు మాత్రమే తలపడ్డాయి.

భారత్ 5 విజయాలు, పాక్ ఒకే ఒక్క గెలుపు రికార్డుతో ఉన్నాయి. గతేడాది ముగిసిన 2021 ప్రపంచకప్ లో మాత్రమే పాకిస్థాన్ చేతిలో భారత్ తొలిసారిగా ఓటమి చవిచూసింది. ప్రపంచకప్ మ్యాచ్ ల్లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా భారత్ విజయాల శాతం 75గా ఉంది.

భారత్ 8- పాక్ 3 రికార్డు..

భారత్, పాకిస్థాన్ జట్లు గత నెలలో ముగిసిన ఆసియాకప్ వరకూ మొత్తం 11 టీ-20 మ్యాచ్ ల్లో తలపడితే భారత్ 8 విజయాలతో 68.18 సక్సెస్ రేటు నమోదు చేసింది.

భారత్ పైన పాక్ జట్టుకు మూడంటే మూడు విజయాలు మాత్రమే ఉన్నాయి.

2019 అక్టోబర్ తర్వాత నుంచి భారతజట్టు ఆడిన మొత్తం 65 టీ-20 మ్యాచ్ ల్లో 46 విజయాలు, 17 పరాజయాల రికార్డు సాధించింది. 70.83 విజయశాతం నమోదు చేసింది.

మరోవైపు పాక్ జట్టు 2019 అక్టోబర్ తర్వాత....62 మ్యాచ్ ల్లో 37 గెలుపు, 20 ఓటమి, 5 నోరిజల్ట్, 64,91 విజయశాతం రికార్డు సాధించింది.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు చేజింగ్ లో అత్యధిక విజయాలు నమోదు చేయటం విశేషం. మొత్తం 23సార్లు చేజింగ్ కు దిగిన భారత్ 20 విజయాలు నమోదు చేసింది.86.95 విజయశాతంగా ఉంది.

ఇటు రోహిత్, విరాట్...ఇటు బాబర్, రిజ్వాన్

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టుకు రాహుల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కొహ్లీ, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లతో కూడిన పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది.

ఓపెనర్ రాహుల్ తో పాటు..మిస్టర్ 360 షాట్ మేకర్ సూర్యకుమార్ చెలరేగితే పాక్ బౌలర్లకు కష్టాలు తప్పవు.

భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, హార్థిక్ పాండ్యాలతో పేస్, యజువేంద్ర చహాల్, అశ్విన్, అక్షర్ పటేల్ లతో బారత స్పిన్ విభాగం పటిష్టంగా ఉన్నాయి. ఆఖరి ఐదు ఓవర్లలో ప్రత్యర్థులను ఏమేరకు భారత బౌలర్లు కట్టడి చేయగలరన్న అంశంపైనే జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

కొహ్లీ టాప్ రికార్డు..

పాకిస్థాన్ ప్రత్యర్థిగా విరాట్ కొహ్లీకి కళ్లు చెదిరే రికార్డు ఉంది. మొత్తం 9 ఇన్నింగ్స్ లో 406 పరుగులతో మూడుసార్లు నాటౌట్ గా నిలిచాడు. ఇందులో నాలుగు అర్థశతకాలున్నాయి. 24 బౌండ్రీలు, 5 సిక్సర్లున్నాయి.

బాబర్ అజామ్ కెప్టెన్ గా పాక్ జట్టు ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తూ వస్తోంది. పదునైన బౌలింగ్ ఎటాక్ తో పాక్ జట్టు ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది. నసీమ్ షా, షహీన్ ఆఫ్రిదీ, హారిస్ రవూఫ్ లతో పాటు స్పిన్ జోడీ మహ్మద్ వసీం, షదాబ్ ఖాన్ పాక్ అమ్ములపొదిలో ప్రధానఅస్త్ర్రాలుగా ఉన్నారు.

బ్యాటింగ్ లో కెప్టెన్ బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్ ల పైనే పాక్ జట్టు ప్రధానంగా ఆధారపడి ఉంది.

మ్యాచ్ జరిగే సమయంలోని వాతావరణాన్ని బట్టి తుదిజట్ల కూర్పు ఆధారపడి ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటే మాత్రం..రెండుజట్ల తరపున ఫాస్ట్ , స్వింగ్ బౌలర్లు కీలకం కానున్నారు.

గత ప్రపంచకప్ లో పాక్ ప్రత్యర్థిగా ఓటమి పొందిన భారత్ ప్రస్తుత ఈ ప్రపంచకప్ లో బదులుతీర్చుకోవాలని అభిమానులు కోరుకొంటున్నారు. రోహిత్ సేన ఈమ్యాచ్ లో నెగ్గడం ద్వారా శతకోటి భారత అభిమానులకు ఒకరోజు ముందుగానే దీపావళికానుక ఇస్తుందా?...తెలుసుకోవాలంటే ఈ బ్లాక్ బస్టర్ ఫైట్ ను చూడాల్సిందే మరి.

First Published:  23 Oct 2022 10:16 AM IST
Next Story