Telugu Global
Sports

ప్రపంచకప్ లో నేడు భారత్ తో నెదర్లాండ్స్ ఢీ!

ప్రపంచకప్ సూపర్ -12రౌండ్లో వరుసగా రెండో విజయానికి టాప్ ర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది. సిడ్నీ క్రికెట్ వేదికగా జరిగే గ్రూప్ -2 రెండోరౌండ్ పోటీలో 17వ ర్యాంకర్ నెదర్లాండ్స్ పని పట్టడానికి సిద్ధమయ్యింది.

ప్రపంచకప్ లో నేడు భారత్ తో నెదర్లాండ్స్ ఢీ!
X

ప్రపంచకప్ సూపర్ -12రౌండ్లో వరుసగా రెండో విజయానికి టాప్ ర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది. సిడ్నీ క్రికెట్ వేదికగా జరిగే గ్రూప్ -2 రెండోరౌండ్ పోటీలో 17వ ర్యాంకర్ నెదర్లాండ్స్ పని పట్టడానికి సిద్ధమయ్యింది.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ మ్యాచ్ లు వరుణుడి దోబూచులాటల నడుమ సాగిపోతున్నాయి. మెల్బో్ర్న్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లను వానదెబ్బ కొడుతుంటే...సిడ్నీ వేదికగా జరిగే మ్యాచ్ లు మాత్రం చిన్నపాటి అంతరాయాలతో ముగిసిపోతున్నాయి.

గ్రూప్-2 ప్రారంభరౌండ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 4 వికెట్ల విజయం సాధించిన భారత్ బ్యాక్ టు బ్యాక్ విజయాలకు సిద్ధమయ్యింది.

కొండతో కూన సమరం..

ఐసీసీ అంతర్జాతీయ టీ-20 ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే భారత్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిస్తే..పసికూన నెదర్లాండ్స్ 17వ ర్యాంక్ జట్టుగా ఉంది. పైగా గత ఎనిమిదేళ్ల కాలంలో తొలిసారిగా టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ కు అర్హత సాధించిన డచ్ జట్టు...తనకంటే ఎన్నోరెట్లు బలమైన, అపారఅనుభవం కలిగిన భారత్ కు ఈ పోరులో ఏపాటి పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే.

భారత్- నెదర్లాండ్స్ జట్ల కెప్టెన్లు టాస్ కు వెళ్లే సమయంలో మాత్రమే చిరుజల్లులు పడినా..ఆ తర్వాతి వాతావరణం మ్యాచ్ కు ఎంతో అనువుగా ఉంటుందని, పూర్తి 40 ఓవర్ల మ్యాచ్ ఖాయమని వాతావరణ శాఖ ప్రకటించింది.

భారతజట్టులో ఒకటి లేదా రెండుమార్పులు?

అంతగా అనుభవంలేని పసికూన నెదర్లాండ్స్ జట్టుతో తలపడుతున్న కారణంగా భారత్ తుదిజట్టులో ఒకటిలేదా రెండుమార్పులు చేసే అవకాశం లేకపోలేదు. పాక్ తో జరిగిన తొలిమ్యాచ్ లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైన లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్, దినేశ్ కార్తీక్ కు బదులుగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ లను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలున్నాయి. హార్థిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వాలనుకొంటే హర్షల్ పటేల్ కు చాన్స్ దక్కనుంది.

సిడ్నీలో సగటు స్కోరు 157 మాత్రమే..

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ ల్లో సగటుస్కోరు 157 మాత్రమే కావడంతో ..ఆ స్కోరును భారత్ అధిగమించే అవకాశం ఉంది. భారత్ ముందుగా బ్యాటింగ్ ఎెంచుకొంటే 180 నుంచి 200 స్కోరు సాధించినా ఆశ్చర్యంలేదు.

తొలిమ్యాచ్ లో విఫలమైన టాప్ -త్రీ బ్యాటర్లు రోహిత్, రాహుల్, సూర్యకుమార్ ...డచ్ జట్టుపైన పూర్తిస్థాయిలో చెలరేగిపోయే అవకాశాలున్నాయి. మరోవైపు..

120 నుంచి 130 పరుగులు మాత్రమే చేస్తూ వస్తున్న నెదర్లాండ్స్ పూర్తిస్థాయిలో రాణించగలిగితే భారత్ కు నామమాత్రమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుత ప్రపంచకప్ లో చిన్నజట్లను తక్కువగా అంచనావేస్తే భారీమూల్యం చెల్లించక తప్పదని ఇంగ్లండ్ అనుభవం తేల్చి చెప్పింది. రోహిత్ సేన...డచ్ జట్టును ఏమాత్రం తక్కువగా అంచనా వేయకుండా...చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న వ్యూహం అనుసరించక తప్పదు.

పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాతో జరిగే మూడోరౌండ్ మ్యాచ్ కు సన్నాహకంగా ఈ మ్యాచ్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని భారతటీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

అన్ని విభాగాలలోనూ అత్యంత పటిష్టంగా ఉన్న భారత్ ధాటికి పసికూన నెదర్లాండ్స్ ఏపాటి నిలుస్తుందో వేచిచూడాల్సిందే.

First Published:  27 Oct 2022 9:09 AM IST
Next Story