Telugu Global
Sports

ప్రయోగాలు సరి...ఇక గెలుపుగుర్రాలతో సవారీ!

ఆసియాకప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ భారత్ మితిమీరిన ప్రయోగాలతో చేతులు కాల్చుకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో గెలుపు గుర్రాలకే సెలెక్టర్లు చోటు కల్పించారు.

ప్రయోగాలు సరి...ఇక గెలుపుగుర్రాలతో సవారీ!
X

ఆసియాకప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ భారత్ మితిమీరిన ప్రయోగాలతో చేతులు కాల్చుకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో గెలుపు గుర్రాలకే సెలెక్టర్లు చోటు కల్పించారు. మరోవైపు యువవికెట్ కీపర్ సంజు శాంసన్, వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీలకు అన్యాయం జరిగిందంటూ అభిమానులు మండిపడుతున్నారు....

అతిసర్వత్రా వర్జయేత్ అన్నపెద్దల మాటను భారత క్రికెట్ బోర్డు ఎంపిక సంఘం పెడచెవిన పెడుతూ గత కొద్దిసంవత్సరాలుగా భారీమూల్యమే చెల్లిస్తూ వస్తోంది. గతంలో రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా, విరాట్ కొహ్లీ కెప్టెన్ గా పలుమార్లు తీసుకొన్న అనుచిత నిర్ణయాలతో ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ లతో పాటు...గత ఏడాది జరిగిన టీ-20 ప్రపంచకప్ లో భారతజట్టు దారుణంగా విఫలం కావడం ద్వారా భారీమూల్యమే చెల్లించింది.

ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకోకుండా ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అవే తప్పిదాలు చేస్తూ 2022 ఆసియాకప్ లో తగిన మూల్యం చెల్లించారు.

7గురు కెప్టెన్లు..28 మంది ఆటగాళ్లు...

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా ఒకే ఒక్క కెప్టెన్, తుదిజట్టులో 11 మంది, పూర్తి జట్టులో 15 మంది ఆటగాళ్లు సభ్యులుగా ఉండటం మనకు తెలుసు. అయితే...గత తొమ్మిదిమాసాల కాలంలో భారత టీమ్ మేనేజ్ మెంట్ ఏడుగురు కెప్టెన్లు, 28 మంది ఆటగాళ్లతో ప్రయోగాలు చేస్తూ వస్తోంది.

నిఖార్సయిన్ క్రికెటర్ గా, కోచ్ గా పేరున్న రాహుల్ ద్రావిడ్ ప్రధాన శిక్షకుడిగా భారతజట్టు టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్ లో జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15మంది సభ్యుల భారతజట్టు ఎంపికకు ముందే..వివిధ స్థానాలలో పలువురు యువఆటగాళ్లను పరీక్షిస్తూ వస్తోంది.

ఓపెనర్ల నుంచి టెయిల్ ఎండర్ల వరకూ, స్పిన్నర్ల నుంచి పేసర్ల వరకూ జట్టులోని ప్రతిఒక్క స్థానం కోసం ప్రతిభావంతులైన పలువురు యువక్రికెటర్లకు కోచ్ రాహుల్ ద్రావిడ్ తగిన అవకాశాలు కల్పిస్తూ వారి సత్తా ఏపాటిదో తెలుసుకొంటూ వచ్చారు.

జట్టు కూర్పులో తరచూ మార్పులు చేర్పులు చేస్తూ విమర్శలు కొని తెచ్చుకొన్నారు. గత జనవరి నుంచి కొద్దిరోజుల క్రితం ముగిసిన ఆసియాకప్ టో్ర్నీ వరకూ భారతజట్టులో..28 మంది ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.

ఓపెనర్లుగా రాహుల్, కొహ్లీ,రోహిత్, ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్ లను పరీక్షించారు. వికెట్ కీపర్ బ్యాటర్లుగా దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్,సంజుశాంసన్, రిషభ్ పంత్ లకు అవకాశం కల్పించారు.

స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, అశ్విన్, యజువేంద్ర చహాల్, రవి బిష్నోయ్, అక్షర్ పటేల్ లకు తగిన అవకాశమిచ్చారు. పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, బుమ్రా, షమీ, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, దీపక్ చహార్ లను ఆడించారు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజు శాంసన్ లాంటి పలువురు బ్యాటర్లను పరీక్షించారు.

అత్యధిక టీ-20మ్యాచ్ ల భారత్...

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా గత తొమ్మిదిమాసాలలో భారతజట్టు ఆడినన్ని టీ-20 మ్యాచ్ లు మరే జట్టూ ఆడలేదంటే ఆశ్చర్యపోనక్కరలేదు. దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ టో్ర్నీ వరకూ భారత్ మొత్తం 30 టీ-20మ్యాచ్ లు ఆడి... ఈ మ్యాచ్ ల ద్వారా 28 మంది వేర్వేరు ఆటగాళ్లను పరీక్షిస్తూ వచ్చింది.

బుమ్రా, హర్షల్ పటేల్, రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్ లాంటి ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో పాకిస్థాన్, శ్రీలంకజట్లతో జరిగిన పోటీలలో భారత బ్యాటింగ్ స్థాయికి తగ్గట్టుగా ఉన్నా బౌలింగ్ లో తేలిపోయింది.

ఇటు పాక్, అటు శ్రీలంకజట్లు చేజింగ్ లో భారత్ ను కంగుతినిపించడం ద్వారా బౌలింగ్ లో పస ఏమాత్రం లేదని తేల్చి చెప్పాయి. ఇదే అదనుగా ..మితిమీరిన ప్రయోగాలతో భారత్ తీవ్రంగా నష్టపోయందని, అసలు ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల జట్టు ఏదో తేల్చండంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ 8వ ర్యాంకర్ శ్రీలంకజట్టు చేతిలో ఓటమితో ఆసియాకప్ ఫైనల్స్ చేరకుండానే ఇంటిదారి పట్టడంతో చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలపై ఒత్తిడి పెరిగింది.

అయితే...రాహుల్ ద్రావిడ్ మాత్రం విమర్శకులకు తమదైన శైలిలో సమాధానం చెప్పారు.గత తొమ్మిదినెలలుగా తమజట్టు అత్యుత్తమస్థాయిలో రాణిస్తూ వస్తోందని, రెండుమ్యాచ్ లు ఓడినంత మాత్రాన చెత్తజట్టుగా మారిపోలేదంటూ ఎదురుదాడికి దిగారు. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడితే..వారిస్థానాలను వేరే ఆటగాళ్లతో భర్తీ చేయక తప్పలేదంటూ వివరణ ఇచ్చారు.


మూడు ఫార్మాట్లు...7గురు కెప్టెన్లు..

గత ఎనిమిది మాసాల కాలంలో భారత టెస్టు, వన్డే, టీ-20 జట్లకు ఏడుగురు ( విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, హార్థిక్ పాండ్యా, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ ) ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించడాన్ని సైతం క్రికెట్ పండితులు తప్పుపట్టారు.

అయితే...రొటేషన్ పాలసీ, వర్క్ లోడ్ విధానాల కారణంగా పలువురికి పరిస్థితులకు అనుగుణంగా జట్టు పగ్గాలు అప్పగించాల్సి వచ్చిందని టీమ్ మేనేజ్ మెంట్ చెప్పకనే చెబుతోంది.

ప్రపంచకప్ కు గెలుపు గుర్రాలు...

ఆసియాకప్ ముగిసిన కొద్దిగంటల వ్యవధిలోనే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టు వివరాలను సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టులో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ లకు చోటు లేకపోడాన్ని అభిమానులు, క్రికెట్ పండితులు తప్పుపడుతున్నారు. రిషభ్ పంత్ కంటే సంజు శాంసన్ మెరుగైన ఆటగాడని..సంజును పక్కన పెట్టడం అన్యాయమంటూ మండిపడుతున్నారు. మరోవైపు.. అపారఅనుభవం ఉన్న మహ్మద్ షమీ, స్వింగ్ బౌలర్ దీపక్ చహార్ లను స్టాండ్ బైస్ కు పరిమితం చేయటం ఏంటంటూ నిలదీస్తున్నారు.

అయితే...ఆస్ట్ర్రేలియాలోని వికెట్ లు, వాతావరణానికి తగ్గట్టుగానే జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ చెబుతోంది. ఆసియాకప్ లో విఫలమైనా...ప్రపంచకప్ లో మాత్రం గెలుపు గుర్రాలతో బరిలోకి దిగుతున్న భారత్ విజేతగా నిలుస్తుందా?..2007 తర్వాత మరోసారి టీ-20 విశ్వవిజేతగా నిలువగలుగుతుందా? తెలుసుకోవాలంటే...కొద్దివారాలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  13 Sept 2022 11:57 AM IST
Next Story