Telugu Global
Sports

న్యూజిలాండ్ జోరుకు ఇంగ్లండ్ బ్రేక్!

ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ -1 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ కు తొలి ఓటమి ఎదురయ్యింది. కీలక పోరులో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను ఖంగు తినిపించింది

న్యూజిలాండ్ జోరుకు ఇంగ్లండ్ బ్రేక్!
X

ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ -1 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ కు తొలి ఓటమి ఎదురయ్యింది. కీలక పోరులో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను ఖంగు తినిపించింది...

కంగారూల్యాండ్ వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 మొదటి పదిరోజుల పోటీలలో అజేయంగా నిలిచిన ఏకైకజట్టుగా నిలిచిన రన్నరప్ న్యూజిలాండ్ కు తొలిదెబ్బ తగిలింది.

బ్రిస్బేన్ గాబా స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ -1 మూడోరౌండ్ పోరులో ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకొంది.

ప్రారంభమ్యాచ్ లో ఆస్ట్ర్రేలియా, ఆసియా చాంపియన్ శ్రీలంక జట్లను అలవోకగా ఓడించిన న్యూజిలాండ్ కు ఇంగ్లండ్ చేతిలో మాత్రం పరాజయం తప్పలేదు.

బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్....

రెండు బలమైన జట్ల నడుమ జరిగిన ఈపోరులో కీలక టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని...20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

ఓపెనర్లు జోస్ బట్లర్- అలెక్స్ హేల్స్ మొదటి వికెట్ కు 10.2 ఓవర్లలోనే 81 పరుగుల భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ బట్లర్ 47 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 73 పరుగుల సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. హేల్స్ 52, లివింగ్ స్టోన్ 20 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ 179 పరుగుల స్కోరు నమోదు చేయగలిగింది.

కివీ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ 2 వికెట్లు, సోధీ, సాంట్నర్, సౌథీ తలో వికెట్ పడగొట్టారు.

కివీస్ కు ఇంగ్లండ్ పగ్గాలు..

180 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఇంగ్లండ్ బౌలర్లు పగ్గాలు వేశారు. ఓపెనింగ్ జోడీ తగిన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ ( 40 ), గతమ్యాచ్ లో సెంచరీ హీరో గ్లెన్ ఫిలిప్స్ (62 ) మినహా మిగిలిన బ్యాటర్లు రాణించలేకపోయారు. చివరకు న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు, సామ్ కరెన్ 2 వికెట్లు, క్రిస్ వుడ్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ కమ్ ఓపెనర్ జోస్ బట్లర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

గ్రూప్-2 సూపర్ -12 మొదటి మూడురౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంకజట్లు నాలుగేసి పాయింట్ల చొప్పున సాధించి..లీగ్ టేబుల్ మొదటి నాలుగుస్థానాలలో కొనసాగుతున్నాయి.

ఐర్లాండ్ ఐదు, అఫ్ఘనిస్థాన్ ఆరు స్థానాలలో నిలిచాయి. మిగిలిన రెండురౌండ్ల మ్యాచ్ ల ఫలితాలే..సెమీస్ చేరే రెండుజట్లను తేల్చనున్నాయి.

First Published:  1 Nov 2022 12:10 PM GMT
Next Story