దెబ్బమీద దెబ్బ...ప్రపంచకప్ కు ఎలాగబ్బా!
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ మూడోవారం నుంచి జరుగనున్న టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే..ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ ను కీలక బౌలర్ల గాయాల సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి కొద్దివారాల ముందే టాప్ ర్యాంకర్ భారత్ కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఆసియాకప్ ఆడుతూ రవీంద్ర జడేజా, ఆసీస్ తో సిరీస్ తో బుమ్రా గాయాలబారిన పడి జట్టుకు దూరంకావడంతో అయోమయ పరిస్థితి నెలకొంది....
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ మూడోవారం నుంచి జరుగనున్న టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే..ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ ను కీలక బౌలర్ల గాయాల సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
భారత బౌలింగ్ కు వెన్నెముక లాంటి ఇద్దరు కీలక బౌలర్లు గాయాలతో జట్టుకు దూరం కావడంతో టీమ్ మేనేజ్ మెంట్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురయ్యింది.
అప్పుడు జడేజా...ఇప్పుడు బుమ్రా...
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో గత ఏడాది కాలంలో అత్యధిక మ్యాచ్ లు ఆడి అత్యధిక విజయాలు సాధించిన ఒకే ఒక్కజట్టు భారత్. అయితే...ప్రపంచకప్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే తురుపుముక్కల్లా భావించే జడేజా, బుమ్రా లాంటి ఇద్దరు కీలక బౌలర్లను గాయాలతో కోల్పోయింది.
దుబాయ్ వేదికగా రెండువారాల క్రితమే ముగిసిన ఆసియాకప్ టోర్నీలో పాల్గొంటూ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా...సరదాగా క్రికెటేతర క్రీడ ఆడుతూ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. కాలినరం గాయంతో శస్త్ర్రచికిత్సకు గురై ప్రస్తుతం కోలుకొంటున్నాడు.
జడేజా స్థానాన్ని మరో స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సమర్థవంతంగా భర్తీ చేశాడని సంతృప్తిపడుతున్న తరుణంలో యార్కర్లకింగ్, భారత బౌలింగ్ ప్రధాన అస్త్రం జస్ ప్రీత్ బుమ్రా గాయం కోలుకోలేని దెబ్బతీసింది.
బుమ్రాను వెంటాడుతున్న గాయాలు..
టెస్టు, వన్డే, టీ-20 ఫార్మాట్లలో భారత నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాను గత నాలుగేళ్లుగా పలురకాల రూపంలో గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా వెన్నెముక గాయం బుమ్రాకు మాత్రమే కాదు...భారత టీమ్ మేనేజ్ మెంట్ కు సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
క్రికెట్ మూడుఫార్మాట్లతో పాటు ఐపీఎల్ లోనూ పాల్గొంటున్న బుమ్రాను నాన్ స్టాప్ క్రికెట్టే దెబ్బతీసింది. 2019 సీజన్ నుంచి ప్రస్తుత 2022 సీజన్ వరకూ ఏదో ఒక గాయంతో కీలక సిరీసుల్లో జట్టుకు దూరమవుతూ వస్తున్నాడు.
వెన్నెముక గాయంతో ఆసియాకప్ కు దూరమైన బుమ్రా...తగిన ఫిట్ నెస్ తో ఆస్ట్ర్రేలియాతో తీన్మార్ టీ-20 సిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు. సిరీస్ లోని తొలిమ్యాచ్ కు దూరంగా ఉన్నా...నాగపూర్ వేదికగా జరిగిన కీలక రెండోమ్యాచ్ లో రెండుఓవర్లలో ఓ కీలక వికెట్ పడగొట్టడం ద్వారా బుమ్రా పరవాలేదనిపించాడు. అయితే..హైదరాబాద్ వేదికగగా సిరీస్ లోని ఆఖరి టీ-20 మ్యాచ్ ప్రారంభానికి కొద్దిగంటల ముందే బుమ్రా వెన్నెముక గాయం తిరగబెట్టింది.
బీసీసీఐ ఏమంటోంది?
వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకొని ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న బుమ్రా...పూర్తి ఫిట్ నెస్ లేకుండానే ఆసీస్ తో సిరీస్ లో పాల్గొనటం కొంపముంచిందని బీసీసీఐ వైద్యుల బృందం చెబుతోంది. మరికొన్ని రోజులపాటు బుమ్రాకు విశ్రాంతి ఇస్తే బాగుండేదని అభిప్రాయపడింది. వెన్నెముక పాతగాయమే తిరగబెట్టిందని, కోలుకోవాలంటే కొద్దివారాలపాటు ఆటకు దూరంగా ఉండితీరక తప్పదని ప్రకటించింది.
తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 60 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో 70 వికెట్లు పడగొట్టిన ఘనత బుమ్రాకు ఉంది. 6.62 ఎకానమీతో 18.3 స్ట్ర్రయిక్ రేట్ ఉంది.
ప్రస్తుత 2022 సీజన్లో బుమ్రా ఐదేసి టెస్టులు, వన్డేలు, టీ-20 మ్యాచ్ లు చొప్పున మాత్రమే ఆడాడు. టెస్టుల్లో 22, వన్డేల్లో 13, టీ-20ల్లో 4 వికెట్లు పడగొట్టాడు.
2019లో వెన్నెముక గాయం, 2021లో ఉదరభాగం గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. 2022లో తిరిగి వెన్నెముక గాయం తిరగబెట్టడంతో...కీలక ప్రపంచకప్ కే దూరం కాక తప్పలేదు.
షమీనా...దీపక్ చహారా?
బుమ్రా గాయంతో జట్టుకు దూరం కావడంతో ..అతని స్థానాన్ని భర్తీ చేయటానికి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, స్వింగ్ బౌలింగ్ ఆల్ రౌండర్ దీపక్ చహార్ పోటీపడుతున్నారు.
గత సీజన్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలవడంలో షమీ ప్రధానపాత్ర వహించాడు. అంతేకాదు...ఆస్ట్ర్ర్రేలియాలోని ఫాస్ట్ ,బౌన్సీ పిచ్ లు...షమీ బౌలింగ్ కు ఎంతో
అనుకూలంగా ఉంటాయి. ప్రపంచకప్ కు ఎంపిక చేసిన భారతజట్టులో షమీ, చహార్ లు స్టాండ్ బైలుగా చోటు సంపాదించారు. బుమ్రాకి బదులుగా స్టాండ్ బైస్ లోని ఒకరిని తుదిజట్టులోకి తీసుకోక తప్పదు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడుమ్యాచ్ ల సిరీస్ కు కరోనాతో దూరమైన షమీ సైతం తన ఫిట్ నెస్ ను చాటుకోవాల్సి ఉంది.
మరోవైపు..గాయం నుంచి పూర్తిగా కోలుకొని తిరిగి భారతజట్టులో చేరిన దీపక్ చహార్ ..దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలివన్డేలో తన సత్తా చాటుకొన్నాడు. పదునైన స్వింగ్ బౌలింగ్ తో పాటు..లోయర్ ఆర్డర్లో ఉపయుక్తమైన బ్యాటర్ గా కూడా చహార్ కు గుర్తింపు ఉంది.
చహార్, షమీలలో ఒకరు తుదిజట్టులో చేరితే ...ఇప్పటి వరకూ స్టాండ్ బైస్ గా ఉన్నా వారి స్థానాన్ని..మహ్మద్ సిరాజ్ లేదా ఆవేశ్ ఖాన్ లతో భర్తీ చేసే అవకాశం ఉంది.
సీనియర్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, హార్థిక్ పాండ్యా, షమీ లేదా దీపక్ చహార్ లు మాత్రమే ప్రపంచకప్ లో భారత పేస్ బౌలింగ్ బాధ్యతను, భారాన్ని మోయాల్సి ఉంది.