న్యూజిలాండ్ కు సూర్య టెన్షన్, నేడే ఆఖరి టీ-20
భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ ఈరోజు నేపియర్ లోని మెక్లీన్ పార్క్ వేదికగా ప్రారంభమవుతంది.
భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ ఈరోజు నేపియర్ లోని మెక్లీన్ పార్క్ వేదికగా ప్రారంభమవుతంది.
సూర్యకుమార్ టెన్షన్ తో ఆతిథ్య కివీజట్టు బరిలోకి దిగుతోంది...
ప్రపంచకప్ సెమీఫైనలిస్టులు భారత్- న్యూజిలాండ్ జట్ల మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. సిరీస్ ను2-0తో కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ బరిలోకి దిగుతోంది.
మరోవైపు సిరీస్ లోని తొలిమ్యాచ్ వానదెబ్బతో రద్దు కావడం, రెండోమ్యాచ్ లో భారత్ 65 పరుగుల భారీవిజయం సాధించడంతో న్యూజిలాండ్ తీవ్రఒత్తిడిలో పడిపోయింది.
ఈ ఉదయం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ లో భారత్ ఓడిన వచ్చిన నష్టం ఏమీలేదు. అదే న్యూజిలాండ్ ఓడితే 0-2తో సిరీస్ చేజార్చుకోక తప్పదు. కనీసం ఆఖరిమ్యాచ్ లోనైనా నెగ్గడం ద్వారా సిరీస్ ను 1-1తో సమం చేయాలని కివీజట్టు భావిస్తోంది.
సూర్యాను ఆపేదెలా?
బే ఓవల్ వేదికగా ముగిసిన రెండో టీ-20లో భారత్ సాధించిన మొత్తం 191 పరుగుల స్కోరులో మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే 111 పరుగులు సాధించాడు.
కేవలం 51 బాల్స్ లోనే 11 ఫోర్లు, 7 సిక్సర్లతో విశ్వరూపం ప్రదర్శించడంతో న్యూజిలాండ్ బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఆఖరి టీ-20లో సూర్యాను నిలువరించకపోతే ఓటమి తప్పదన్న భావన కివీ టీమ్ మేనేజ్ మెంట్ లో నెలకొని ఉంది. పైగా కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ అందుబాటులో లేకపోడంతో పేసర్ టిమ్ సౌథీ నాయకత్వంలో పోటీకి దిగుతోంది.
రోహిత్ రికార్డుకు సూర్యా గురి..
2022 సీజన్లో ఇప్పటివరకు సూర్యకుమార్ రెండు సెంచరీలతో వెయ్యికి పైగా పరుగులు సాధించడం ద్వారా భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది టీ-20 ఫార్మాట్‌లో 1000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు సూర్య మొత్తం 70 సిక్సర్లు బాదాడు.
ఓ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరుతో ఉంది. ఇప్పుడు సూర్య ఆ రికార్డుకు గురిపెట్టాడు.
రోహిత్ శర్మ 78 సిక్సర్ల రికార్డును అధిగమించేందుకు సూర్య ఉరకలేస్తున్నాడు. సూర్య 20 టీ20 ఇంటర్నేషనల్స్‌లో మొత్తం 67 సిక్సర్లు బాదగా, 10 వన్డేల్లో 3 సిక్సర్లు మాత్రమే బాదాడు. 9 సిక్సర్లు బాదితే.. రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం.
2019లో రోహిత్ అత్యధికంగా 78 సిక్సర్లు బాదాడు. వన్డే, టెస్టు, టీ20 మూడు ఫార్మాట్లలో సిక్సర్లున్నాయి. అదే సమయంలో, 2018లో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో 74 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సూర్య మొత్తం 70 సిక్సర్లు కొట్టాడు. అయితే, రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టాలంటే సూర్య తనదైన శైలిలో చెలరేగిపోక తప్పదు.
సంజు, ఉమ్రాన్ లకు చాన్స్ దక్కేనా?
బెంచ్ కే పరిమితమైన డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ లకు కనీసం ఆఖరిమ్యాచ్ లోనైనా తుదిజట్టులో చేరే అవకాశం అంతంత మాత్రమే కనిపిస్తోంది.
ఓపెనర్ గా, మిడిలార్డర్ బ్యాటర్ గా రిషభ్ పంత్ వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా..టీమ్ మేనేజ్ మెంట్ పదేపదే అవకాశాలు ఇస్తూ రావడం విమర్శలకు తావిస్తోంది. నిలకడగా, దూకుడుగా రాణించే సంజుకు అవకాశమివ్వాలని క్రికెట్ పండితులు కోరుతున్నారు.
మెక్లీన్ పార్క్ వేదికగా మొదటిసారిగా భారత్ టీ-20 మ్యాచ్ ఆడటం ఆసక్తికరంగా మారింది. చిన్నగ్రౌండ్ కావడంతో భారీస్కోరింగ్ మ్యాచ్ గా సాగే అవకాశం కనిపిస్తోంది.
సూర్య తనదైన శైలిలో మరోసారి చెలరేగితో భారత్ స్కోరు 200 దాటినా ఆశ్చర్యపోనక్కరలేదు.
భారత తుదిజట్టులో ఒకటి రెండు మార్పులు చేసి...బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు తుదిజట్టులో అవకాశం కల్పిస్తారా? లేదా? అన్నదే ఇక్కడి అసలు పాయింట్.