టీ-20 ప్రపంచకప్ తొలిరోజునే సంచలనం!
2022 టీ-20 ప్రపంచకప్ సంచలనంతో ప్రారంభమయ్యంది
2022 టీ-20 ప్రపంచకప్ సంచలనంతో ప్రారంభమయ్యంది. తొలిదశ క్వాలిఫైయింగ్ ప్రారంభమ్యాచ్ లోనే ఆసియా చాంపియన్ శ్రీలంకపై పసికూన నమీబియా సంచలన విజయంతో శుభారంభం చేసింది...
ఆస్ట్ర్రేలియా వేదికగా 2022 ప్రపంచకప్ టీ-20 సమరానికి ఓ అనూహ్య ఫలితం అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. సూపర్ -12 రౌండ్లో చోటు కోసం రెండుగ్రూపులుగా జరుగుతున్న క్వాలిఫైయింగ్ రౌండ్ ప్రారంభమ్యాచ్ లో ప్రపంచ మాజీ చాంపియన్, ప్రస్తుత ఆసియా చాంపియన్ శ్రీలంకకు అనుకోని ఓటమి ఎదురయ్యింది.
నమీబియా పేస్ కు శ్రీలంక క్లోజ్...
అక్టోబర్ 22న ప్రారంభంకానున్న సూపర్ -12 రౌండ్లో చోటు కోసం ప్రపంచకప్ తొలిదశ క్వాలిఫైయింగ్ రౌండ్లలో మొత్తం ఎనిమిది ( శ్రీలంక, నమీబియా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, వెస్టిండీస్, జింబాబ్వే, స్కాట్లాండ్, ఐర్లాండ్ )జట్లు పోటీ పడుతున్నాయి. ఈ ఎనిమిదిజట్లలో మొదటినాలుగు స్థానాలలో నిలిచిన జట్లు...అసలుసిసలు సూపర్ -12 రౌండ్ కు అర్హత సాధించగలుగుతాయి.
ఆసియా చాంపియన్ శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో కూడిన గ్రూప్-ఏ తొలిరౌండ్ పోరులో ..జీలాంగ్ లోని సైమండ్స్ స్టేడియం వేదికగా శ్రీలంక, నమీబియా తలపడ్డాయి.
జీలాంగ్ స్టేడియం పిచ్...అదనపు బౌన్స్ తో పేస్, స్వింగ్ బౌలర్లకు అనువుగా ఉండటంతో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ నమీబియా విజేతగా నిలువగలిగింది.
ఈ మ్యాచ్ లో భారీ అంచనాలు ఏమాత్రం లేకుండా బరిలో నిలిచిన నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు సాధించింది. మిడిలార్డర్ ఆటగాళ్లు జాన్ ఫ్రైలింక్ 28 బాల్స్ లో 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లోయర్ ఆర్డర్ ఆటగాడు స్మిట్ 31 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. శ్రీలంక బౌలర్లలో మధుసూదన 2 వికెట్లు, హసరంగ, తీక్షణ, చమీర, కరుణరత్నే తలో వికెట్ పడగొట్టారు.
శ్రీలంక టపటపా...
164 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయం చవిచూసింది. నమీబియా పేసర్లు వికెట్ కు అనుగుణంగా కుదురైన బౌలింగ్ తో ఆకట్టుకొన్నారు. మొదటి 13 ఓవర్లలోనే 80 పరుగులకే ఆరు శ్రీలంక టాపార్డర్ వికెట్లు పడగొట్టి విజయానికి మార్గం సుగమం చేసుకొన్నారు.
స్టార్ బ్యాటర్లు రాజపక్స 20, షనక 29 పరుగులతో రెండంకెల స్కోర్లు సాధించగలిగారు.నమీబియా పేసర్లు డేవిడ్ వీజ్, స్కోల్డ్, షికాంగో, ఫ్రైలింక్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. చివరకు శ్రీలంక 20 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే 108 పరుగులకే ఆలౌటయ్యింది.
నమీబియా 55 పరుగుల విజయం సాధించడంలో ప్రధానపాత్ర వహించిన ఆల్ రౌండర్ ఫ్రైలింక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
నెదర్లాండ్స్ శుభారంభం..
ఇదే గ్రూపులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మరో పోరులో నెదర్లాండ్స్ 3 వికెట్ల విజయం నమోదు చేసింది. ఎమిరేట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు సాధించింది. సమాధానంగా నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులతో విజేతగా నిలిచింది.
గ్రూపు మిగిలిన రెండురౌండ్ల మ్యాచ్ ల్లో నెదర్లాండ్స్, ఎమిరేట్స్ తో శ్రీలంక, నమీబియాజట్లు పోటీపడాల్సి ఉంది.
గ్రూపు- బీ లీగ్ లో వెస్టిండీస్, జింబాబ్వే, స్కాట్లాండ్, ఐర్లాండ్.