Telugu Global
Sports

సూర్యకుమార్ సరికొత్త రికార్డు!

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

సూర్యకుమార్ సరికొత్త రికార్డు!
X

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరుతో ఉన్న రికార్డును

సూర్యకుమార్ తెరమరుగు చేశాడు....

20 ఓవర్లు..60 ధ్రిల్స్ గా సాగిపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ ను భారత నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ తన విలక్షణ స్ట్ర్రోక్ ప్లేతో కొత్తపుంతలు తొక్కిస్తున్నాడు.

మిస్టర్ 360 షాట్ మేకర్ గా తనపేరును పదేపదే సార్థకం చేసుకొంటూ వస్తున్నాడు.

బౌలర్ ఎవరన్నది చూడకుండా, ఆఫ్ సైడ్, ఆన్ సైడ్ అన్నతేడా లేకుండా గ్రౌండ్ నలుమూలలకూ తనదైన షాట్లతో విరుచుకుపడే సూర్యకుమార్ ప్రత్యర్థిజట్ల బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాడు.

ర్యాంప్ షాట్లు, స్వీప్, పుల్, కట్ షాట్లు, లాఫ్టెడ్, ఫ్లిక్ షాట్లతో వారేవ్వా అనిపించుకొంటున్నాడు.

శిఖర్ ధావన్ ను మించిన సూర్య...

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున నిలకడగా రాణిస్తూ వస్తున్న సూర్యకుమార్ గత ఏడాదే భారత టీ-20 క్యాప్ సంపాదించాడు. ఇంగ్లండ్ తో ఇంగ్లండ్ గడ్డపైన జరిగిన సిరీస్ ద్వారా మెరుపుశతకం బాదడం ద్వారా సూర్య భారతజట్టులో తన స్థానం పదిలం చేసుకొన్నాడు. భారత టీ-20 జట్టులో రెండోడౌన్ స్థానాన్ని తనదిగా మార్చుకొన్నాడు.

దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ లో హాంకాంగ్ పై మెరుపులు మెరిపించిన సూర్యకుమార్...ఆస్ట్ర్రేలియాతో తీన్మార్ సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ లో సైతం చెలరేగిపోయాడు.

ఇక..టీ-20 మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికాతో తిరువనంతపురం వేదికగా ముగిసిన తొలి టీ-20లోనూ అజేయ హాఫ్ సెంచరీతో సూర్య మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. బ్యాటింగ్ కు అంతగా అనువుకాని తిరువనంతపురం పిచ్ పైన సూర్య 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. ఓపెనర్ రాహుల్ తో కలసి మూడో వికెట్ కు 97 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేశాడు.

ఈ క్రమంలో ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక అంతర్జాతీయ టీ-20 పరుగులు సాధించిన భారత తొలి బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పటి వరకూ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరుతో ఉన్నరికార్డును అధిగమించాడు. క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డును సైతం సూర్య సాధించాడు.

2022 సీజన్లో ఇప్పటి వరకూ తాను ఆడిన 20 మ్యాచ్ ల్లో సూర్యకుమార్ 732 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. 37.88 సగటుతో సూర్య..భారత్ కు అత్యంత కీలకమైన బ్యాటర్ గా నిలిచాడు.

సఫారీ ఫాస్ట్ బౌలర్ నోర్జే బౌలింగ్ లో సిక్సర్ బాదడం ద్వారా...సూర్య సరికొత్త రికార్డు నెలకొల్పగలిగాడు.

టీ-20 ఫార్మాట్లో దిగ్గజ బ్యాటర్లుగా పేరుపొందిన మైకేల్ బేవన్, ఏబీ డివిలియర్స్ లను తలపిస్తున్న సూర్యకుమార్ ..ఆస్ట్ర్రేలియాతో ఆఖరి టీ-20లో 36 బాల్స్ లోనే 69 పరుగుల స్కోరు నమోదు చేశాడు.

దక్షిణాఫ్రికా పైన సైతం అజేయ హాఫ్ సెంచరీతో నిలిచాడు. సిరీస్ లోని మిగిలిన రెండు టీ-20 మ్యాచ్ ల్లోనూ సూర్యకుమార్ ఇదేజోరు కొనసాగించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

First Published:  29 Sept 2022 11:13 AM IST
Next Story