Telugu Global
Sports

సూర్య వెలుగు- భారత్ జిలుగు!

ధామ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత్ నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్ వెలిగిపోతున్నాడు. న్యూజిలాండ్ తో ముగిసిన రెండోటీ-20లో సైతం మెరుపు శతకంతో చెలరేగిపోయాడు.

సూర్య వెలుగు- భారత్ జిలుగు!
X

సూర్య వెలుగు- భారత్ జిలుగు!

ధామ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత్ నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్ వెలిగిపోతున్నాడు. న్యూజిలాండ్ తో ముగిసిన రెండోటీ-20లో సైతం మెరుపు శతకంతో చెలరేగిపోయాడు. భారత్ కు 65 పరుగుల భారీవిజయం అందించాడు. విరాట్ కొహ్లీ పేరుతో ఉన్న ఓ రికార్డును తెరమరుగు చేశాడు...

2022 సీజన్ టీ-20 ఫార్మాట్లో మిస్టర్ టీ-20, భారత నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ హవా కొనసాగుతోంది. ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన ప్రపంచకప్ లో కనబరచిన జోరునే న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ-20 సిరీస్ లోనూ కొనసాగిస్తున్నాడు. బే ఓవల్ వేదికగా కివీస్ తో ముగిసిన రెండో టీ-20లో 51 బాల్స్ లోనే 111 పరుగులు చేయటం ద్వారా ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లోనే రెండో సెంచరీ సాధించాడు.

వన్ డౌన్ లో సూర్య ధనాధన్...

ప్రపంచకప్ లో భారతజట్టు రెండోడౌన్లో బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ కు న్యూజిలాండ్ తో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో మాత్రం వన్ డౌన్ కు ప్రమోషన లభించింది. గతంలో విరాట్ కొహ్లీ ఆడిన వన్ డౌన్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన 32 ఏళ్ళ సూర్యకుమార్ యాదవ్ ఎముకలు కొరికే చలివాతావరణంలో తన సూపర్ బ్యాటింగ్ తో మంటలు రేపాడు.

హార్థిక్ పాండ్యా నాయకత్వంలో న్యూజిలాండ్ తో న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ఈ పోరులో సూర్యకుమార్ ..చూయింగ్ గమ్ నమిలినంత తేలికగా బౌండ్రీలు, సిక్సర్లు బాదేస్తూ కివీ బౌలర్ల కు చుక్కలు చూపించాడు.

కేవలం 51 బాల్స్ లోనే 7 సిక్సర్లు, 11 బౌండ్రీలతో సూర్య 111 పరుగులు చేయడం ద్వారా 2022 సీజన్లో తన రెండో టీ-20 శతకం నమోదు చేయగలిగాడు. సెంచరీలోని తన ఆఖరి 64 పరుగుల స్కోరును కేవలం 18 బంతుల్లోనే సూర్య సాధించడం విశేషం. 217.64 స్ట్రయిక్ రేట్ తో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోడంతో భారత్ 6 వికెట్లకు 191 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.

సమాధానంగా న్యూజిలాండ్ 18.5 ఓవర్లలోనే 126 పరుగులకే కుప్పకూలడంతో భారత్ 65 పరుగుల భారీవిజయం సాధించగలిగింది. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రోహిత్ శ‌ర్మ త‌ర్వాత ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో రెండు టీ- 20 సెంచ‌రీలు సాధించిన భార‌త బ్యాట‌ర్‌గా సూర్య‌కుమార్ రికార్డు సాధించాడు. రోహిత్ శ‌ర్మ 2018లో ఈ ఫీట్ సాధించాడు. అంతేకాదు ఒక ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన మొద‌టి భార‌త బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమే.

విరాట్ కొహ్లీని మించిన సూర్య...

క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన విరాట్ కొహ్లీ రికార్డును సూర్యకుమార్ యాదవ్ అధిగమించాడు ఓ క్యాలెండర్ ఇయర్ లో విరాట్ అత్యధికంగా ఆరుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిస్తే...సూర్యకుమార్ 2022 కాలెండర్ ఇయర్ లో 7సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజా సైతం ఏడు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ తో జరిగే ఆఖరి టీ-20 మ్యాచ్ ద్వారా సికిందర్ రజా రికార్డును సూర్య అధిగమించే అవకాశం లేకపోలేదు.

2022 సీజన్లో 1454 పరుగుల సూర్య...

న్యూజిలాండ్ తో ముగిసిన రెండో టీ-20 వరకూ 2022 కాలెండర్ ఇయర్ లో ఐపీఎల్ మ్యాచ్ లతో కలుపుకొని మొత్తం 38 టీ-20 మ్యాచ్ లు ఆడిన సూర్యకుమార్ 1454 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన మొనగాడిగా నిలిచాడు.

భారత్ తరపున 30 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు ఆడిన సూర్య 1151 పరుగులు సాధించాడు. 2016 సీజన్లో విరాట్ కొహ్లీ 31 మ్యాచ్ ల్లో సాధించిన 1614 పరుగుల రికార్డుకు సూర్య 160 పరుగుల దూరంలో నిలిచాడు.

ప్రస్తుత సిరీస్ లో మరో టీ-20 మ్యాచ్ మాత్రమే మిగిలిఉండడంతో విరాట్ అత్యధిక పరుగుల రికార్డును సూర్య అధిగమించడం అంతతేలిక కాదు. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 2021 సీజన్లో 29 మ్యాచ్ లు ఆడి సాధించిన 1326 పరుగుల రికార్డుకు సూర్య 175 పరుగుల దూరంలో నిలిచాడు. రిజ్వాన్ రికార్డును సైతం సూర్య చేరుకొనే అవకాశాలు అంతంత మాత్రమే.

భారతజట్టు ప్రపంచ రికార్డు...

న్యూజిలాండ్ తో బే ఓవల్ వేదికగా రెండో టీ-20 మ్యాచ్ ఆడటం ద్వారా భారత్ ఓ అరుదైన రికార్డు సాధించింది. ఒక్క ఏడాదిలో మూడుఫార్మాట్లలోనూ కలసి అత్యధిక

మ్యాచ్‌లు ఆడిన జ‌ట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో ఆదివారం ముగిసిన రెండో టీ- 20 మ్యాచ్‌తో ఈ సంవ‌త్స‌రం భార‌త జ‌ట్టు మొత్తం 62 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడినట్లయ్యింది. దాంతో, ఒక ఏడాదిలో ఎక్కువ మ్యాచ్‌లు (వ‌న్డేలు, టెస్టులు, టీ 20 లు క‌లిపి) ఆడిన జ‌ట్టుగా టీమిండియా ప్ర‌పంచ రికార్డు సాధించింది. ఇంత‌కుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా జ‌ట్టు పేరు మీద‌ ఉంది. ఆస్ట్రేలియా 2009లో 61 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌నకు ముందు 61 మ్యాచ్‌ల‌తో భారత్, ఆస్ట్రేలియా సమంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త జ‌ట్టు 39 టీ-20 మ్యాచ్‌లు ఆడింది.

అత్యధిక విజయాల రికార్డు..

అంతేకాదు, ఒక్క ఏడాదిలో అత్య‌ధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్టుగా కూడా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది 62 మ్యాచ్‌లు ఆడిన భార‌త జ‌ట్టు 43 మ్యాచ్‌ల్లో విజేత‌గా నిలిచింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భార‌త్ టెస్ట్‌ల్లో నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. రోహిత్ నాయ‌క‌త్వంలో భారతజట్టు స్వ‌దేశంలో వెస్డిండీస్, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికాతో జరిగిన వ‌న్డే, టీ 20 సిరీస్‌ల‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌నతో విజ‌యాలు సాధించింది. ఈ ఏడాది టీ -20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సూపర్ -12 రౌండ్ నుంచి అద‌ర‌గొట్టిన భారత్ సెమీఫైన‌ల్లో మాత్రం ఇంగ్లండ్ చేతిలో ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది.

First Published:  21 Nov 2022 12:44 PM IST
Next Story