Telugu Global
Sports

సూర్య..ఒకేదెబ్బకు మూడు పిట్టలు!

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ తనపేరును సార్థకంగా చేసుకొన్నాడు.

Suryakumar Yadav
X

సూర్యకుమార్ యాదవ్

స్కై(SKY ) అంటే ఆకాశం. క్రికెట్ వర్గాలలో స్కై అంటే సూర్యకుమార్ యాదవ్. భారతజట్టులో చోటు కోసం 11 ఏళ్లపాటు ఎదురుచూసి..టీ-20 అరంగేట్రం తో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని..ఒకే దెబ్బకు మూడు పిట్టలు కొట్టిన మొనగాడిగా నిలిచాడు....

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ తనపేరును సార్థకంగా చేసుకొన్నాడు. SKY అన్న మూడక్షరాల ఆంగ్ల పదానికి మరోపేరు తానేనని Surya Kumar Yadav తన ఆటతీరుతో చాటుకొన్నాడు.

31 ఏళ్ల వయసులో భారత క్యాప్...

ముంబై స్కూల్ ఆఫ్ క్రికెట్లో..20 సంవత్సరాల వయసులో ప్రవేశించిన సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ క్రికెట్ తో పాటు..ఐపీఎల్ లోనూ పదేపదే సత్తా చాటుకొంటూ వచ్చినా..భారతజట్టులో చోటు కోసం 11 సంవత్సరాలపాటు నిరీక్షించాల్సి వచ్చింది.

అదృష్టం అందరికీ ఒకేతీరుగా ఉండదనటానికి టీ-20 సంచలనం సూర్యకుమార్ యాదవే నిదర్శనం. అపారప్రతిభ ఉన్నా, ఏళ్ల తరబడి నిలకడగా రాణించినా భారతజట్టులో చోటు కోసం దశాబ్దకాలంపాటు నిరీక్షించాల్సి వచ్చింది.

2011 ఐపీఎల్ సీజన్లో కనీస ధర 10 లక్షల రూపాయల కాంట్రాక్టుపై ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. తుదిజట్టులో తగిన అవకాశాలు దక్కకపోడంతో 2014 సీజన్లో కోల్ కతా ఫ్రాంచైజీకి మారాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆ తర్వాతి మూడుసీజన్లలో 54 మ్యాచ్ ల్లో.. పలు కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పాటు మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత 2018 సీజన్ వేలం ద్వారా 8 కోట్ల రూపాయల ధరకు తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులో సగర్వంగా చేరగలిగాడు.

2018 సీజన్ నుంచి ముంబైజట్టు కీలక ఆటగాడిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవడంలో ప్రధానపాత్ర వహించాడు.

2018 ఐపీఎల్ సీజన్లో 512 పరుగులు, 2019లో 424 పరుగులు, 2020లో 480 పరుగులు సాధించినా సూర్యకుమార్ ను భారత సెలెక్టర్లు ఏమాత్రం కరుణించలేదు.

అయితే..2022 టీ-20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకొని భారత టీమ్ మేనేజ్ మెంట్ పలువురు యువఆటగాళ్లకు, ప్రతిభావంతులైనవారికి జట్టులో చోటు కల్పించింది.

భారతజట్టులో చోటు కోసం 11 సంవత్సరాలపాటు నిరీక్షించిన సూర్యకుమార్ కు 31 సంవత్సరాల వయసులో అవకాశం దక్కింది.

భారత్- ఏ జట్టు తరపున పలు మ్యాచ్ లు ఆడిన సూర్యకుమార్ 2021 సీజన్లో భారత సీనియర్ జట్టులో చేరాడు. ఆ తరువాత నుంచి సూర్య మరివెనుదిరిగి చూసింది లేదు.

2021 సీజన్ నుంచి సూర్య షో...

సూర్యకుమార్ యాదవ్ కు రాత్రికి రాత్రే భారతజట్టులో చోటు దక్కలేదు. సూర్య వెనుక గాడ్ ఫాదర్లు అసలే లేరు. కేవలం ప్రతిభనే నమ్ముకొని, నిరంతర సాధనతో , ఎక్కడలేని ఓర్పుతో..నిలకడగా రాణించడం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొన్నాడు.

మిస్టర్ టీ-20, స్కై.. మిస్టర్ 360, స్కూప్ స్టార్ లాంటి ముద్దుపేర్లతో సూర్యాను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తుంటే...క్రికెట్ విమర్శకులు, దిగ్గజాలు, వ్యాఖ్యాతలు మాత్రం గృహాంతరవాసి అంటూ, సూర్య కొట్టే షాట్లు మనుషులు ఆడే షాట్లు కావంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు..కేవలం 25 బాల్స్ లోనే సుడిగాలి హాఫ్ సెంచరీ, 45 బాల్స్ లోనే మెరుపు సెంచరీలతో మ్యాచ్ స్వరూపాన్నే సమూలంగా మార్చేస్తున్నసూర్యాను ఎలాపడగొట్టాలో అర్ధంకాక ప్రత్యర్థిజట్ల కెప్టెన్లు, కోచ్ లు తలలు పట్టుకొంటున్నారు.

3 ఇన్ 1 స్టార్ సూర్య....

భారతజట్టు తరపున తన అరంగేట్రం మ్యాచ్ నుంచి శ్రీలంకతో ముగిసిన 2023 టీ-20 సిరీస్ వరకూ ఆడిన 45 మ్యాచ్ ల్లో సూర్యకుమార్ 1578 పరుగులు సాధించడంతో పాటు 180.34 స్ట్ర్రయిక్ రేట్ తో వారేవ్వా అనిపించుకొన్నాడు.

117 పరుగులు అత్యథిక స్కోరుతో సహా మూడు శతకాలు, 13 అర్థశతకాలు బాదాడు. 142 ఫోర్లు, 92 సిక్సర్ హిట్లతో 46.42 సగటు నమోదు చేశాడు.

అంతేకాదు..ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన ప్రపంచకప్ ద్వారా భారత టీ-20 జట్టులో రెండోడౌన్ స్థానాన్ని సొంతం చేసుకోడంతో పాటు పదిలపరచుకొన్న సూర్య ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ మొదటి ఐదుమ్యాచ్ ల్లోనే మూడు మెరుపు హాఫ్ సెంచరీలతోపాటు 225 పరుగులు సాధించాడు.

పెర్త్ ఫాస్ట్, బౌన్సీ పిచ్ పై దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ -12 రౌండ్ పోరులో భారత టాపార్డర్ లోని దిగ్గజాలంతా పిల్లిమొగ్గలు వేస్తే..సూర్య మాత్రం తన అసాధారణ బ్యాటింగ్ తో 68 పరుగుల స్కోరు సాధించాడు. టీ-20 క్రికెట్ చరిత్రలోనే సూర్య ఇన్నింగ్స్ ఓ అపురూపమైన ఇన్నింగ్స్ గా మిగిలిపోతుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

భారత క్రికెట్లోని కొందరు నవతరం సాధారణ ఆటగాళ్లకు ఏమాత్రం ఎదురుచూడకుండానే భారతజట్టులో చోటు దక్కుతుంటే...సూర్యకుమార్ యాదవ్ లాంటి అసాధారణ, అపురూప బ్యాటర్ 11 సంవత్సరాలపాటు ఎనలేని ఓర్పుతో ఎదురుచూడాల్సి రావడం ఆశ్చర్యమే మరి.

సూర్యకు ఐసీసీ అవార్డు...

ప్రతిభ ఉంటే..దానికి కాస్త అదృష్టం తోడైతే..అవార్డులు, రివార్డులు ఒకదానికి వెనుక ఒకటిగా ..వాటంతట అవే వెతుక్కొంటూ వస్తాయనటానికి సూర్యానే నిదర్శనం.

టీ-20 ఫార్మాట్లో టాప్ ర్యాంక్ బ్యాటర్ గా నిలిచిన తొలి భారత క్రికెటర్ ఘనతను సాధించిన సూర్యాకు ..ఐసీసీ మెన్స్‌ టీ-20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

భారత టీ-20 ఫార్మాట్ మిస్టర్‌ 360 గా నీరాజనాలు అందుకొంటున్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ అవార్డును చూసి మురిసిపోతున్నాడు. ఈ అవార్డు సాధించడం తనకు ఓ అపూర్వమైన గౌరవం, అనుభూతి అంటూ సూర్య కుమార్‌ యాదవ్‌ ప్రకటించాడు.

ఈ పురస్కారం కోసం పోటీ పడిన విదేశీ క్రికెటర్లలో సామ్ కరెన్ ( ఇంగ్లండ్ ), మహ్మద్ రిజ్వాన్ ( పాకిస్థాన్ ), సికిందర్ రజా ( జింబాబ్వే ) ఉన్నారు. తన కెరియర్ లో 2022 ఎంతో కీలకమైనది, ప్రత్యేకమైనది అంటూ సూర్య తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత సూర్యకుమార్ తన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేశాడు.గతంలో ఎవ్వరూ బ్యాట్ చేయని రీతిలో సూర్యా షాట్లు కొడుతూ, బ్యాటింగ్ చేస్తూ బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాడు. టీ-20 ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ బ్యాటర్‌గా నిలిచాడు. 31 మ్యాచ్‌లలో 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2022 సంవత్సరాన్ని ముగించాడు. వీటిలో 68 సిక్సర్లతో పాటు.. రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఒకే దెబ్బకు మూడు ఫార్మాట్లలో చోటు...

భారతజట్టులో చోటు కోసం 11 సంవత్సరాల సుదీర్ఘకాలం ఎదురుచూసిన సూర్యకుమార్..2022 సీజన్ ను కళ్లు చెదిరే రీతిలో ముగించడంతో..భారత టీ-20, వన్డే, టెస్ట్ ఫార్మాట్ జట్లలో చోటు సంపాదించగలిగాడు.

టీ-20 జట్టులో చోటు దక్కితే చాలునని అనుకొన్న సూర్యాకు శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో ముగిసిన భారత వన్డే జట్లలో మాత్రమే కాదు..ఆస్ట్రేలియాతో జరుగనున్న ఐసీసీ టెస్టు లీగ్ నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనే జట్టులో సైతం బీసీసీఐ చోటు కల్పించింది.

టీ-20 అవకాశం కోసం 11 సంవత్సరాలపాటు ఎదురుచూసిన సూర్యాకు..ఏమాత్రం నిరీక్షణ లేకుండానే వన్డే, టెస్టుజట్లలో చోటు దక్కడం విశేషం. ఒకే దెబ్బకు మూడు పిట్టలు కొట్టడం అంటే ఇదేమరి.

భారత వన్డే, టెస్టుజట్ల తరపునా సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలని కోరుకొందాం.!

First Published:  26 Jan 2023 3:51 PM IST
Next Story