Telugu Global
Sports

సుప్రీంకోర్టులో మహ్మద్ అజారుద్దీన్‌కు చుక్కెదురు.. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశం

తెలంగాణ హైకోర్టు జారీ చేసిన నోటీసులపై అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ బీఆర్. గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం.. అజారుద్దీన్‌ను హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టులో మహ్మద్ అజారుద్దీన్‌కు చుక్కెదురు.. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశం
X

కోర్టు ధిక్కారణ కేసులో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఇచ్చిన తీర్పు విషయంలో ధిక్కారణకు పాల్పడ్డారని.. ఏదైనా ఉంటే తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే లీగ్ మ్యాచ్‌లలో పాల్గొనడానికి నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఎన్‌డీసీఏ) క్రీడాకారులను గతంలో అనుమతించలేదు. పలుమార్లు హెచ్‌సీఏను విజ్ఞప్తి చేసినా సానుకూలంగా స్పందన రాలేదు. దీంతో 2021లో ఎన్‌డీసీఏ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ క్రీడాకారులను హెచ్‌సీఏ లీగ్స్‌లో అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. 2021-22 షెడ్యూల్ లీగ్స్‌లో ఎన్‌డీసీఏ క్రీడాకారులను అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

హెచ్‌సీఏకు అనుబంధం జట్టుగా ఉన్నందున భవిష్యత్‌లో జరిగే అన్ని సమావేశాలు, మ్యాచ్‌లు, టోర్నమెంట్స్‌లలో కూడా అనుమతించేలా అధ్యక్షుడు అజారుద్దీన్, బీసీసీఐకి ఆదేశాలు ఇవ్వాలని ఎన్‌డీసీఏ మరో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే.. హైకోర్టు తీర్పు తర్వాత కూడా ఎన్‌డీసీఏకు హెచ్‌సీఏలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది.

ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును హెచ్‌సీఏ అమలు చేయడం లేదని ఆరోపిస్తూ 2023 ప్రారంభంలో ఎన్‌డీసీఏ.. హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్‌డీసీఏ క్రికెటర్ల రిజిస్ట్రేషన్‌ను కూడా హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ అనుమతించకుండా ఇబ్బందులు పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నది. ఎన్‌డీసీఏ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి.. ఈ ఏడాది ఏప్రిల్‌లో అజారుద్దీన్‌కు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేశారు.

హైకోర్టుకు నోటీసుల నేపథ్యంలో జూన్ 23న హైకోర్టుకు హాజరైన అజారుద్దీన్ లాయర్.. అక్కడ వివరణ ఇచ్చారు. అయితే, హైకోర్టు మాత్రం అజార్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు. అంతే కాకుండా కోర్టు ధిక్కారణకు పాల్పడినందున ఆగస్టు 4న హైకోర్టులో స్వయంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ హైకోర్టు జారీ చేసిన నోటీసులపై అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ బీఆర్. గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం.. అజారుద్దీన్‌ను హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. మీరు హైకోర్టు ధిక్కరణకు పాల్పడ్డారా లేదా అని ప్రశ్నించగా.. అజార్ తరపు న్యాయవాది లేదు అని సమాధానం ఇచ్చారు. దీనిపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయం హైకోర్టుకు వెళ్లి తేల్చుకోమని ఆదేశించింది. దీంతో అజార్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్నారు.

First Published:  23 July 2023 2:13 PM IST
Next Story