Telugu Global
Sports

హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఎన్నికలు ఎప్పుడంటే

జస్టిస్ లావు నాగేశ్వరావు హెచ్‌సీఏలో సభ్యులుగా ఉన్న పలు క్లబ్బులపై నిషేధం విధించారు.

హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఎన్నికలు ఎప్పుడంటే
X

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పాలక మండలి ఎన్నికల విషయంలో ఒక ఏడాదిగా ఉన్న వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. నిరుడు సెప్టెంబర్ 30న అప్పటి పాలక మండలి అధ్యక్షుడు అజారుద్దీన్ పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత తనకు తానే ఎక్స్‌టెన్షన్ ఇచ్చుకోవడంతో కొంత మంది కోర్టుకు ఎక్కారు. అంతే కాకుండా అజారుద్దీన్ వ్యతిరేక వర్గం హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి ప్రయత్నించింది. వాళ్లే స్వయంగా ఎన్నికల నిర్వహించుకోడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరారావును సింగిల్ మెంబర్ కమిటీగా నియమించింది. హెచ్‌సీఏలో నెలకొన్న వివాదాల పరిస్కారం, ఎన్నికల నిర్వహణకు జస్టిస్ లావు నాగేశ్వరరావుకు పూర్తి హక్కులు కట్టబెట్టింది.

జస్టిస్ లావు నాగేశ్వరావు హెచ్‌సీఏలో సభ్యులుగా ఉన్న పలు క్లబ్బులపై నిషేధం విధించారు. చాలా క్లబ్బులకు ఒకరే ప్రమోటర్లుగా, డైరెక్టర్లుగా ఉండటం.. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వివిధ క్లబ్బులకు బాధ్యులుగా ఉండటంతో అలాంటి క్లబ్స్‌పై నిషేధం విధించారు. ఈ ఏడాది జూలైలో అలాంటి 57 క్లబ్స్‌ను హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటు వేయకుండా డీబార్ చేశారు. అంతే కాకుండా ఎలక్షన్ నిర్వహణ కోసం మాజీ సీఈసీ సంపత్‌ను ఎన్నికల అధికారిగా నియమించారు. అయితే క్లబ్స్‌ను నిషేధించడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సింగిల్ మెంబర్ కమిటీకి వ్యతిరేకంగా ఏ కోర్టు కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని సుప్రీంకోర్టు గత నెల 15న ఆదేశాలు జారీ చేసింది. దీంతో హెచ్‌సీఏ ఎన్నికలకు మార్గం సుగమమం అయ్యింది.

హెచ్‌సీఏ ఎన్నికలు అక్టోబర్ 20న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎలక్షన్ నోటిఫికేషన్‌ను ఎన్నికల అధికారి సంపత్ విడుదల చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితో పాటు ఈసీ మెంబర్స్‌ను ఎన్నుకోనున్నారు. అక్టోబర్ 4 నుంచి 7 వరకు ఎన్నికల అధికారి నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 14న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. అక్టోబర్ 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అక్టోబర్ 20న పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఓట్లు లెక్కించనున్నారు.

హెచ్‌సీఏలో ఓటు హక్కు కలిగి ఉన్న 149 క్లబ్స్, విద్యాసంస్థలు, ఆరు జిల్లా క్రికెట్ అసోసియేషన్లు, ఏడుగురు అంతర్జాతీయ పురుష క్రికెటర్లు, ఎనిమిది మంది అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఈ నెల 4న ఉదయం 11.30 గంటలకు హెచ్‌సీఏ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు సంపత్ తెలియజేశారు. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.

First Published:  1 Oct 2023 3:55 AM GMT
Next Story