Telugu Global
Sports

దేశవాళీ క్రికెట్లో సూపర్ సబ్ ప్రయోగం!

దేశవాళీ క్రికెట్లో మరో అంతర్జాతీయ ప్రయోగానికి బీసీసీఐ నడుం బిగించింది. 2022-23 దేశవాళీ టీ-20 ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ ల్లో సూపర్ సబ్ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

దేశవాళీ క్రికెట్లో సూపర్ సబ్ ప్రయోగం!
X

దేశవాళీ క్రికెట్లో మరో అంతర్జాతీయ ప్రయోగానికి బీసీసీఐ నడుం బిగించింది. 2022-23 దేశవాళీ టీ-20 ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ ల్లో సూపర్ సబ్ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

మూడున్నర గంటల్లో ధూమ్ ధామ్ గా సాగిపోయే టీ-20 క్రికెట్ అంటేనే సంచలనాలకు మరోపేరు. 20 ఓవర్లు 60 థ్రిల్స్ గా సాగిపోయే ఈ ఫటాఫట్ సమరాన్ని మరింత రంజుగా ఉండేలా చేయటానికి అంతర్జాతీయస్థాయిలో ఐసీసీ, జాతీయస్థాయిలో బీసీసీఐ తమవంతుగా పలు ప్రయోగాలు చేస్తున్నాయి.

ఐదురోజులపాటు సాగే సాంప్రదాయ టెస్టు క్రికెట్, ఒక్కరోజులో అటోఇటో ముగిసిపోయే ఇన్ స్టంట్ వన్డే క్రికెట్ కు భిన్నంగా టీ-20 క్రికెట్ మ్యాచ్ లు ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి.

పవర్ ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లు, పించ్ హిట్టర్లు, ఇంపాక్ట్ ప్లేయర్లు, ర్యాంప్, స్కూప్ షాట్లు,,,ఇలా సరికొత్తగా రకరకాల క్రికెట్ పదాలు వచ్చి చేరుతున్నాయి.

ఆ పదాల సరసన చేరిన మరో సరికొత్త పదమే సూపర్ సబ్ స్టిట్యూట్.

సూపర్ సబ్ తో సూపర్ హిట్...

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా తుదిజట్టులో 11 మంది ప్రధాన ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ...ఇలా పలురకాల బాధ్యతల్ని నిర్వర్తించే అవకాశం కేవలం తుదిజట్టులోని ఆటగాళ్లకు మాత్రమే ఉంటుంది. తుదిజట్టులోని ఒకరిద్దరు ఆటగాళ్లు గాయపడితే...12వ ఆటగాడితో పాటు...మరో సబ్ స్టిట్యూట్ ప్లేయర్ ను ఫీల్డింగ్ కు దించుకొనే వెసలుబాటు ఉంటుంది. సబ్ స్టిట్యూట్ ఆటగాళ్లకు బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశమే ఉండదు.

అయితే..టెస్టు, వన్డే ఫార్మాట్లకు భిన్నంగా టీ-20 క్రికెట్లో సూపర్ సబ్ స్టిట్యూట్ నిబంధన ప్రకారం ఆట ప్రారంభ ఓవర్లలోనే తుదిజట్టులోకి వచ్చే ఆటగాడికి బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది.

గేమ్ చేంజర్ గా సూపర్ సబ్....

టీ-20 క్రికెట్లో మరింత ఉత్కంఠను రేకెత్తించడానికి వీలుగా ఐసీసీ గతంలోనే సూపర్ సబ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి చూసింది. మ్యాచ్ స్వరూపస్వభావాలను ఒక్కసారిగా మార్చివేయగల దమ్ము, శక్తి ఈ సూపర్ సబ్ స్టిట్యూట్ నిబంధనకు ఉందని భారత మాజీ కోచ్, విఖ్యాత క్రికెట్ కామెంటీటర్ రవిశాస్త్రి చెబుతున్నారు.

ఇప్పటికే అంతర్జాతీయస్థాయి మ్యాచ్ ల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన సూపర్ సబ్ నిబంధనను...దేశవాళీ క్రికెట్లోనూ ప్రయోగాత్మకంగా అమలు చేసి చూడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది.

2022-23 సీజన్ దేశవాళీ టీ-20 ( సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ) క్రికెట్ పోటీలలో సూపర్ సబ్ నిబంధనను ప్రవేశపెట్టనున్నారు.

ఏమిటీ సూపర్ సబ్ ?

ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములువాడి అన్నమాటను నిజం చేసిన టీ-20 ఫార్మాట్లోకి వచ్చిన మరో సరికొత్త నిబంధనే సూపర్ సబ్ స్టిట్యూట్.

ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ ప్రారంభానికి ముందే ప్రతిజట్టూ తమ 11 మంది ప్రధాన ఆటగాళ్లతో పాటు..నలుగురు సూపర్ సబ్ ( ప్రభావశీల ఆటగాళ్లు ) ప్లేయర్ల పేర్లను విధిగా అంపైర్లకు ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రధాన ఆటగాళ్లలో ఒకరికి గాయమైనా...కాకున్నా నలుగురు సూపర్ సబ్ ఆటగాళ్లలో ఒకరిని తుదిజట్టులో ఆడించుకొనే వీలు ఉంటుంది. ఆట 14వ ప్రారంభానికి ముందే సూపర్ సబ్ ను బరిలోకి దించుకోవాల్సి ఉంటుంది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు వరుసగా వికెట్లు నష్టపోయి ఎదురీదుతున్న తరుణంలో సూపర్ సబ్ స్టిట్యూట్ గా ఓ మెరుపు బ్యాటర్ ను బ్యాటింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. లేదా బౌలింగ్ చేస్తున్న సమయంలో ప్రధానబౌలర్లంతా విఫలమై, ధారాళంగా పరుగులు ఇస్తున్న సమయంలో సూపర్ సబ్ గా ఓ స్పెషలిస్ట్ బౌలర్ ను బౌలింగ్ కు దించుకొనే వీలుంది.

తుదిజట్టు 11మందిలో ఒక ఆటగాడి స్థానంలో సూపర్ సబ్ వచ్చి చేరతాడు. సూపర్ సబ్ గా తుదిజట్టులోకి వచ్చిన ఆటగాడు మ్యాచ్ మొత్తం ముగిసే వరకూ కొనసాగాల్సి ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ సైతం చేసే అవకాశం ఉంటుంది.

అయితే..వర్షం కారణంగా లేదా వేరే ఏదైనా కారణంతో మ్యాచ్ 10 ఓవర్లకే పరిమితమైన తరుణంలో సూపర్ సబ్ నిబంధన అమలులో ఉండదు.

ఇప్పటికే ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, రగ్బీ లాంటి క్రీడల్లో టాక్టికల్ సబ్ స్టిట్యూషన్ పేరుతో సూపర్ సబ్ నిబంధనను అమలు చేస్తున్నారు. టీ-20 క్రికెట్లో సైతం ఇంపాక్ట్ ప్లేయర్ లేదా సూపర్ సబ్ పేరుతో పలు ఐసీసీ మ్యాచ్ లతో పాటు ఆస్ట్ర్రేలియా దేశవాళీ బిగ్ బాష్ లీగ్ లో సైతం ప్రయోగాత్మకంగా అమలు చేయగలిగారు.

మరి..అక్టోబర్ లో జరుగనున్న 2022-23 దేశవాళీ టీ-20 (సయ్యద్ ముస్తాక్ అలీ) టోర్నీలో సూపర్ సబ్ నిబంధనను తొలిసారిగా అమలు చేయటానికి బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.

సూపర్ సబ్ నిబంధన అమలుతో భారత దేశవాళీ టీ-20 క్రికెట్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకొంటాయన్నది తెలుసుకోవాలంటే మరి కొద్దివారాలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  17 Sept 2022 11:50 AM
Next Story