Telugu Global
Sports

ఆసియాకప్ లో నేటినుంచే సూపర్ -4 షో!

15వ ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో ఆరుజట్ల లీగ్ దశ పోటీలు ముగియడంతోనే...రెండోదశ నాలుగుజట్ల సూపర్ -4 సమరానికి రంగం సిద్ధమయ్యింది.

ఆసియాకప్ లో నేటినుంచే సూపర్ -4 షో!
X

15వ ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో ఆరుజట్ల లీగ్ దశ పోటీలు ముగియడంతోనే...రెండోదశ నాలుగుజట్ల సూపర్ -4 సమరానికి రంగం సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 3 నుంచి 9 వరకూ మొత్తం ఆరుమ్యాచ్ లు నిర్వహిస్తారు. సూపర్ సండే ( సెప్టెంబర్ 4) పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ తిరిగి తలపడనున్నాయి..

టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 15వ ఆసియాకప్ టీ-20 సమరంలో తొలిఘట్టం ( గ్రూప్ లీగ్ ) షార్జా క్రికెట్ స్టేడియంలో ముగిసింది.

ఆరుజట్లు, రెండుగ్రూపుల లీగ్ దశ నుంచి డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ చాంపియన్లు శ్రీలంక, పాకిస్థాన్, టీ-20 నయాపవర్ ఆప్ఘనిస్థాన్ జట్లు రెండోదశ సూపర్-4 రౌండ్ కు అర్హత సంపాదించాయి.

గ్రూప్- ఏ లీగ్ లో రెండుకు రెండుమ్యాచ్ లు నెగ్గిన భారత్, పసికూన హాంకాంగ్ పై రికార్డు విజయం సాధించడం ద్వారా పాకిస్థాన్ సూపర్ -4 రౌండ్ కు అర్హత సంపాదించాయి.

గ్రూప్ - బీ లీగ్ నుంచి ఆప్ఘనిస్థాన్ రెండుకు రెండుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా టాపర్ గా నిలిచింది. ఉత్కంఠ భరితంగా సాగిన మరో మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 2 వికెట్ల తేడాతో అధిగమించడం ద్వారా శ్రీలంక సైతం సూపర్ -4 రౌండ్ కు చేరుకోగలిగింది.

పసికూనపై పాక్ ప్రతాపం...

సూపర్ -4 రౌండ్ చేరాలంటే తన గ్రూప్ ఆఖరి పోరులో నెగ్గితీరాల్సిన పాకిస్థాన్ 155 పరుగుల భారీ తేడాతో పసికూన హాంకాంగ్ ను చిత్తు చేసింది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఏకపక్షపోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 193 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 78 నాటౌట్, వన్ డౌన్ ఫకర్ జమాన్ 53, రెండోడౌ్న్ కుష్ దిల్ 35 నాటౌట్ స్కోర్లు సాధించడంతో పాకిస్థాన్ ప్రస్తుత ఆసియాకప్ లీగ్ లో అత్యధిక స్కోరు సాధించినజట్టుగా నిలిచింది.

194 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన హాంకాంగ్..కేవలం 104 ఓవర్లలోనే 38 పరుగులకే కుప్పకూలిపోయింది. పాక్ స్పిన్ జోడీ షదాబ్ ఖాన్ 4వికెట్లు, రియాజ్ 3 వికెట్లు, యువఫాస్ట్ బౌలర్ల నసీమ్ ఖాన్ 2 వికెట్లు, షానవాజ్ దహానీ 1 వికెట్ పడగొట్టారు.

పాక్ విజయంలో ప్రధానపాత్ర వహించిన మహ్మద్ రిజ్వాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీ-20 ఫార్మాట్లో పాకిస్థాన్ కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. అంతేకాదు ప్రస్తుత ఆసియాకప్ సూపర్- 4 రౌండ్ చేరిన ఆఖరిజట్టుగా పాక్ నిలిచింది.

సూపర్ -4లో నేడు తొలిసమరం..

మొత్తం నాలుగుజట్ల సూపర్ -4 రౌండ్లో భాగంగా శనివారం షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగే తొలిపోరులో ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక తలపడతాయి. సెప్టెంబర్ 4న జరిగే సూపర్ సండే ఫైట్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ఢీ కొంటాయి. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతుంది.

సెప్టెంబర్ 6న దుబాయ్ వేదికగా జరిగే మరో పోరులో భారత్, ఆప్ఘనిస్థాన్ పోటీపడతాయి.

సెప్టెంబర్ 7 పాకిస్థాన్- శ్రీలంక, సెప్టెంబర్ 8న భారత్- శ్రీలంక, సెప్టెంబర్ 9న ఆప్ఘనిస్థాన్- పాకిస్థాన్ జట్ల మ్యాచ్ లను దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగానే నిర్వహిస్తారు.

ఈరోజు రాత్రి 7-30 గంటలకు జరిగే పోటీలో ఆప్ఘనిస్థాన్, శ్రీలంక అమీతుమీ తేల్చుకోనున్నాయి.

First Published:  3 Sept 2022 2:32 PM IST
Next Story