రైజర్స్ అవుట్..ప్లే-ఆఫ్ రౌండ్లో గుజరాత్ టైటాన్స్!
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ రౌండ్లోనే మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ పోటీ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ప్లే-ఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకొంది..
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ రౌండ్లోనే మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ పోటీ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ప్లే-ఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకొంది....
ఐపీఎల్-16వ సీజన్లో ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టుగా డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ నిలిచింది. లీగ్ 13వ రౌండ్ పోరులో హైదరాబాద్ సన్ రైజర్స్ ను టైటాన్స్ 34 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
హోంగ్రౌండ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ కీలక మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీ సాధించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
శుభ్ మన్ గిల్ సెంచరీ షో....
ఈ మ్యాచ్ లో టాస్ ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగుల స్కోరు సాధించింది.
సాహా- శుభ్ మన్ గిల్ జోడీ గుజరాత్ బ్యాటింగ్ ను ప్రారంభించారు. తొలి ఓవర్‌లోనే వృద్ధిమాన్ సాహా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌దారి పట్టాడు. ప్రస్తుత సీజన్లో మూడోసారి డకౌట్ గా వెనుదిరిగాడు. సన్ రైజర్స్ సీమర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో సాహా చిక్కాడు.
రెండో వికెట్ కు 147 పరుగుల భాగస్వామ్యం..
గుజరాత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్- వన్ డౌన్ సాయి సుదర్శన్ రెండో వికెట్ కు 147 పరుగుల భాగస్వామ్యంతో భారీస్కోరుకు మార్గం సుగమం చేశారు.
సాయి సుదర్శన్ 36 బంతుల్లో ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.
ఆ తర్వాత స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మ్యాజిక్ తో గుజరాత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (7), రాహుల్ తెవాటియా (3) స్కోర్లకే వెనుదిరిగారు. ఒక దశలో వికెట్ నష్టానికి 147 పరుగులు సాధించిన గుజరాత్ జట్టు.. 175 పరుగుల స్కోరుకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా..మరోవైపు యువఓపెనర్ శుభ్ మన్ గిల్ దూకుడుగా ఆడుతూ ఐపీఎల్ లో తన తొలిశతకం పూర్తి చేసి 101 పరుగుల స్కోరుకే భువీ బౌలింగ్ లో చిక్కాడు.
శుభ్‌మన్ గిల్ 58 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ తో 101 పరుగులు సాధించాడు.
గుజరాత్ 41 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీంతో గుజరాత్ 188 పరుగుల స్కోరుతో ప్రత్యర్థి ఎదుట 189 పరుగుల లక్ష్యం ఉంచగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు పడగొట్టాడు.
సన్ రైజర్స్ అదేసీన్...
మ్యాచ్ నెగ్గాలంటే 189 పరుగులు సాధించాల్సిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, మోహిత్ శర్మ చెలరేగి బౌల్ చేసి చెరో 4 వికెట్లు పడగొట్టారు.
హైదరాబాద్ బ్యాటర్లలో వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 64; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖరి ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ (27) సైతం తనవంతుగా పోరాడాడు.
టాపార్డర్ బ్యాటర్లు అన్మోల్‌ప్రీత్ (5), అభిషేక్ శర్మ (5), రాహుల్ త్రిపాఠి (1), కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్ (10), సన్వీర్ సింగ్ (7), అబ్దుల్ సమద్ (4), మార్కో జెన్సెన్ (3) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు.
గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. గుజరాత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
2022 సీజన్ లోనే మెగాలీగ్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్.. వరుసగా రెండోసారి ప్లేఆఫ్స్ చేరింది. నిరుడు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన హార్దిక్ సేన.. తాజా సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. 13 రౌండ్లలో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా గుజరాత్ నిలిచింది.
హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం 12 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 8 పరాజయాలతో ప్లే-ఆఫ్ రేస్ నుంచి నిష్క్ర్రమించింది.
గుజరాత్ టైటాన్స్ తన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో తలపడాల్సి ఉంది.
ఈ రోజు లక్నో లోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదిక రాత్రి 7-30కి జరిగే డూ ఆర్ డై పోరులో ముంబై ఇండియన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు పే-ఆఫ్ రేస్ నుంచి వైదొలగక తప్పదు.