Telugu Global
Sports

వందోటెస్టుకు ప్రత్యేక అతిథిగా సునీల్ గవాస్కర్!

భారత్- వెస్టిండీస్ జట్ల వందో టెస్టు మ్యాచ్ కు ప్రత్యేక అతిథిగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కు ఆహ్వానం అందింది.

వందోటెస్టుకు ప్రత్యేక అతిథిగా సునీల్ గవాస్కర్!
X

వందోటెస్టుకు ప్రత్యేక అతిథిగా సునీల్ గవాస్కర్!

భారత్- వెస్టిండీస్ జట్ల వందో టెస్టు మ్యాచ్ కు ప్రత్యేక అతిథిగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కు ఆహ్వానం అందింది. ట్రినిడాడ్ క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియంతో గవాస్కర్ కు విడదీయరాని అనుబంధం ఉంది.

భారత్- వెస్టిండీస్ జట్ల నడుమ ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగే వందోటెస్టు మ్యాచ్ కు హాజరు కావాలంటూ భారత మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది.

గవాస్కర్ అడ్డా కరీబియన్ గడ్డ!

1971 టెస్టు సిరీస్ ద్వారా వెస్టిండీస్ ప్రత్యర్థిగా కరీబియన్ గడ్డ క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా సునీల్ మనోహర గవాస్కర్ టెస్టు అరంగేట్రం చేశాడు. సిరీస్ లోని మొదటి, ఆఖరి టెస్టులకు ఆతిథ్యమిచ్చిన క్వీన్స్ పార్క్ లో సునీల్ గవాస్కర్ పరుగుల మోత మోగించాడు.

1948-49 సీజన్ నుంచి భారత్- వెస్టిండీస్ జట్లు ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లు ఆడుతూ వస్తున్నాయి. ఆ పరంపరలో భాగంగా జరిగిన 1971 సిరీస్ ద్వారా సునీల్ గవాస్కర్ తన టెస్టు జీవితాన్ని ప్రారంభించాడు.

తన మొట్టమొదటి టెస్టుమ్యాచ్ లోనే గవాస్కర్ తొలి ఇన్నింగ్స్ లో 65, రెండో ఇన్నింగ్స్ లో 67 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. ఇదే మ్యాచ్ లో భారత్ విజేతగా నిలిచింది. వెస్టిండీస్ పై భారత్ సాధించిన మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం.

ఐదుటెస్టుల సిరీస్ లో భాగంగా క్వీన్స్ పార్క్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో గవాస్కర్ విశ్వరూపమే చూపాడు. తొలి ఇన్నింగ్స్ లో 124 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 220 పరుగుల స్కోర్లతో చరిత్ర సృష్టించాడు. అజిత్ వాడేకర్ నాయకత్వంలోని భారతజట్టు ఐదుమ్యాచ్ ల సిరీస్ ను 1-0తో కైవసం చేసుకోగలిగింది.

1976 సిరీస్ లోనూ అదేజోరు...

1976 సిరీస్ లో భాగంగా ట్రినిడాడ్ క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో సైతం గవాస్కర్ మరో శతకంతో తన జట్టు విజయానికి బాటలు వేశాడు. గవాస్కర్ సూపర్ సెంచరీతో భారత్ 403 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకగా సాధించగలిగింది.

ట్రినిడాడ్ వేదికగా ఆడిన ప్రతి టెస్టు ఇన్నింగ్స్ లోనూ శతకమో, అర్థశతకమో సాధించడం గవాస్కర్ కు ఓ అలవాటుగా మారింది. అందుకే గవాస్కర్ తనకు ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ రెండో హోంగ్రౌండ్ అని తరచూ చెబుతూ ఉంటాడు.

సునీల్ గవాస్కర్ ను ట్రినిడాడ్ క్రికెట్ అభిమానులు 'మస్తా' అనే ముద్దుపేరుతో పిలుచుకొంటూ ఉంటారు.

కొద్దిరోజుల క్రితమే తన 74వ పుట్టినరోజును వేడుకగా జరుపుకొన్న గవాస్కర్ కు 100 టెస్టులు ఆడి, 10వేలకు పైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్ గా అరుదైన రికార్డు, ఘనత ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత నుంచి చక్కటి వ్యాఖ్యాతగా గవాస్కర్ క్రికెట్ కు సేవలు అందిస్తూ తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.

First Published:  20 July 2023 11:58 AM IST
Next Story