వరుస వైఫల్యాలు సహజమే..విరాట్ కు అండగా రోహిత్!
స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ వరుస వైఫల్యాలతో జట్టుకు వచ్చిన నష్టం ఏమీలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తేల్చిచెప్పాడు.
స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ వరుస వైఫల్యాలతో జట్టుకు వచ్చిన నష్టం ఏమీలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తేల్చిచెప్పాడు. విరాట్ కు దన్నుగా నిలిచాడు.
2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారత స్టార్ బ్యాటర్ కమ్ ఓపెనర్ విరాట్ కొహ్లీ వరుస వైఫ్యలాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. జట్టుకే భారంగా మారడం ద్వారా విమర్శకుల నోటికి గట్టిగా పని చెబుతున్నాడు. అయితే..భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన సహఓపెనర్ విరాట్ ను గట్టిగా వెనుకేసుకు వస్తున్నాడు.
7 ఇన్నింగ్స్ లో 75 పరుగుల రన్ మెషీన్..
బ్యాటింగ్ కు అనువుగా తయారు చేసిన ఐపీఎల్ పిచ్ లపైన పరుగుల మోత మోగించిన విరాట్ కొహ్లీ..అమెరికా, కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ వికెట్ల పైన మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు.
తన అంతర్జాతీయ టీ-20 కెరియర్ లో తొలిసారిగా భారత ఓపెనర్ గా ప్రపంచకప్ బరిలోకి దిగిన విరాట్ 7 ఇన్నింగ్స్ లో రెండు డకౌట్లతో 75 పరుగులు మాత్రమే చేయటాన్ని విమర్శకులు, విశ్లేషకులు తప్పుపడుతున్నారు. విరాట్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలంటూ సలహా ఇస్తున్నారు. విరాట్ కు బదులుగా తుదిజట్టులో యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు చోటు కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
గ్రూప్-ఏ లీగ్ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ వరకూ రోహిత్ తో కలసి 7 మ్యాచ్ ల్లో ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన విరాట్..ప్రారంభ ఓవర్లలోనే అవుట్ కావడం ద్వారా..జట్టుకు తగిన ఆరంభాన్ని ఇవ్వలేకపోయాడు. రిటైర్మెంట్ కు దగ్గరగా వచ్చిన విరాట్ కోసం ప్రతిభావంతులైన యువఆటగాళ్లను బలిపెడతారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
వచ్చిన నష్టం ఏమీలేదు....
జట్టుకు చక్కటి ఆరంభాన్ని ఇవ్వాల్సిన ఓపెనర్ విరాట్..పవర్ ప్లే ఓవర్లకు ముందే అవుట్ కావడంతో తమజట్టుకు వచ్చిన నష్టం ఏమీలేదని, విరాట్ విఫలమైనా తాము వరుస విజయాలు సాధిస్తూ..ఫైనల్స్ చేరిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని భారత కెప్టెన్ వ్యాఖ్యానించాడు. క్రికెటర్ల జీవితంలో వరుస వైఫల్యాలు ఓ భాగమని, సహజం కూడానని రోహిత్ సమర్ధించుకొచ్చాడు. విరాట్ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని, ఫైనల్లో ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాలని తాను కోరుకొంటున్నట్లు తెలిపాడు.
విరాట్ కు కపిల్ దేవ్ చురకలు..
మరోవైపు..విరాట్ కొహ్లీ లాంటి అపార అనుభవం కలిగిన స్టార్ బ్యాటర్ వరుసగా ఏడుమ్యాచ్ ల్లో విఫలం కావటం పట్ల భారత మాజీ కెప్టెన్, 65 సంవత్సరాల కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశారు. సహఓపెనర్ రోహిత్ శర్మను చూసి నేర్చుకోవాలంటూ పరోక్షంగా చురకలంటించారు.
ఓ బ్యాటర్ గా రోహిత్ కు తన పరిమితులేమిటో తెలుసునని, పరిమితమైన ప్రతిభతోనే జట్టుకు అపరిమితమైన మేలు చేస్తున్నాడంటూ కపిల్ కొనియాడారు. కొందరు ఆటగాళ్లు తమ కెరియర్ కోసం, రికార్డుల కోసమే ఆడతారని, కెప్టెన్సీని సైతం తమ స్వార్థం కోసమే ఉపయోగించుకొంటారంటూ..పరోక్షంగా విరాట్ ను దెప్పిపొడిచారు.
తన కెరియర్ లో ఆఖరి టీ-20 ప్రపంచకప్ ఫైనల్ ఆడనున్న విరాట్ కు బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే టైటిల్ పోరు అసలుసిసలు పరీక్షకానుంది.