టీమ్ ఇండియా వరల్డ్ కప్ జెర్సీ నుంచి 'స్టార్' మిస్సింగ్.. ఎందుకో తెలుసా?
జెర్సీని చూసిన ఫ్యాన్స్ వెంటనే ఒక విషయాన్ని గుర్తు పట్టారు. ఇప్పుడు అదే పెద్ద ట్రెండింగ్‌గా మారిపోయింది.
ఆసియా కప్‌లో నామమాత్రమైన ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ట్విట్టర్‌లో భారత జట్టు వరల్డ్ కప్ జెర్సీపై తీవ్రమైన చర్చ జరిగింది. బీసీసీఐ ఇంత వరకు టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ జెర్సీని విడుదల చేయలేదు. అయితే దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు మాత్రం శుక్రవారం సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ జెర్సీని చూసిన ఫ్యాన్స్ వెంటనే ఒక విషయాన్ని గుర్తు పట్టారు. ఇప్పుడు అదే పెద్ద ట్రెండింగ్‌గా మారిపోయింది.
టీమ్ ఇండియా జెర్సీలోని బీసీసీఐ లోగోపై మూడు స్టార్ గుర్తులు ఉంటాయి. 1983 వన్డే వరల్డ్ కప్, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లు గెలిచినందుకు గుర్తుగా ఆ మూడు స్టార్లను టీమ్ ఇండియా జెర్సీలపై ముద్రిస్తున్నారు. అయితే కొత్త జెర్సీలో నుంచి ఒక స్టార్ మిస్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వరల్డ్ కప్ జెర్సీపై ఒక వరల్డ్ కప్ స్టార్ ఎందుకు మిస్ అయ్యిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
కాగా, వన్డే వరల్డ్ కప్ కోసమే ఈ ప్రత్యేక జెర్సీని రూపొందించారు. కాబట్టి టీ20 వరల్డ్ కప్ గెలిచిన గుర్తుగా పెట్టిన స్టార్‌ను తీసేసినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కేవలం వన్డే వరల్డ్ కప్ వరకు మాత్రమే ఈ జెర్సీని ఉపయోగిస్తారని తెలుస్తున్నది. జెర్సీ కలర్, ఇతర ప్యాట్రన్‌లో ఎలాంటి మార్పులు చేయకపోయినా.. ఒక స్టార్‌ను మాత్రం తొలగించింది. ఇక వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం రూపొందించే జెర్సీపై ఒకే స్టార్ ఉంటుందని కూడా తెలుస్తున్నది. ఆయా జెర్సీలను కేవలం వరల్డ్ కప్ వరకు మాత్రమే ఉపయోగిస్తారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
కాగా, టీమ్ ఇండియా వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్ ఆడనున్నది. ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు.. ట్రోఫీ కోసం శ్రీలంకతో ఆదివారం తలపడనున్నది.