Telugu Global
Sports

నువ్వానేనా అంటున్న పాక్ , శ్రీలంక..నేడే ఆసియాకప్ టైటిల్ ఫైట్!

15వ ఆసియాకప్ టైటిల్ సమరానికి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యంది.

నువ్వానేనా అంటున్న పాక్ , శ్రీలంక..నేడే ఆసియాకప్ టైటిల్ ఫైట్!
X

15వ ఆసియాకప్ టైటిల్ సమరానికి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యంది. ఈరోజు రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో ఐదుసార్లు చాంపియన్ శ్రీలంకకు రెండుసార్లు విన్నర్ పాకిస్థాన్ సవాలు విసురుతోంది....

విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను గత రెండువారాలుగా అలరిస్తూ వచ్చిన 2022 ఆసియాకప్ టీ-20 సమరం క్లైయ్ మాక్స్ దశకు చేరింది. ఆరుదేశాల

ఈ పోరు నుంచి ఏడుసార్లు విన్నర్ భారత్...సూపర్-4 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టడంతో..రెండోర్యాంకర్ పాకిస్థాన్, 8వ ర్యాంకర్ శ్రీలంక టైటిల్ పోరులో నిలిచాయి.

మూడో టైటిల్ కు పాక్ గురి...

టీ-20 ఫార్మాట్లో రెండోర్యాంకర్ గా నిలిచిన పాక్ జట్టు గత 14 సంవత్సరాల ఆసియాకప్ చరిత్రలో ఇప్పటి వరకూ రెండుసార్లు మాత్రమే విజేతగా నిలిచింది. ప్రస్తుత టోర్నీ ద్వారా మూడోసారి టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో ఉంది.

ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరుపొందిన బాబర్ అజమ్ నాయకత్వంలోని పాక్ జట్టు ప్రస్తుత టోర్నీ లీగ్, సూపర్ -4 దశల్లో ఒక్కో ఓటమి పొందినా రెండో అత్యుత్తమ జట్టుగా ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

యువఫాస్ట్ బౌలర్లు నసీమ్ షా, హస్నెయిన్, హారిస్ ల త్రయంతో పాటు స్పిన్ జోడీ షదాబ్ ఖాన్, నవాజ్ లతో అత్యంత పటిష్టమైన బౌలింగ్ ఎటాక్ తో పాక్ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.

బ్యాటింగ్ లోనే పాక్ జట్టు నిలకడలేమితో సతమతమవుతోంది. ఓపెనర్లు బాబర్ అజమ్-మహ్మద్ రిజ్వాన్ లు ఇచ్చే ఆరంభం పైనే పాక్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. సీనియర్ బ్యాటర్ ఫకర్ జమాన్ సైతం కీలకం కానున్నాడు.

శ్రీలంక ప్రత్యర్థిగా 13 విజయాలు, 9 పరాజయాల రికార్డుతో నిలిచిన పాక్ జట్టుకు ఆసియాకప్ ఫైనల్లో 1-2 రికార్డు మాత్రమే ఉంది.

సమరోత్సాహంతో శ్రీలంక...

సూపర్ -4 రౌండ్లో మూడుకు మూడుమ్యాచ్ లు నెగ్గిన శ్రీలంకజట్టుకు ఇప్పటికే ఐదుసార్లు ఆసియాకప్ సాధించిన రికార్డు ఉంది. అంతేకాదు...పాక్ ప్రత్యర్థిగా ఆసియాకప్ ఫైనల్స్ లో తలపడిన గత మూడుసార్లలో రెండుమార్లు విజేతగా నిలిచిన ఘనత సైతం ఉంది.

ప్రస్తుత టోర్నీ లీగ్ దశలో అఫ్ఘనిస్థాన్ చేతిలో మాత్రమే పరాజయం పొందిన శ్రీలంక మిగిలిన పోటీలలో మాత్రం అజేయంగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో ప్రత్యర్థి పాక్ కంటే అత్య్తంత సమతూకంతో ఉన్న శ్రీలంక స్థాయికి తగ్గట్టుగా ఆడితే ఫైనల్లో పాక్ ను కంగుతినిపించడం ఏమంతకష్టం కాబోదు.

పాక్ ప్రత్యర్థిగా 9-13 రికార్డుతో నిలిచిన శ్రీలంక జట్టు ఆరో ఆసియాకప్ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

బ్యాటింగ్ లో దాసున్ సనక నాయకత్వంలోని లంకజట్టులో కుశల్ మెండిస్, నిస్సంక, గుణతిలక, ధనుంజయ, రాజపక్స, హసరంగలతో మేటిగా కనిపిస్తోంది. బౌలింగ్ లో స్పిన్ జోడీ వనిందు హసరంగ, తీక్షణ కీలకం కానున్నారు.

టాస్ నెగ్గితే మ్యాచ్ నెగ్గినట్లే...

దుబాయ్ వేదికగా టాస్ నెగ్గినజట్లే మ్యాచ్ నెగ్గుతూ రావడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో టాస్ నెగ్గితే సగం మ్యాచ్ నెగ్గినట్లుగానే రెండుజట్ల కెప్టెన్లు భావిస్తున్నారు.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 180కి పైగా స్కోరు సాధించినా విజయానికి గ్యారెంటీ లేదు. చేజింగ్ కు దిగే జట్టుకే దుబాయ్ పిచ్ ఎంతో అనువుగా ఉండడంతో మరోసారి టాస్ కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ టైటిల్ సమరంలో పాక్ జట్టు మూడోసారి ఆసియాకప్ విజేతగా నిలుస్తుందా? లేక శ్రీలంకజట్టు ఆరోసారి విన్నర్ గా నిలుస్తుందా?

తెలుసుకోవాలంటే కొద్ది గంటల పాటు నిరీక్షించక తప్పదు.

First Published:  11 Sept 2022 5:26 AM GMT
Next Story