ముంబైజోరు..సన్ రైజర్స్ బేజారు!
ఐపీఎల్ -16 లీగ్ లో మాజీ చాంపియన్ ముంబై వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ఐదోరౌండ్ పోరులో హైదరాబాద్ సన్ రైజర్స్ పై 14 పరుగుల విజయం తో పుంజుకొంది.
ఐపీఎల్ -16 లీగ్ లో మాజీ చాంపియన్ ముంబై వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ఐదోరౌండ్ పోరులో హైదరాబాద్ సన్ రైజర్స్ పై 14 పరుగుల విజయం తో పుంజుకొంది.
ఐపీఎల్ -2023 సీజన్ ను వరుస పరాజయాలతో మొదలు పెట్టిన మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఆ తర్వాత గేరు మార్చి వరుసగా మూడు విజయాలతో పుంజుకొంది.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఐదవ రౌండ్ పోరులో ముంబై 14 పరుగులతో సన్ రైజర్స్ ను కంగు తినిపించింది. ముంబై ఆల్ రౌండ్ షో ముందు గత రెండుమ్యాచ్ ల్లో నెగ్గిన సన్ రైజర్స్ తేలిపోయింది.
ఈ మ్యాచ్ కు రికార్డు సంఖ్యలో 38,411 మంది అభిమానులు హాజరయ్యారు. రాజీవ్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల చరిత్రలో ఇంత భారీసంఖ్యలో అభిమానులు హాజరు కావడం ఇదే మొదటిసారి.
ముంబై కుర్రాళ్ల దూకుడు...
ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన ముంబై ఇండియన్స్ ఆట అన్ని విభాగాలలోనూ చెలరేగిపోయింది. యువ ఆల్ రౌండర్ కమెరూన్ గ్రీన్, యువ బ్యాటర్ తిలక్ వర్మ, యువ మీడియం పేసర్ అర్జున్ టెండుల్కర్ అంచనాలకు మించి రాణించడంతో సన్ రైజర్స్ ను ముంబై 14 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా తన పాయింట్ల సంఖ్యను 6కు పెంచుకోగలిగింది.
10 జట్లు, 70 మ్యాచ్ ల ఈ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తొలి అంచె 5వ రౌండ్ పోరులో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.
ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(28), ఇషాన్ కిషన్(38) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. జోరుమీదున్న ముంబై కెప్టెన్ రోహిత్ ను సీమర్ నటరాజన్ పడగొట్టాడు.
ఆ తర్వాత యువజోడీ ఇషాన్ - గ్రీన్ ఆచితూచి ఆడారు. జాన్‌సెన్ ఒకే ఓవర్‌లో ఇషాన్ ( 38 ), సూర్యకుమార్ వికెట్లు నష్టపోయిన ముంబై ఎదురీత మొదలు పెట్టింది. డేంజర్ మ్యాన్ సూర్యకుమార్ కేవలం 7 పరుగులకే దొరికిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన మేడిన్ హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ(37) సిక్స్‌లతో చెలరేగాడు. నటరాజన్ బౌలింగ్‌లో గ్రీన్ హ్యాట్రిక్ ఫోర్లు బాది అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. టిమ్ డేవిడ్(16) ఆఖర్లో ధాటిగా ఆడడంతో ముంబై 192 పరుగుల మ్యాచ్ విన్నింగ్ స్కోరు సాధించగలిగింది.
హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ చెరో వికెట్ పడగొట్టారు.
బ్రూక్, రాహుల్ త్రిపాఠీ ప్లాప్....
193 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన హైదరాబాద్ ప్రారంభ ఓవర్లలోనే గత మ్యాచ్ సెంచరీ హీరో హ్యారీ బ్రూక్, సూపర్ హిట్టర్ రాహుల్ త్రిపాఠీ వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.
ఓపెనర్ హ్యారీ బ్రూక్(9), రాహుల్ త్రిపాఠి(6)ల వికెట్లను పేసర్ బెహ్రన్‌డార్ఫ్ పడగొట్టాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(48) ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది.. కెప్టెన్ మర్కరమ్ తో (22)తో కలిసి పరిస్థితి చక్కదిద్దటానికి ప్రయత్నించాడు. అయితే.. మర్కరమ్, అభిషేక్ శర్మ(1) వరుస ఓవర్లలో అవుట్ కావడంతో మ్యాచ్ ముంబై చేతిలోకి వెళ్లిపోయింది.
72 పరుగులకే నాలుగు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన సన్ రైజర్స్ కు మిడిలార్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్(36) దూకుడుగా ఆడి స్కోర్ 100 దాటడంలో తనవంతు పాత్ర పోషించాడు.ఐదో వికెట్‌కు మయాంక్‌తో కలసి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఆ తర్వాత మార్కో జాన్‌సెన్(10), వాషింగ్టన్ సుందర్ (10) సైతం వెంట వెంటనే అవుటయ్యారు.
అర్జున్ టెండుల్కర్ కు తొలివికెట్..
మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సిన సన్ రైజర్స్ ను అర్జున్ టెండుల్కర్ కట్టడి చేసి తనజట్టుకు 14 పరుగుల విజయం అందించాడు. భువనేశ్వర్ కుమార్ ను అవుట్ చేయడం ద్వారా తన ఐపీఎల్ కెరియర్ లో అర్జున్ తొలి వికెట్ సాధించగలిగాడు. చివరకు హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. 48 పరుగులతో మయాంక్ అగర్వాల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ముంబై బౌలర్లలో రిలే మెరిడిత్, జాసన్ బెహ్రన్‌డార్ఫ్, పీయూష్ చావ్లా తలో రెండు వికెట్లు , అర్జున్ టెండూల్కర్, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు.
గ్రీన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా ఈరోజు జరిగే 26వ రౌండ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.