ఘనవిజయాలు, ఘోరపరాజయాల -2022
Sports News highlights of 2022: 2022 సంవత్సరం మరికొద్దిగంటల్లో కాలగర్భంలో కలసి పోనుంది. క్రీడాపరంగా భారత్ కు మిశ్రమఫలితాలను మిగిల్చింది. అసాధారణ విజయాలు, అనూహ్య పరాజయాల సంమిళితంగా ముగిసింది.
2022 సంవత్సరం మరికొద్దిగంటల్లో కాలగర్భంలో కలసి పోనుంది. క్రీడాపరంగా భారత్ కు మిశ్రమఫలితాలను మిగిల్చింది. అసాధారణ విజయాలు, అనూహ్య పరాజయాల సంమిళితంగా ముగిసింది.....
సంవత్సరాలు వస్తూపోతూ ఉంటాయి. అయితే తీపిమాత్రల్ని, చేదుగుళికల్ని మింగించే సంవత్సరాలు అతికొద్ది మాత్రమే ఉంటాయి. కరోనా ఉపశమనంతో సాధారణ స్థితికి వచ్చిన గత ఏడాదికాలం క్రీడారంగంలో భారత్ కు మిశ్రమఫలితాలను ఇచ్చింది. కామన్వెల్త్ గమ్స్, థామస్ కప్ బ్యాడ్మింటన్, జూనియర్ ప్రపంచకప్ క్రికెట్, ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత్ అబ్బుర పరచే విజయాలను సాధించింది. దేశంలోనే అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్లో మాత్రం భారత్ కు మింగుడు పడని ఫలితాలు వచ్చాయి.
నీరజ్ చోప్రా మరో చరిత్ర...
భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. అమెరికా వేదికగా జరిగిన 2022 ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల పురుషుల జావలిన్ త్రోలో భారత్ కు రజత పతకం అందించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచాడు. 19 సంవత్సరాల విరామం తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత్ కు పతకం అందించిన మొనగాడిగా నిలిచాడు.
24 సంవత్సరాల వయసులోనే అరుదైన ఈ ఘనత సాధించాడు.
మొత్తం 11 మంది ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ల నడుమ జరిగిన పతకం పోరులో నీరజ్ తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల రికార్డుతో రజత పతకం గెలుచుకొన్నాడు.
ప్రపంచ జూనియర్ క్రికెట్ విజేత భారత్...
కరీబియన్ ద్వీపాలు వేదికగా జరిగిన 2022 జూనియర్ ( అండర్ -19 ) క్రికెట్ ప్రపంచకప్ ను భారత యువజట్టు ఐదోసారి నెగ్గి అరుదైన రికార్డు నమోదు చేసింది.
క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్, సెమీఫైనల్లో ఆస్ట్ర్రేలియా, టైటిల్ సమరంలో ఇంగ్లండ్ జట్లను చిత్తు చేయడం ద్వారా భారత్ మరోసారి ప్రపంచ టైటిల్ అందుకోగలిగింది. మరోవైపు..
కామన్వెల్త్ గేమ్స్ మహిళల క్రికెట్లో భారత్ రజత పతకం గెలుచుకోగలిగింది. పురుషుల ఐసీసీ ప్రపంచకప్, ఆసియాకప్ టీ-20 టోర్నీలలో భారత్ దారుణంగా విఫలమయ్యింది.
దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ టీ-20 టోర్నీ లో లీగ్ దశ నుంచే నిష్క్ర్రమించిన భారత్ కు ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ లో సైతం తీవ్రనిరాశే ఎదురయ్యింది. సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో ఇంగ్లండ్ చేతిలో ఘోరపరాజయంతో టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది.
ఐసీసీ టెస్టు లీగ్ లో మాత్రం బంగ్లాదేశ్ తో జరిగిన రెండుమ్యాచ్ ల సిరీస్ ను 2-0తో స్వీప్ చేయడం ద్వారా లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలువగలిగింది. ఫైనల్ ఆశల్ని సజీవంగా ఉంచుకోగలిగింది.
ఐపీఎల్ -2022 టోర్నీలో తొలిసారిగా పాల్గొన్న గుజరాత్ టైటాన్స్ ఏకంగా టైటిల్ నెగ్గి వారేవ్వా అనిపించుకొంది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ పై అలవోక విజయం సాధించింది.
మూడేళ్ల తర్వాత కొహ్లీ, పూజారా శతకాలు..
గత మూడేళ్లుగా శతకం కోసం నానాతంటాలు పడుతున్న దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ, టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పూజారాలకు గత ఏడాది ఊరట కలిగించింది. ఆసియాకప్ టీ-20లో ఆప్ఘనిస్థాన్ పైన, బంగ్లాతో వన్డే సిరీస్ ఆఖరిమ్యాచ్ లోనూ విరాట్ కొహ్లీ శతకాలు బాదటం ద్వారా తిరిగి పుంజుకోగలిగాడు. 2019లో తన చివరి అంతర్జాతీయ సెంచరీ సాధించిన విరాట్..71వ శతకం కోసం మూడేళ్లపాటు నిరీక్షించాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ తో చోటాగ్రామ్ వేదికగా జరిగిన తొలిటెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించడం ద్వారా చతేశ్వర్ పూజారా శతకాల లేమికి తెరదించాడు. మూడుసంవత్సరాల విరామం తర్వాత తన 19వ టెస్ట్ శతకం పూర్తి చేయగలిగాడు.
టీ-20లో సూర్య..ప్రతాపం...
టీ-20 ఫార్మాట్లో మిస్టర్ -360 షాట్ మేకర్ సూర్యకుమార్ యాదవ్ తన ఆటతీరుతో కొత్తపుంతలు తొక్కించాడు. రానున్నకాలం తనదేనని చెప్పకనే చెప్పాడు. శ్ర్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సంజు శాంసన్ లాంటి బ్యాటర్లు నిలకడగా రాణించినా...కెప్టెన్ రోహిత్ శర్మ, స్టాండిన్ కెప్టెన్ కెఎల్ రాహుల్ అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమయ్యారు.
మహిళా క్రికెట్లో వెటరన్ జోడీ మిథాలీ రాజ్, జులన్ గోస్వామి రిటైర్మెంట్ తో తమ సుదీర్ఘ కెరియర్ కు ముగింపు పలికారు. పురుషులతో సమానంగా మహిళలకూ మ్యాచ్ ఫీజులు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించడం 2022 సంవత్సరానికే గొప్ప విశేషంగా మిగిలిపోతుంది.
బ్యాడ్మింటన్లో అపూర్వ విజయం...
ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ విజేతలకు ఇచ్చే థామస్ కప్ గెలుచుకోవాలన్న భారత బంగారుకల ఎట్టకేలకు సాకారమయ్యింది. బ్యాంకాక్ వేదికగా ముగిసిన 2022 థామస్ కప్ టోర్నీ ఫైనల్లో 14సార్లు విన్నర్ ఇండోనీషియాను భారత్ 3-0తో చిత్తు చేయడం ద్వారా సంచలనం సృష్టించింది. థామస్ కప్ నెగ్గాలన్న 73 సంవత్సరాల కలను
భారతజట్టు సాకారం చేసుకోగలిగింది.
బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ ను యువఆటగాడు లక్ష్యసేన్, మహిళల సింగిల్స్ బంగారు పతకాన్ని పీవీ సింధు, పురుషుల డబుల్స్ టైటిల్ ను భారతజోడీ రిత్విక్ సాయిరాజ్- షెట్టి గెలుచుకోడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పారు.
కామన్వెల్త్ గేమ్స్ లో నాలుగోస్థానం....
బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ లో 215మంది సభ్యులతో 16 రకాల క్రీడాంశాలలో పోటీకి దిగిన భారత్ 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్యాలతో సహా మొత్తం 61 పతకాలు సాధించిం పతకాల పట్టిక నాలుగోస్థానంలో నిలిచింది.
ఖేలో ఇండియా పథకం ద్వారా వెలుగులోకి వచ్చిన పలువురు యువక్రీడాకారులు బంగారు పతకాలతో దేశానికే గర్వకారణంగా నిలిచారు. కేవలం రెండుపదుల వయసులోనే పతకవిజేతలుగా నిలిచారు.
వెయిట్ లిఫ్టర్లు జెర్మీ లాల్ రినుంగా, అచింత షియోలీ, సంకేత్ సర్గార్, బాక్సింగ్ లో నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్, టేబుల్ టెన్నిస్ లో ఆకుల శ్రీజ, అథ్లెటిక్స్ లో తేజస్వినీ శ్రీశంకర్ ( పురుషుల హైజంప్ ), మురళీ శ్రీశంకర్ ( లాంగ్ జంప్ ) లో, ఎల్దోసీ పాల్, అబ్దుల్ అబుబాకర్ ( ట్రిపుల్ జంప్ ) పతకాలు నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించారు.
లాన్ బౌల్స్ క్రీడ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ అనూహ్యంగా రజత, స్వర్ణ పతకాలు సాధించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
హాకీలో రజత, కాంస్యాలతో సరి...
కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా జరిగిన పురుషుల హాకీలో రజత పతకం సాధించిన భారత్..మహిళల విభాగంలో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పురుషుల ట్రిపుల్ జంప్ స్వర్ణ, రజత పతకాలను భారత అథ్లెట్లే సొంతం చేసుకోడం, బ్యాడ్మింటన్ మహిళల, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్ లో బంగారు పతకాలు సాధించడం, టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్, టీమ్ విభాగాలతో పాటు మిక్సిడ్ డబుల్స్ లో స్వర్ణపతకాలు, స్క్వాష్ పురుషుల సింగిల్స్ లో సౌరవ్ గోశాల్ కాంస్య పతకాలు సాధించడం అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.
తెలుగుతేజం శరత్ కమాల్ 40వ పడిలో స్వర్ణపతకం సాధించడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పాడు.
గత రెండు దశాబ్దాలుగా జరిగిన ఐదు ( 2006, 2010, 2014, 2018, 2022 ) కామన్వెల్త్ గేమ్స్ లో ఏదో ఒక పతకం సాధిస్తూ తనకుతానే సాటిగా నిలిచాడు.
గత 20 సంవత్సరాలలో శరత్ ఒక్కడే 13 కామన్వెల్త్ గేమ్స్ పతకాలు సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా నిలిచాడు.
మొత్తం మీద...అరుదైన, అసాధారణ విజయాలు, ఐసీసీ ప్రపంచ క్రికెట్, ఆసియాకప్ టోర్నీలలో ఘోరపరాజయాలతో గత ఏడాది కాలం ముగిసింది.