Telugu Global
Sports

స్పిన్ జాదూ అశ్విన్ మరో అరుదైన రికార్డు!

భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు.

స్పిన్ జాదూ అశ్విన్ మరో అరుదైన రికార్డు!
X

భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు...

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో టాప్ ర్యాంకర్, భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ తన రికార్డుల ఖాతాలో మరో అరుదైన రికార్డును జమ చేసుకొన్నాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న నాలుగోటెస్టు రెండోరోజు ఆటలో 6 వికెట్లు పడగొట్టడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచాడు.

కుంబ్లేను అధిగమించిన అశ్విన్....

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్ర్రేలియా, భారతజట్ల మధ్య జరుగుతున్న దైపాక్షిక సిరీస్ ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రవిచంద్రన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరుతో ఉన్న 111 వికెట్ల రికార్డును అశ్విన్ తెరమరుగు చేశాడు.

ప్రస్తుత సిరీస్ లోని అహ్మదాబాద్ టెస్టు వరకూ 22 మ్యాచ్ లు ఆడిన 36 సంవత్సరాల అశ్విన్ 113 వికెట్లు సాధించాడు. బౌలర్లకు ఏమాత్రం అనువుగాలేని అహ్మదాబాద్ పిచ్ పైన అశ్విన్ తన జిత్తులన్నీ ప్రదర్శించి ఏకంగా 6 వికెట్లు పడగొట్టడం ద్వారా ఆస్ట్ర్రేలియాను ఆలౌట్ చేయడంలో ప్రధానపాత్ర వహించాడు.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా తన కెరియర్ లో 20 టెస్టుల్లో కుంబ్లే 30.32 స్ట్ర్టయిక్ రేటుతో 111 వికెట్లు పడగొడితే...అశ్విన్ 28.10 స్ట్రయిక్ రేటుతోనే 113 వికెట్లతో కుంబ్లేను అధిగమించగలిగాడు.

బోర్డ‌ర్ – గ‌వాస్కర్ ట్రోఫీలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా అశ్విన్ గుర్తింపు సాధించాడు. కంగారూ స్టార్ స్పిన్న‌ర్ నాథ‌న్ లయన్ తో క‌లిసి అశ్విన్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. ప్ర‌స్తుతం అశ్విన్, లియాన్ ఖాతాలో 113 వికెట్లు ఉన్నాయి. భారత్ ప్రత్యర్థిగా 26 టెస్టులు ఆడిన లయన్ 113 వికెట్లు సాధిస్తే..అశ్విన్ 22 టెస్టుల్లోనే 113 వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడు టెస్టుల్లో చెల‌రేగిన అశ్విన్ నాలుగో టెస్టులోనూ స‌త్తా చాటాడు. కీల‌క స‌మ‌యంలో వికెట్లు తీసి భార‌త్‌ను పోటీలోకి తెచ్చాడు. ఐదో వికెట్‌కు 208 ర‌న్స్ చేసిన ఉస్మాన్ ఖ‌వాజా, కామెరూన్ గ్రీన్ జోడిని అత‌ను విడ‌దీశాడు. ఒకే ఓవ‌ర్‌లో గ్రీన్, అలెక్స్ క్యారీల‌ను ఔట్ చేశాడు. మ‌ర్ఫీని ఔట్ చేసి ఐదు వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్‌కు ఆరు వికెట్లు కూల్చ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

32సార్లు 5 వికెట్ల రికార్డు...

అంతేకాదు..టెస్టు క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం అశ్విన్ కు ఇది 32వసారి. టెస్టు మ్యాచ్ ల్లో అత్యధికసార్లు 5 వికెట్లు సాధించిన భారత తొలిబౌలర్ ఘనతను అశ్విన్ దక్కించుకొన్నాడు.

స్వదేశీ సిరీస్ ల్లో అత్యధికంగా 26సార్లు 5 వికెట్ల రికార్డు సాధించడం ద్వారా కుంబ్లే రికార్డును సైతం అశ్విన్ అదిగమించగలిగాడు.అనిల్ కుంబ్లే 122 టెస్టుల్లో 25 సార్లు 5 వికెట్ల రికార్డు నమోదు చేస్తే...అశ్విన్ మాత్రం 92 టెస్టుల్లోనే ఈ రికార్డును అందుకోడం విశేషం.

సొంతగడ్డపై కుంబ్లే 63 టెస్టులు ఆడి 25సార్లు 5 వికెట్ల రికార్డు నమోదు చేస్తే...అశ్విన్ 55 టెస్టుల్లోనే 26వసారి 5 వికెట్ల రికార్డు నెలకొల్పాడు.

టెస్టు చరిత్రలో అత్యధికంగా ముత్తయ్య మురళీధరన్ 45సార్లు సొంతగడ్డపై 5 వికెట్ల రికార్డుతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకకే చెందిన లెఫ్టామ్ స్పిన్నర్ రంగన్ హెరాత్ రెండోస్థానంలో ఉన్నాడు.

ఇప్పటికే 32వసారి 5 వికెట్ల మైలురాయిని చేరడం ద్వారా అశ్విన్ ఆరవ అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. ప్రస్తుత 2023 సిరీస్ లోని నాలుగోటెస్ట్ తొలి ఇన్నింగ్స్ వరకూ అశ్విన్ పడగొట్టిన మొత్తం 23 వికెట్లలో మూడుసార్లు 5 వికెట్ల రికార్డులు ఉన్నాయి.

300 క్యాచ్ ల క్లబ్ లో విరాట్...

ఆస్ట్ర్రేలియా తొలిఇన్నింగ్స్ లో నేథన్ లయన్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోడం ద్వారా విరాట్ కొహ్లీ 300 అంతర్జాతీయ క్యాచ్ లు పట్టిన భారత రెండో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

రాహుల్ ద్రావిడ్ 334 క్యాచ్ లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే..300 క్యాచ్ లతో విరాట్ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 16 సంవత్సరాల తన అంతర్జాతీయ కెరియర్ లో 261 క్యాచ్ లు, మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ కు 108 క్యాచ్ ల రికార్డు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో రాహుల్ ద్రావిడ్ 210 క్యాచ్ లతో టాపర్ గా ఉన్నాడు.

First Published:  11 March 2023 2:17 PM IST
Next Story