Telugu Global
Sports

యూఎస్ ఫైనల్లో టీనేజ్ సంచలనం

స్పానిష్ యువ సంచలనం, 19 ఏళ్ల కార్లోస్ అల్ కరాజ్ అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ చేరి చరిత్ర సృష్టించాడు. టైటిల్ సమరంలో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌ను ఢీకోనున్నాడు.

యూఎస్ ఫైనల్లో టీనేజ్ సంచలనం
X

2022 గ్రాండ్ స్లామ్ ఆఖరి టోర్నీ అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం ముగిసిన రెండో సెమీఫైనల్లో స్పెయిన్ యువ ఆటగాడు, 19 సంవత్సరాల కార్లోస్ అల్ కరాజ్ విజేతగా నిలవడం ద్వారా అమెరికన్ ఓపెన్ ఫైనల్స్ చేరిన అత్యంత పిన్నవయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.

రెండు రోజుల్లో 14 గంటల పోరు...

141 సంవత్సరాల అమెరికన్ ఓపెన్ చరిత్రలో నాలుగో రౌండ్, క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ రౌండ్లో విజయాల కోసం మూడు రోజుల్లో 14 గంటల పాటు కోర్టులో నిలిచిన మొనగాడిగా స్పానిష్ టీనేజర్ అల్ కరాజ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. శుక్రవారం తెల్లవారుజామున ముగిసిన ఆఖరి క్వార్టర్ ఫైనల్లో 5 గంటల 15 నిముషాల పాటు పోరాడి ఆడి యానిక్ సిన్నర్ పై విజేతగా నిలిచిన కార్లోస్ తన కెరియర్‌లో తొలిసారిగా యూఎస్ ఓపెన్ సెమీస్‌కు అర్హత సాధించాడు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన మారథాన్ పోరులో కార్లోస్ 6-3, 6-7, 6-7, 7-5, 6-3తో 21వ సంవత్సరాల ఇటాలియన్ ఆటగాడు సిన్నర్‌ను అధిగమించాడు. అంతకుముందు జరిగిన నాలుగో రౌండ్ పోరులో సైతం క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిచ్‌ను ఓడించడానికి కార్లోస్ ఐదు సెట్ల పాటు పోరాడాల్సి వచ్చింది.

సెమీస్‌లోనూ అదే పోరాటం...

ఫైనల్లో చోటు కోసం జరిగిన రెండో సెమీ ఫైనల్లో సైతం 3వ సీడ్ కార్లోస్ అమెరికా ఆటగాడు ఫ్రాన్సిస్ టైఫోయ్‌తో ఐదు సెట్ల పాటు పోరాడాల్సి వచ్చింది. నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగిన ఈ సమఉజ్జీల సమరంలో 7-6తో ఫ్రాన్సిస్కో తొలిసెట్‌ను నెగ్గితే...కార్లోస్ 6-1, 6-3తో ఆ తర్వాతి రెండు సెట్లు నెగ్గి 2-1తో పైచేయి సాధించాడు. కీలక నాలుగో సెట్‌ను 7-6తో ఫ్రాన్సిస్కో నెగ్గడం ద్వారా స్కోరును 2-2తో సమం చేశాడు. విజేతను నిర్ణయించే ఆఖరి సెట్ ను 6-3తో నెగ్గడం ద్వారా కార్లోస్ ఫైనల్లో చోటు ఖాయం చేసుకొన్నాడు.

19 సంవత్సరాల చిరుప్రాయంలోనే తొలిసారిగా యూఎస్ ఓపెన్ ఫైనల్స్ చేరడం ద్వారా కార్లోస్ అల్ కరాజ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టైటిల్ పోరులో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌తో కార్లోస్ అల్ కరాజ్ పోటీపడనున్నాడు. మాజీ చాంపియన్ నడాల్, డిఫెండింగ్ చాంపియన్ మెద్వదేవ్ లాంటి మేటి ఆటగాళ్ళంతా నాలుగో రౌండ్‌కు ముందే ఇంటిదారి పట్టడంతో..ప్రస్తుత యూఎస్ ఓపెన్ ద్వారా సరికొత్త చాంపియన్ తెరమీదకు రానున్నాడు.

First Published:  10 Sept 2022 3:30 AM GMT
Next Story