Telugu Global
Sports

ప్రపంచకప్ నుంచి దక్షిణాఫ్రికా అవుట్-చిగురించిన పాక్, బంగ్లా ఆశలు!

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ ఆఖరిరోజునా సంచలనాల పరంపర కొనసాగుతోంది. పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాను పసికూన నెదర్లాండ్స్ 13 పరుగులతో కంగుతినిపించడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు చిగురించాయి.

ప్రపంచకప్ నుంచి దక్షిణాఫ్రికా అవుట్-చిగురించిన పాక్, బంగ్లా ఆశలు!
X

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ ఆఖరిరోజునా సంచలనాల పరంపర కొనసాగుతోంది. పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాను పసికూన నెదర్లాండ్స్ 13 పరుగులతో కంగుతినిపించడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు చిగురించాయి...

2022 టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 పోరు అంచనాలకు అందని రీతిలో సాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ రేస్ నుంచి ఇప్పటికే నిష్క్ర్రమించిన నేపథ్యంలో...దక్షిణాఫ్రికాకు సైతం అదే పరిస్థితి ఎదురయ్యింది. సెమీస్ చేరాలంటే తన ఆఖరి రౌండ్ పోరులో పసికూన నెదర్లాండ్స్ ను ఓడించితీరాల్సిన సఫారీటీమ్ 13 పరుగుల ఘోరపరాజయంతో టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది.

నెదర్లాండ్స్ తన ఎదుట ఉంచిన 159 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో దక్షిణాఫ్రికా విఫలమయ్యింది. అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన ఈ కీలక పోరులో ముందుగా టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోడంతో..నెదర్లాండ్స్ బ్యాటింగ్ కు దిగి..20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగుల స్కోరు సాధించింది. ఓపెనర్లు మైబర్గ్ 37, మాక్స్ ఓ దవుడ్ 29, వన్ డౌన్ టామ్ కూపర్ 35, రెండో డౌన్ అకెర్ మాన్ 41 పరుగులు సాధించడంతో నెదర్లాండ్స్ అనూహ్యంగా మంచిస్కోరే సాధించగలిగింది.

సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, మర్కరమ్,నోర్జే చెరో వికెట్ పడగొట్టారు. ఫాస్ట్ బౌలర్లు రబడ, ఎంగిడీల బౌలింగ్ లో డచ్ బ్యాటర్లు 72 పరుగులు దండుకోడం విశేషం.

సఫారీలకు డచ్ పగ్గాలు...

159 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ బౌలర్లు పగ్గాలు వేశారు. ఓపెనర్లు డి కాక్ 13, బవుమా 20, రూసో 25, మర్కరమ్ 17, మిల్లర్ 17, క్లాసెన్ 21, కేశవ్ మహరాజ్ 13 పరుగులు మాత్రమే చేయగలిగారు.

డచ్ బౌలర్లలో గ్లోవర్ 3 ఓవర్లలో 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. క్లాసెన్, డీ లీడీ చెరో 2 వికెట్లు, అకెర్ మాన్ 1 వికెట్ సాధించారు. చివరకు జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే సాధించి 13 పరుగుల తేడాతో అనుకోని ఓటమితో ఇంటిదారి పట్టింది.

ప్రస్తుత ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ సాధించిన ఈ విజయమే అతిపెద్ద సంచలనంగా నిలిచిపోతుంది. ఆల్ రౌండర్ కోలిన్ అకెర్ మాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

పాక్, బంగ్లాలకు భలే చాన్స్!

గ్రూప్ -2 సూపర్ -12 రౌండ్లో రెండు పరాజయాలు పొందిన దక్షిణాఫ్రికా సెమీస్ రేస్ నుంచి వైదొలగడం..పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లకు అయాచిత వరంగా మారింది.

బంగ్లా-పాక్ జట్ల ఆఖరిరౌండ్ మ్యాచ్ లో నెగ్గినజట్టే సెమీఫైనల్స్ చేరుకోగలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే..పాకిస్థాన్- బంగ్లాదేశ్ జట్ల ఈ పోరు నాకౌట్ మ్యాచ్ లాంటిదే.నెగ్గిన జట్టు సెమీస్ కు, ఓడిన జట్టు ఇంటికి చేరుకోవాల్సి ఉంటుంది.

First Published:  6 Nov 2022 10:05 AM IST
Next Story