బీసీసీఐ నుంచి ఉద్వాసనపై క్లారిటీ ఇచ్చిన గంగూలీ
గంగూలీ మాటలతో ఆయన బీసీసీఐ నుంచి బయటకు వెళ్లిపోయనట్లే అని కన్ఫార్మ్ అయ్యింది. రోజర్ బిన్నీ బోర్డు ప్రెసిడెంట్ అవడం గ్యారెంటీగానే కనిపిస్తున్నది.
బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీకి రెండో టర్మ్ కొనసాగించడం లేదని, ఆయన స్థానంలో రోజర్ బిన్ని బాధ్యతలు చేపడుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. గంగూలీకి కనీసం ఐసీసీలో కూడా బీసీసీఐ మద్దతు దొరకదని తెలుస్తున్నది. ఈ క్రమంలో తొలి సారి గంగూలీ స్పందించారు. అధ్యక్ష రేసులో ఉండకపోవడంపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
'ఒక అడ్మినిస్ట్రేటర్‌గా చాలా కాలం నుంచి పని చేస్తున్నాను. ఇకపై మరో బాధ్యతలోకి వెళ్లబోతున్నాను. నా జీవితంలో ఏం సాధించాననే దానిపై నేను ఏనాడూ ఆలోచించలేదు. కానీ, ఇండియా తరపున ఆడిన రోజులు మాత్రం అత్యుత్తమమైనవిగా పరిగణిస్తాను. నేను బీసీసీఐకి చీఫ్‌గా ఉన్నాను. ఇకపై మరింత పెద్ద బాధ్యతలు చేపడతాను. ఇప్పటి వరకైతే నా ప్రణాళిక ఇదే. గతంలో ఏం చేశాను అనే దాన్ని నేను పెద్దగా పట్టించుకోను. కాకపోతే, ఇండియా తూర్పు ప్రాంతం నుంచి టీమ్ ఇండియాకు ఆడే ఆటగాళ్ల శాతం తగ్గిపోతోంది. కానీ భవిష్యత్‌లో ఇది మారుతుందని భావిస్తున్నాను. ఒక్క రోజులో ఎవరూ అంబానీ లేదా నరేంద్ర మోడీ కాలేరు. కొన్ని ఏళ్ల కష్టం, తపన కారణంగానే ఉన్నత శిఖరాలకు చేరుకోగలం' అని గంగూలీ వ్యాఖ్యానించారు.
గంగూలీ మాటలతో ఆయన బీసీసీఐ నుంచి బయటకు వెళ్లిపోయనట్లే అని కన్ఫార్మ్ అయ్యింది. రోజర్ బిన్నీ బోర్డు ప్రెసిడెంట్ అవడం గ్యారెంటీగానే కనిపిస్తున్నది. ఇక గంగూలీ క్రికెట్ అకాడమీ నెలకొల్పుతారా లేదంటే కామెంటేటర్‌గా మారతారా అనేది తెలియాల్సి ఉన్నది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యకర్గంలో చేరడానికి గంగూలీకి అవకాశం ఉంది. కానీ ఆయన అటువైపు వెళ్లరని సన్నిహితులు అంటున్నారు.