Telugu Global
Sports

దేశవాళీ టీ-20 క్రికెట్లో పంజాబ్ సరికొత్త రికార్డు

భారత దేశవాళీ టీ-20 క్రికెట్ 2023 సీజన్లో రికార్డుల మోత మోగుతోంది. రాంచీ వేదికగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో ముంబై రికార్డును పంజాబ్ అధిగమించింది.

దేశవాళీ టీ-20 క్రికెట్లో పంజాబ్ సరికొత్త రికార్డు
X

భారత దేశవాళీ టీ-20 క్రికెట్ 2023 సీజన్లో రికార్డుల మోత మోగుతోంది. రాంచీ వేదికగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో ముంబై రికార్డును పంజాబ్ అధిగమించింది.

దేశవాళీ టీ-20 క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023 టోర్నీలో వరుసగా రెండో సరికొత్త రికార్డు నమోదయ్యింది. రైల్వేస్ ఆటగాడు అశుతోష్ శర్మ 11 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ తో సరికొత్త రికార్డు నెలకొల్పిన కొద్దిగంటల్లోనే అత్యధిక టీమ్ స్కోరు సాధించినజట్టు గా పంజాబ్ మరో రికార్డు నెలకొల్పింది.

ఆంధ్రపై పంజాబ్ రికార్డ్ స్కోరు...

రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న గ్రూప్ లీగ్ పోటీలలో భాగంగా ఆంధ్రతో జరిగిన పోరులో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 275 పరుగుల స్కోరుతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.

2019 టోర్నీలో సిక్కింపై ముంబై సాధించిన 4 వికెట్లకు 258 పరుగుల రికార్డును పంజాబ్ అధిగమించింది. కెఎస్ భరత్ నాయకత్వంలోని ఆంధ్రాజట్టు పంజాబ్ బ్యాటర్లకు భారీగా పరుగులు సమర్పించుకొంది.

అభిషేక్ శర్మ 51 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 112 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అన్ మోల్ ప్రీత్ సింగ్ కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 87 పరుగులు సాధించడంతో పంజాబ్ 275 పరుగుల స్కోరు నమోదు చేయగలిగింది. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్ 4 ఓవర్లలో 63 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

సమాధానంగా ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది.

ఆంధ్ర బ్యాటర్ రికీ బుయ్ 52 బంతుల్లో 104 పరుగులతో ఫైటింగ్ సెంచరీ సాధించిన ప్రయోజనం లేకపోయింది.

2017లో ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్ లో భారతజట్టు 5 వికెట్లకు 260 పరుగుల స్కోరు సాధించింది. ఆ స్కోరును సైతం పంజాబ్ జట్టు అధిగమించగలిగింది.

నేపాల్ పేరుతో ప్రపంచ రికార్డు...

టీ-20 క్రికెట్ చరత్రలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా నేపాల్ పేరుతో ప్రపంచ రికార్డు నమోదై ఉంది. హాంగ్జు వేదికగా ఇటీవలే ముగిసిన 19వ ఆసియాక్రీడల క్రికెట్ పోటీలలో భాగంగా మంగోలియాతో జరిగిన పోరులో నేపాల్ 3 వికెట్లకు 314 పరుగుల సాధించింది.

గతంలో ఐర్లాండ్ పై 2019లో అఫ్ఘనిస్థాన్ సాధించిన 3 వికెట్లకు 278 పరుగులు, టర్కీపై చెక్ రిపబ్లిక్ సాధించిన 4 వికెట్లకు 278 పరుగులు, 2022లో హాబార్ట్ హరికేన్స్ పై మెల్బోర్న్ స్టార్స్ సాధించిన 2 వికెట్లకు 273 పరుగుల స్కోర్లే ఇప్పటి వరకూ అత్యధిక టీ-20 టీమ్ స్కోర్లుగా ఉంటూ వచ్చాయి.

First Published:  19 Oct 2023 11:06 AM IST
Next Story