Telugu Global
Sports

మహిళా క్రికెట్లో భారత్ కు రజతం.. ఫైనల్లో పోరాడి ఓడిన భారత్

మొత్తం ఎనిమిది జట్లతో రెండు గ్రూపులుగా నిర్వహించిన గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ పోరులో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు అంచనాలకు మించి రాణించడం ద్వారా మొదటి రెండు అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలువగలిగింది.

మహిళా క్రికెట్లో భారత్ కు రజతం.. ఫైనల్లో పోరాడి ఓడిన భారత్
X

బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా టీ-20 క్రికెట్లో భారత్ రజత పతకం గెలుచుకుంది. బర్మింగ్ హామ్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన బంగారు పతకం పోరులో ప్రపంచ టాప్ ర్యాంక్ జట్టు ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో భారత్ ను అధిగమించి విజేతగా నిలిచింది. మొత్తం ఎనిమిది జట్లతో రెండు గ్రూపులుగా నిర్వహించిన గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ పోరులో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు అంచనాలకు మించి రాణించడం ద్వారా మొదటి రెండు అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలువగలిగింది.

కంగారూల జోరు..

గ్రూప్ లీగ్ ప్రారంభ మ్యాచ్ లో భారత్‌తో తుదివరకూ పోరాడి నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు...చివరకు టైటిల్ సమరంలో సైతం తన ఆధిపత్యం చాటుకొంది. ఫైనల్లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ 61,కెప్టెన్ లానింగ్ 31, గార్డ్నర్ 25, హెయిన్స్ 18 పరుగులు సాధించడంతో కంగారూ జట్టు ..మ్యాచ్ విన్నింగ్ స్కోరు నమోదు చేయగలిగింది. భారత బౌలర్లలో రేణుకాసింగ్, స్నేహ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

హర్మన్ ప్రీత్ ఒంటరి పోరాటం..

ఆస్ట్రేలియాను 161 పరుగుల స్కోరుకే కట్టడి చేసిన భారత జట్టు..162 పరుగుల విజయ లక్ష్యంతో చేజింగ్ కు దిగింది. అయితే స్టార్ ఓపెనర్ స్మృతి మంథానా 6, మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 11 పరుగులకే అవుట్ కావడంతో భారత్ ఎదురీత మొదలుపెట్టింది. వన్ డౌన్ జెమీమా రోడ్రిగేస్ 33 బంతుల్లో 3 బౌండ్రీలతో 33 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 43 బాల్స్ లో 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 65 పరుగుల స్కోర్లతో పోరాడినా..లోయర్ ఆర్డర్ల వైఫల్యంతో భారత్ 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటయ్యింది. ఆసీస్‌ బౌలర్లలో గార్డ్నర్ 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ ను కంగు తినిపించిన ఆస్ట్రేలియా స్వర్ణ, మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధించిన భారత్ రజత పతకాలు సొంతం చేసుకొన్నాయి.

1998 కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల 50 ఓవర్ల క్రికెట్ ను నిర్వహించిన 24 సంవత్సరాల విరామం తర్వాత...బర్మింగ్ హామ్ గేమ్స్ లో మహిళా టీ-20 క్రికెట్ ను మెడల్ అంశంగా ప్రవేశపెట్టారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బార్బడోస్, ఆస్ట్రేలియా జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ప్రపంచ మహిళా క్రికెట్ అగ్రశ్రేణి జట్ల హవానే కామన్వెల్త్ గేమ్స్ లో సైతం కొనసాగింది. బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ మహిళా క్రికెట్ పోటీలకు భారీసంఖ్యలో అభిమానులు హాజరు కావడం విశేషం.

First Published:  8 Aug 2022 9:00 AM IST
Next Story