Telugu Global
Sports

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన భారత క్రికెటర్లు!

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లీగ్ లో ఓవైపు భారతజట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంటే..ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో భారత స్టార్ క్రికెటర్లు టాప్ లేపారు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన భారత క్రికెటర్లు!
X

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లీగ్ లో ఓవైపు భారతజట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంటే..ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో భారత స్టార్ క్రికెటర్లు టాప్ లేపారు...

అంతర్జాతీయ క్రికెట్లో ర్యాంకింగ్స్ విధానం ప్రవేశపెట్టిన తరువాత 50 ఓవర్ల ఫార్మాట్లో భారత క్రికెటర్లు తొలిసారిగా రికార్డుల మోత మోగించారు. భారత్ వేదికగా నాలుగోసారి

జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 8 రౌండ్లలో భారత్ ఎనిమిదికి ఎనిమిది విజయాలు సాధించడం ద్వారా సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.

ఇదే సమయంలో ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ టీమ్, వ్యక్తిగత విభాగాలలో సైతం భారత్ ఆధిపత్యమే కొనసాగుతోంది.

బ్యాటింగ్ లో గిల్, బౌలింగ్ లో సిరాజ్!

ఐసీసీ వన్డే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో తొలిసారిగా భారత క్రికెటర్లు టాప్ ర్యాంక్ ల్లో నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ తొలిసారిగా టాప్ ర్యాంక్ కు చేరాడు. ఇప్పటి వరకూ టాప్ ర్యాంక్ లో ఉంటూ వచ్చిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ను శుభమన్ గిల్ అధిగమించాడు.

శుభమన్ గిల్ ప్రస్తుత 2023 సీజన్లో ఇప్పటికే 1400 కు పైగా పరుగులు సాధించడం ద్వారా 830 ర్యాంకింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 824 పాయింట్లతో బాబర్ అజమ్ రెండోర్యాంక్ కు పడిపోయాడు.

సచిన్ ను మించిన శుభ్ మన్ గిల్...

ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని మాస్టర్ సచిన్ టెండుల్కర్ 25 సంవత్సరాల వయసులో సాధిస్తే...శుభ్ మన్ గిల్ కేవలం 23 సంవత్సరాల వయసులోనే సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

గతంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన భారత బ్యాటర్ల లో సచిన్, ధోనీ, విరాట్ కొహ్లీ ఉన్నారు.

ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ 7వ రౌండ్ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ 92 పరుగులు సాధించడం ద్వారా టాప్ ర్యాంక్ కు చేరుకోగలిగాడు. ప్రపంచ టాప్ ర్యాంక్ చేరిన భారత నాలుగో క్రికెటర్ ఘనతను శుభ్ మన్ గిల్ సొంతం చేసుకొన్నాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదిన దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ 3వ ర్యాంక్ లో నిలిచాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ 4వ ర్యాంక్ సాధించాడు.

శ్రీలంకతో జరిగిన 7వ రౌండ్ మ్యాచ్ లో 88 పరుగులు, దక్షిణాఫ్రికాతో జరిగిన 8వ రౌండ్ మ్యాచ్ లో 101 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా 770 పాయింట్లు సంపాదించాడు.

కొహ్లీ మొత్తం 8 ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు, రెండు 80కి పైగా స్కోర్లతో మొత్తం 543 పరుగులు సాధించడం ద్వారా అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.

6వ ర్యాంకులో రోహిత్ శర్మ...

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ 8 రౌండ్ల మ్యాచ్ ల్లో 442 పరుగులు సాధించడం ద్వారా 6వ ర్యాంక్ కు చేరుకోగలిగాడు. పవర్ ప్లే ( మొదటి 10 ) ఓవర్లలో అత్యధికంగా 265 పరుగులు సాధించిన ఓపెనర్ గా రోహిత్ నిలిచాడు. రోహిత్ 739 పాయింట్లతో ఉన్నాడు.

ఆస్ట్ర్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 5వ ర్యాంకులో నిలిచాడు. ప్రపంచకప్ లీగ్ దశలో డేవిడ్ వార్నర్ ఇప్పటికే రెండు భారీశతకాలు బాదాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్ లో సిరాజ్ అగ్రస్థానం...

బౌలర్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో సైతం భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. గత వారం వరకూ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బౌలర్ గా ఉన్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీని రెండోస్థానానికి నెట్టడం ద్వారా సిరాజ్ టాప్ ర్యాంక్ కు చేరుకోగలిగాడు. సిరాజ్ మొత్తం 709 పాయింట్లు సాధిస్తే..అఫ్రిదీ 694 పాయింట్లతో వెనుకబడిపోయాడు.

దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 2, ఆడం జంపా 3, కుల్దీప్ యాదవ్ 4, జస్ ప్రీత్ బుమ్రా 8, మహ్మద్ షమీ 10 ర్యాంకుల్లో ఉన్నారు.

బౌలర్ల టాప్ -10 ర్యాంకుల్లో నలుగురు భారత బౌలర్లు తొలిసారిగా నిలవడం విశేషం.

టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ నంబర్ వన్ ఆధిపత్యం కొనసాగుతోంది.

First Published:  9 Nov 2023 7:32 AM IST
Next Story