Telugu Global
Sports

త్రీ-ఇన్-వన్ సెంచరీల హీరో శుభ్ మన్ గిల్!

భారత క్రికెట్ రేపటితరం సూపర్ స్టార్ అవతరించాడు. యువఓపెనర్ శుభ్ మన్ గిల్ రూపంలో తెరమీదకు వచ్చాడు. 2023 సీజన్ ప్రారంభంలోనే రికార్డుల మోతతో విశ్వరూపం ప్రదర్శించాడు.

త్రీ-ఇన్-వన్ సెంచరీల హీరో శుభ్ మన్ గిల్!
X

భారత క్రికెట్ రేపటితరం సూపర్ స్టార్ అవతరించాడు. యువఓపెనర్ శుభ్ మన్ గిల్ రూపంలో తెరమీదకు వచ్చాడు. 2023 సీజన్ ప్రారంభంలోనే రికార్డుల మోతతో విశ్వరూపం ప్రదర్శించాడు...

భారత క్రికెట్లో ఎందరో సూపర్ స్టార్లు. సునీల్ గవాస్కర్ నుంచి విరాట్ కొహ్లీ వరకూ తరానికి ఓ సూపర్ స్టార్ ప్లేయర్ వెలుగులోకి వచ్చారు. భారత క్రికెట్ కు అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చారు. అయితే..ఆకోవకే చెందిన రేపటితరం సూపర్ స్టార్, యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 2023 సీజన్ ప్రారంభ సిరీస్ ల్లోనే చెలరేగిపోయాడు.

న్యూజిలాండ్ తో ముగిసిన తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ ల్లో ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్ వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ, అహ్మదాబాద్ టీ-20 మ్యాచ్ లో సెంచరీతో రికార్డుల జల్లు కురిపించాడు.

శుభమన్ గిల్..రికార్డులు ఫుల్..

క్రికెట్ మూడు ( వన్డే, టీ-20, టెస్టు ) ఫార్మాట్లలోనూ రాణించగల సత్తా ఉన్న ఆటగాళ్లు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. మూడుఫార్మాట్లలోనూ తమదైన శైలిలో రాణిస్తూ

తమకు తామేసాటిగా నిలిచే ప్రతిభ కొందరికి మాత్రమే సొంతం.

కేవలం 23 సంవత్సరాల చిరుప్రాయానికే క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ భారత ఓపెనర్ గా సెంచరీలు బాదిన అరుదైన ఘనత సాధించాడు. అండర్ -19 ప్రపంచకప్ ద్వారా

భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన శుభ్ మన్ తన కెరియర్ లో ముందుగా సాంప్రదాయ టెస్టు క్రికెట్లో తొలి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన 2023 వన్డే సిరీస్ లో తొలి ద్విశతకం, తీన్మార్ టీ-20 సిరీస్ ఆఖరిమ్యాచ్ లో తొలిశతకం సాధించడం ద్వారా...క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన భారత ఐదో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

గతంలో క్రికెట్ మూడుఫార్మాట్లలో సెంచరీలు బాదిన మొనగాళ్లలో రోహిత్ శర్మ, సురేశ్ రైనా, కెఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ ఉన్నారు. ఇప్పుడు శుభ్ మన్ గిల్ వచ్చి ఆ నలుగురు దిగ్గజాల సరసన నిలిచాడు.

సిక్సర్ల హ్యాట్రిక్ తో వన్డే డబుల్..

హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన ప్రస్తుత సిరీస్ తొలివన్డేలో శుభ్ మన్ గిల్ శివమెత్తిపోయాడు. వరుసగా మూడు సిక్సర్లతో ద్విశతకం బాదాడు.

కేవలం 145 బంతుల్లోనే 8 సిక్సర్లు, 19 బౌండ్రీలతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన భారత ఐదవ క్రికెటర్ గా, అత్యంత పిన్నవయస్కుడైన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు.

వన్డేల్లో ద్విశతకాలు సాధించిన భారత స్టార్ ఆటగాళ్లలో మాస్టర్ సచిన్, బ్లాస్టర్ వీరేంద్ర సెహ్వాగ్, హిట్ మాన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఉన్నారు.

వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరిన తొలి బ్యాటర్ గా మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ శిఖర్ ధావన్ పేరుతో ఉన్న రికార్డును గిల్ తెరమరుగు చేశాడు.

టీ-20ల్లో అత్యధిక స్కోరు రికార్డు...

ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండు టీ-20ల్లో స్థాయికి తగ్గట్టుగా ఆడటంలో విఫలమైన శుభ్ మన్..అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లను చెండాటం ద్వారా పరుగుల వెల్లువెత్తించాడు.

12 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 126 పరుగుల నాటౌట్ స్కోరు నమోదు చేశాడు. టీ-20 క్రికెట్లో ఓ భారత బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావటం విశేషం.

శుభ్ మన్ మెరుపు సెంచరీ కారణంగానే భారత్ 20 ఓవర్లలో 234 పరుగులు భారీస్కోరు చేయడంతో పాటు 168 పరుగుల అతిపెద్ద విజయం నమోదు చేయగలిగింది.

ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్ర్రేలియాతో జరిగే నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ శుభ్ మన్ గిల్ కు అసలుసిసలు పరీక్షకానుంది.

First Published:  2 Feb 2023 10:48 AM IST
Next Story