Telugu Global
Sports

సెంచరీల బాదుడులో శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డు!

భారత్ కమ్ గుజరాత్ టైటాన్స్ యువఓపెనర్ శుభ్ మన్ గిల్ చరిత్ర సృష్టించాడు

సెంచరీల బాదుడులో శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డు!
X

భారత్ కమ్ గుజరాత్ టైటాన్స్ యువఓపెనర్ శుభ్ మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో తన తొలిశతకం సాధించడం ద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు...

భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. 2022 సీజన్లో మాత్రమే కాదు..ప్రస్తుత 2023 సీజన్లో సైతం శతకాలతో చెలరేగిపోతున్నాడు.

ఇప్పటికే క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన శుభ్ మన్ గిల్..ఐపీఎల్ లో సైతం తన తొలి సెంచరీని సాధించగలిగాడు.

సన్ రైజర్స్ పై గిల్ తొలిశతకం..

ఐపీఎల్ లో చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ గా గత సీజన్ నుంచి ఆడుతున్న శుభ్ మన్ గిల్ ప్రస్తుత సీజన్లో తన తొలిశతకం సాధించగలిగాడు. హోంగ్రౌండ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన పోరులో గిల్ సెంచరీ హీరోగా నిలిచాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు గిల్ తన బ్యాటింగ్ జోరును కొనసాగించి కేవలం 58 బంతుల్లో 13 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 101 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

ఆట 19వ ఓవర్లో సీమర్ న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా తొలి ఐపీఎల్ శతకాన్ని తన ఖాతాలో వేసుకోగలిగాడు.

ఇప్పటికే క్రికెట్ మూడు ( టెస్టు, వన్డే, టీ-20 ) ఫార్మాట్లలో అంతర్జాతీయ సెంచరీలు సాధించిన గిల్..ఎట్టకేలకు ఐపీఎల్ లో సైతం శతకం నమోదు చేయగలిగాడు.

గ‌త మ్యాచుల్లో తొంభైల్లోనే అత‌ను నాలుగు సార్లు ఔట‌య్యాడు. పంజాబ్ కింగ్స్‌పై 95 పరుగుల స్కోరుకు అవుటైన గిల్..సన్ రైజర్స్ పై మాత్రం శతకం పూర్తి చేయగలిగాడు.

తన తొలి అర్థశతకాన్ని 22 బంతుల్లోనే పూర్తి చేసిన గిల్..రెండో అర్థశతకాన్ని 34 బంతుల్లో కానీ సాధించలేకపోయాడు. వన్ డౌన్ సాయి సుదర్శన్ తో కలసి రెండో వికెట్ కు 147 పరుగుల భారీభాగస్వామ్యం నమోదు చేశాడు.

6వ బ్యాటర్ గా శుభమన్ గిల్...

ప్రస్తుత సీజన్ ఐపీఎల్ లో సెంచరీమార్క్ చేరిన ఆరవ బ్యాటర్ గా శుభమన్ గిల్ నిలిచాడు. హ్యారీ బ్రూక్, వెంకటేశ్ అయ్యర్, యశస్వి జైశ్వాల్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ ల వరుసలో చేరాడు.

అంతేకాదు..ప్రస్తుత సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన ఓపెనర్లలో ఒకడిగా నిలిచాడు.

అంతర్జాతీయ సిరీస్ ల్లోనూ.....

శుభ్ మన్ గిల్ 2023 సీజన్ ప్రారంభ సిరీస్ ల్లోనే జోరు పెంచాడు. న్యూజిలాండ్ తో ముగిసిన తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ ల్లో ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్ వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ, అహ్మదాబాద్ టీ-20 మ్యాచ్ లో సెంచరీతో రికార్డుల జల్లు కురిపించాడు.

23 సంవత్సరాల చిన్నవయసులోనే క్రికెట్ మూడుఫార్మాట్లతో పాటు ఐపీఎల్ లోనూ శతకాలు సాధించిన తొలి బ్యాటర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అండర్ -19 ప్రపంచకప్ ద్వారా భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన శుభ్ మన్ తన కెరియర్ లో ముందుగా సాంప్రదాయ టెస్టు క్రికెట్లో తొలి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన 2023 వన్డే సిరీస్ లో తొలి ద్విశతకం, తీన్మార్ టీ-20 సిరీస్ ఆఖరిమ్యాచ్ లో తొలిశతకం సాధించడం ద్వారా...క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన భారత ఐదో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

గతంలో క్రికెట్ మూడుఫార్మాట్లలో సెంచరీలు బాదిన మొనగాళ్లలో రోహిత్ శర్మ, సురేశ్ రైనా, కెఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ ఉన్నారు. ఇప్పుడు శుభ్ మన్ గిల్ వచ్చి ఆ నలుగురు దిగ్గజాల సరసన నిలిచాడు.

సిక్సర్ల హ్యాట్రిక్ తో వన్డే డబుల్..

హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన వన్డే సిరీస్ తొలిమ్యాచ్ లో శుభ్ మన్ గిల్ శివమెత్తిపోయాడు. వరుసగా మూడు సిక్సర్లతో ద్విశతకం బాదాడు.

కేవలం 145 బంతుల్లోనే 8 సిక్సర్లు, 19 బౌండ్రీలతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన భారత ఐదవ క్రికెటర్ గా, అత్యంత పిన్నవయస్కుడైన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు.

వన్డేల్లో ద్విశతకాలు సాధించిన భారత స్టార్ ఆటగాళ్లలో మాస్టర్ సచిన్, బ్లాస్టర్ వీరేంద్ర సెహ్వాగ్, హిట్ మాన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఉన్నారు.

వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరిన తొలి బ్యాటర్ గా మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ శిఖర్ ధావన్ పేరుతో ఉన్న రికార్డును గిల్ తెరమరుగు చేశాడు.

టీ-20ల్లో అత్యధిక స్కోరు రికార్డు...

అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో ఈ సీజన్ ప్రారంభంలో ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో శుభ్ మన్ చెలరేగాడు. న్యూజిలాండ్ బౌలర్లను చెండాటం ద్వారా పరుగుల వెల్లువెత్తించాడు.

12 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 126 పరుగుల నాటౌట్ స్కోరు నమోదు చేశాడు. టీ-20 క్రికెట్లో ఓ భారత బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావటం విశేషం.

వచ్చే నెలలో ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగే టెస్టు లీగ్ ఫైనల్ ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ కు అసలుసిసలు పరీక్షకానుంది.

First Published:  16 May 2023 10:16 AM IST
Next Story