హైదరాబాద్ వన్డేలో శుభ్ మన్ గిల్ రికార్డుల మోత!
Shubman Gill Records: హైదరాబాద్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నాలుగేళ్ల విరామం తర్వాత జరిగిన వన్డేలో భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ రికార్డుల మోత మోగించాడు.
హైదరాబాద్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నాలుగేళ్ల విరామం తర్వాత జరిగిన వన్డేలో భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ రికార్డుల మోత మోగించాడు.
డబుల్ సెంచరీతో భారత్ కు భారీస్కోరు అందించాడు....
న్యూజిలాండ్ తో హైదరాబాద్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలివన్డేలో భారత యువఆటగాడు శుభ్ మన్ గిల్ రికార్డుల మోత మోగించాడు.
కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన శుభ్ మన్ ఒక్కడే 208 పరుగుల రికార్డు స్కోరు సాధించాడు.
భారత్ సాధించిన 349 పరుగుల స్కోరులో 23 సంవత్సరాల గిల్ సాధించినవే 208 పరుగులు ఉండటం విశేషం. శుభ్ మన్ కేవలం 149 బంతుల్లోనే 19 బౌండ్రీలు, 9 సిక్సర్ల తో తన కెరియర్ లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు.
తన కెరియర్ లో రెండు శతకాలు, ఓ ద్విశతకం బాదిన శుభ్ మన్ గత రెండువన్డేలలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించడం విశేషం. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో ముగిసిన ఆఖరి వన్డేలో సెంచరీ సాధించిన శుభ్ మన్ ..ప్రస్తుత హైదరాబాద్ వన్డేలో తన స్కోరును ద్విశతకానికి చేర్చాడు.
శిఖర్, విరాట్ లను మించిన శుభ్ మన్
భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన క్రికెటర్ గా శుభ్ మన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ , దిగ్గజ ఆటగాడు విరాట్ కొహ్లీల పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు.
2018 అండర్ -19 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవడంలో ప్రధానపాత్ర పోషించిన శుభ్ మన్ సీనియర్ స్థాయిలో సైతం అదేజోరు కొనసాగించగలుగుతున్నాడు. టెస్టు క్రికెట్లో ఇప్పటికే శతకం సాధించిన శుభ్ మన్ వన్డేలలో సైతం సెంచరీలు, డబుల్ సెంచరీ నమోదు చేయగలిగాడు.
మొదటి 87 బంతుల్లో తొలిశతకం సాధించిన శుభ్ మన్ ఆ తర్వాత మరిన్ని తక్కువ బాల్స్ లోనే ద్విశతకాన్ని పూర్తి చేయగలిగాడు.
కేవలం 19 వన్డేలలోనే శుభ్ మన్ వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు. శిఖర్ ధావన్, విరాట్ కొహ్లీ 24 వన్డేలలో సాధించిన వెయ్యి పరుగుల రికార్డును శుభ్ మన్ ..అంతకంటే 5 వన్డేలకు ముందే చేరుకోగలిగాడు.
పాక్ ఆటగాడు ఇమాముల్ హక్ తో జంటగా 1000 పరుగులు అత్యంత వేగంగా సాధించిన బ్యాటర్ గా రికార్డుల్లో శుభ్ మన్ చోటు సంపాదించాడు.
వివియన్ రిచర్డ్స్, బాబర్ అజామ్,కెవిన్ పీటర్సన్, జోనాథన్ ట్రాట్, క్వింటన్ డి కాక్, రాసీ వాండెర్ డ్యూసెన్ 21 వన్డేలలో వెయ్యి పరుగులు సాధిస్తే..పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్ కేవలం 18 వన్డేలలోనే వెయ్యి పరుగుల రికార్డుతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
23 సంవత్సరాల చిరుప్రాయంలోనే అలవోకగా అంతర్జాతీయ సెంచరీలు బాదేస్తున్న శుభ్ మన్ గిల్ రానున్నకాలంలో భారత్ కు మూడుఫార్మాట్లలోనూ విలువైన ఓపెనర్ గా సేవలు అందించనున్నాడు.