Telugu Global
Sports

షమీ చెలరేగినా..గుజరాత్ కు ఢిల్లీ షాక్!

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో మరో సంచలనం నమోదయ్యింది.

షమీ చెలరేగినా..గుజరాత్ కు ఢిల్లీ షాక్!
X

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో మరో సంచలనం నమోదయ్యింది. టేబుల్ టాపర్ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ను ఢిల్లీ గట్టి దెబ్బ కొట్టింది..

ఐపీఎల్ -16వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ సమరం ఆసక్తికరంగా సాగుతోంది. 10 జట్లు, 70 మ్యాచ్ ల ఈ లీగ్ లో ఏజట్టు ఏజట్టును దెబ్బకొడుతుందో తెలియని

పరిస్థితి నెలకొని ఉంది.

మొత్తం 10 జట్లలో అత్యంత బలహీనంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తన 9వ రౌండ్ పోరులో టేబుల్ టాపర్, అత్యంత బలమైన గుజరాత్ టైటాన్స్ ను 5 పరుగుల తేడాతో దిమ్మతిరిగే దెబ్బ కొట్టింది.

మరో లోస్కోరింగ్ థ్రిల్లర్...

లక్నో వేదికగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్- లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ముగిసిన లోస్కోరింగ్ థ్రిల్లర్ ను మరువక ముందే..కేవలం 24 గంటల్లోనే మరో

లోస్కోరింగ్ మ్యాచ్ కు..అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిలిచింది.

డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ హోంగ్రౌండ్ గా ఉన్న అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో రెండుజట్లూ కలసి 265 పరుగులు మాత్రమే చేయగలిగాయి.

నిప్పులు చెరిగిన షమీ....

ఈ కీలక పోరులో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగే ఫాస్ట్ బౌలింగ్ తో ఢిల్లీ టాపార్డర్ ను కకావికలు చేశాడు.

తొలి బంతికే ఓపెన‌ర్ ఫిలిఫ్ సాల్ట్‌(0) ఔట‌య్యాడు. ష‌మీ వేసిన తొలి బంతిని షాట్ ఆడిన అత‌ను మిల్ల‌ర్ క్యాచ్ ప‌ట్ట‌డంతో డ‌కౌట‌య్యాడు. దాంతో, ఖాతా తెర‌వ‌కుండానే ఢిల్లీ వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లోనే డేవిడ్ వార్న‌ర్(2) లేని పరుగు కోసం ప్రయత్నించి ర‌నౌట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన రిలే రూస్సో(8), మ‌నీశ్ పాండే(1), ప్రియం గార్గ్(10)ను షమీ పెవిలియ‌న్ పంపాడు. దీంతో ఢిల్లీ 100 పరుగులైనా సాధించగలదా అన్న అనుమానం రేకెత్తింది.

అమన్ ఒంటరిపోరాటం..

టాపార్డర్ కుప్పకూలడంతో దిక్కుతోచని స్థితిలోకి పడిపోయిన ఢిల్లీకి మిడిలార్డర్ బ్యాటర్లు అమన్ ఖాన్, అక్షర్ పటేల్, రిపల్ పటేల్ తమ వీరోచిత బ్యాటింగ్ తో ఊపిరి పోశారు.

అమ‌న్ ఖాన్, అక్షర్ ప‌టేల్,రిప‌ల్ ప‌టేల్ 6, 7 వికెట్ భాగస్వామ్యాలతో 50 పరుగులు జోడించడం ద్వారా పరువు దక్కించారు. అమ‌న్ 41 బంతుల్లో ఫైటింగ్ హాఫ్ సెంచరీతో తన జట్టును ఆదుకొన్నాడు. అమన్‌ హకీమ్‌ ఖాన్‌ (44 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ ప‌టేల్(27), రిప‌ల్ ప‌టేల్(23) పరుగులు సాధించారు. ఐపీఎల్ లో అమన్ ఖాన్ కు ఇదే తొలి అర్థశతకం కావడం విశేషం. గుజరాత్ బౌలర్లలో షమీ నాలుగు, మోహిత్ శ‌ర్మ రెండు, ర‌షీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

హార్థిక్ పోరాటం వృథా!

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 131 పరుగులు చేయాల్సిన గుజరాత్ చేజింగ్ లో చతికిలపడింది. 6 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.

గుజ‌రాత్‌కు సైతం తొలి ఓవ‌ర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఖ‌లీల్ అహ్మ‌ద్ ఓవర్ ఆఖ‌రి బంతికి వృద్ధిమాన్ సాహా(0) ఔట‌య్యాడు. దాంతో, ఖాతా తెర‌కుండానే గుజ‌రాత్ తొలి వికెట్ కోల్పోయింది.

ఢిల్లీ బౌలర్లు ఖలీల్, ఇషాంత్, నోర్జే కుదురైన బౌలింగ్ తో పవర్ ప్లే ఆరు ఓవర్లలోనే 3 కీలక వికెట్లు పడగొట్టగలిగారు. గుజరాత్ మొదటి 5 ఓవర్లలో 31 పరుగులకే 3 వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.

డాషింగ్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శ‌ర్మ ఓవ‌ర్లో 6 పరుగులకే అవుటయ్యాడు. ఓవర్ మూడో బంతిని బౌండ‌రీ బాదిన అత‌ను ఆఖ‌రి బంతికి ఔట‌య్యాడు.

ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్న మరోవైపు కెప్టెన్ హార్థిక్ పాండ్యా మాత్రం తన పోరాటం కొనసాగించాడు. 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ తెవాటియా వరుసగా మూడు సిక్సర్లు బాది గెలుపు ఆశలు రేకెత్తించినా..ఢిల్లీ లంబూ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ..ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ను

అద్భుతంగా వేశాడు.

గుజ‌రాత్ విజ‌యానికి ఆఖరి 6 బంతుల్లో12 ప‌రుగులు కావాలి. ఇషాంత్ వేసిన 20వ ఓవ‌ర్లో రాహుల్ తెవాటియా(20) ఔట‌య్యాడు. ర‌షీద్ ఖాన్ రెండు పరుగులు మాత్రమే తీశాడు. ఆఖ‌రి బంతికి 7 పరుగులు చేయాల్సి ఉంటగా ర‌షీద్ ఒక్క ప‌రుగు మాత్రమే రాబట్టగలిగాడు. దాంతో, ఢిల్లీ 5 ప‌రుగుల తేడాతో సంచలనం విజయం నమోదు చేసింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(59) నాటౌట్‌గా నిలిచాడు.

4 వికెట్లు పడగొట్టిన గుజరాత్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

చేజింగ్ లో రెండో ఓటమి...

చేజింగ్ విజయాలలో మేటిజట్టుగా పేరుపొందిన గుజరాత్ టైటాన్స్ కు..గత 14 చేజింగ్ మ్యాచ్ ల్లో ఇది కేవలం రెండో ఓటమి మాత్రమే. చేజింగ్ లో 12 విజయాలు సాధించిన రికార్డు గుజరాత్ కు ఉంది.

మరోవైపు..అతితక్కువ లక్ష్యాలను ఢిల్లీజట్టు కాపాడుకోడం ఇది నాలుగోసారి.131 పరుగుల అతిస్వల్పలక్ష్యాన్ని విజయవంతంగా ఢిల్లీ క్యాపిటల్స్ కాపాడుకోగలిగింది.

గతంలో 145 , 151, 153 స్కోర్లను సైతం కాపాడుకొన్న రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఉంది.

తొమ్మిది రౌండ్లలో గుజరాత్ టైటాన్స్ కు ఇది కేవలం మూడో ఓటమి మాత్రమే కాగా..ఢిల్లీకి 9 మ్యాచ్ ల్లో మూడు గెలుపు.

ఈరోజు జరిగే డబుల్ హెడ్డర్ సమరంలో లక్నోతో చెన్నై, పంజాబ్‌తో ముంబై తలపడనున్నాయి.

First Published:  3 May 2023 10:27 AM IST
Next Story