Telugu Global
Sports

షమీ వికెట్ల తాండవం... ప్రపంచకప్ ఫైనల్లో భారత్!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ భారత్ నాలుగోసారి చేరుకొంది. తొలిసెమీఫైనల్లో న్యూజిలాండ్ ను 70 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా మూడో టైటిల్ కు గురిపెట్టింది.

షమీ వికెట్ల తాండవం... ప్రపంచకప్ ఫైనల్లో భారత్!
X

ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ భారత్ నాలుగోసారి చేరుకొంది. తొలిసెమీఫైనల్లో న్యూజిలాండ్ ను 70 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా మూడో టైటిల్ కు గురిపెట్టింది....

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో అప్రతిహత విజయాలు సాధించడం ద్వారా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టిన భారత్..సెమీఫైనల్ పోరులో సైతం అదే జోరు కొనసాగించింది.

న్యూజిలాండ్ పై తొలి నాకౌట్ విజయం...

ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల నాకౌట్ రౌండ్లలో భారత్ రెండుదశాబ్దాల తర్వాత తొలివిజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముగిసిన తొలి సెమీఫైనల్ హైస్కోరింగ్ మ్యాచ్ లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను అధిగమించింది.

దక్షిణాఫ్రికా- ఆస్ట్ర్రేలియాజట్ల రెండో సెమీఫైనల్లో నెగ్గిన జట్టుతో ఈనెల 19న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ పోరులో భారత్ తలపడనుంది.

భారత బ్యాటింగ్ విశ్వరూపం...

భారీఅంచనాల నడుమ ..ప్రపంచ ప్రముఖులు, 33వేల మంది అభిమానుల సమక్షంలో...ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వీక్షించిన ఈ నాకౌట్ పోరులో ముందుగా కీలక టాస్ నెగ్గడం ద్వారా భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకొన్నాడు.

సహఓపెనర్ శుభ్ మన్ గిల్ తో కలసి తనజట్టుకు మరోసారి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కివీ స్వింగ్, ఫాస్ట్ బౌలర్లపై భారత కెప్టెన్ కమ్ హిట్ మాన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో భారీషాట్లతో విరుచుకు పడ్డాడు. మొదటి వికెట్ కు 8.2 ఓవర్లలోనే 71 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని అందించాడు. రోహిత్ ఒక్కడే కేవలం 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో భారత్ తొలివికెట్ నష్టపోయింది.

ఆ తర్వాత ..యువఓపెనర్ శుభ్ మన్ గిల్ తో కలసి రన్ మెషీన్ విరాట్ కొహ్లీ తన పరుగుల వేట కొనసాగించాడు. గిల్ 79 పరుగుల స్కోరు వద్ద కాలినరాలు పట్టేయడంతో ఆట నుంచి మెడికల్ టైమ్ ఆవుట్ తీసుకొన్నాడు.దీంతో నంబర్ -4 బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వచ్చి విరాట్ తో జత కలిశాడు.

విరాట్ జోరు- అయ్యర్ హోరు....

విరాట్ కొహ్లీ- శ్రేయస్ అయ్యర్ తిరుగులేని భాగస్వామ్యంతో భారత్ రికార్డు స్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించారు. మాస్టర్ సచిన్ అడ్డా వాంఖడే స్టేడియం వేదికగా..సచిన్ పేరుతో ఉన్న 49 సెంచరీల ప్రపంచ రికార్డును అధిగమించే అవకాశాన్ని విరాట్ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు. కోల్ కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో 49వ శతకం సాధించడం ద్వారా మాస్టర్ ప్రపంచ రికార్డును సమం చేసిన ఈ నయామాస్టర్ ప్రపంచకప్ సెమీఫైనల్లో సూపర్ సెంచరీ సాధించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 113 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్లతో 117 పరుగుల స్కోరు సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 50 సెంచరీల మైలురాయిని చేరిన తొలి బ్యాటర్ గా సంచలనం సృష్టించాడు.

ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ ల్లో విరాట్ కు ఇదే అత్యధిక స్కోరు మాత్రమే కాదు..తొలి మూడంకెల స్కోరు కూడా.

అయ్యర్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు...

మిడిలార్డర్లో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సైతం చెలరేగిపోయాడు. విరాట్ తో కలసి భారీభాగస్వామ్యం నమోదు చేయడంలో ప్రధానపాత్ర పోషించాడు. తన హోంగ్రౌండ్లో ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడే అరుదైన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకొన్నాడు. కేవలం 70 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 105 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో అయ్యర్ కు ఇది వరుసగా రెండో శతకం కావడం విశేషం.

గతంలో వరుసగా ప్రపంచకప్ శతకాలు బాదిన భారత దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మల సరసన అయ్యర్ నిలిచాడు.

శుభ్ మన్ గిల్ 66 బంతుల్లో 8 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 80 పరుగులు, రాహుల్ 20 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 39 పరుగులు సాధించడంతో భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ ల్లో భారత్ కు ఇదే అతిపెద్ద స్కోరు కావడం విశేషం.

న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 3 వికెట్లు, బౌల్ట్ 1 వికెట్ పడగొట్టారు.

7 వికెట్లతో షమీ విశ్వరూపం...

మ్యాచ్ నెగ్గాలంటే 398 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్- డారిల్ మిచెల్ 3వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసినా భారత బౌలర్ల జోరు ముందు కివీ బ్యాటర్లు బేజారెత్తిపోయారు.

రెండోడౌన్ ఆటగాడు డారిల్ మిచెల్ 119 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 134 పరుగుల తో స్ట్ర్రోక్ ఫుల్ సెంచరీ బాదినా ప్రయోజనం లేకపోయింది. భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టడం ద్వారా కివీస్ ను ఆలౌట్ చేయడంలో ప్రధానపాత్ర వహించాడు.

భారత్ 70 పరుగుల విజయంతో సెమీస్ చేరడంలో కీలకంగా మారిన మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మహ్మద్ షమీ రికార్డుల మోత...

ప్రస్తుత ప్రపంచకప్ లో అత్యధికంగా 23 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా మహ్మద్ షమీ నిలిచాడు. న్యూజిలాండ్ తో లీగ్ దశ పోటీలో 5వికెట్లు, నాకౌట్ సెమీఫైనల్లో 7 వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్ మహ్మద్ షమీ మాత్రమే.

అంతేకాదు..ప్రస్తుత ప్రపంచకప్ లో రెండుసార్లు 5 వికెట్ల ఘనతను, ప్రపంచకప్ చరిత్రలోనే 50కి పైగా వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ రికార్డులను షమీ సాధించాడు.

1983, 2003, 2011 ప్రపంచకప్ టోర్నీల ఫైనల్స్ చేరడం ద్వారా రెండుసార్లు విజేతగా నిలిచిన భారత్..టైటిల్ సమరానికి అర్హత సాధించడం ఇది నాలుగోసారి. 2011 ప్రపంచకప్ నుంచి ప్రతిసారీ నాకౌట్ రౌండ్ చేరుతూ వచ్చిన భారత్ పుష్కరకాలం విరామం తర్వాత తిరిగి ఫైనల్ చేరుకోగలిగింది.

న్యూజిలాండ్ పై గత రండుదశాబ్దాల కాలంలో ప్రపంచకప్ నాకౌట్ రౌండ్లో భారత్ తొలిసారిగా నెగ్గడం, విరాట్ కొహ్లీ 50వ సెంచరీతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడం, మహ్మద్ షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు సాధించడం, భారత కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక సిక్సర్లు, విరాట్ కొహ్లీ 700కు పైగా పరుగులు సాధించడం..తొలిసెమీఫైనల్స్ కే హైలైట్స్ గా మిగిలిపోతాయి.

First Published:  16 Nov 2023 7:45 AM IST
Next Story