Telugu Global
Sports

ప్రపంచకప్ సూపర్ -12 తొలి మ్యాచ్‌లోనే సంచలనం!

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదయ్యింది. గ్రూప్ -1 ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను రన్నరప్ న్యూజిలాండ్ 89 పరుగులతో చిత్తు చేయడం ద్వారా శుభారంభం చేసింది.

ప్రపంచకప్ సూపర్ -12 తొలి మ్యాచ్‌లోనే సంచలనం!
X

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదయ్యింది. గ్రూప్ -1 తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాను రన్నరప్ న్యూజిలాండ్ 89 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. సమాధానంగా 291 పరుగుల లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 17.1 ఓవర్లలోనే న్యూజిలాండ్ బౌలర్లు కుప్పకూల్చి తమ జట్టుకు ఘనవిజయం అందించారు.

కాన్వే-అలెన్ ధనాధన్ బ్యాటింగ్..

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనింగ్ జోడీ ఫిన్ అలెన్- డేవిడ్ కాన్వే జోడీ మొదటి 4 ఓవర్లలోనే 56 పరుగుల మెరుపు భాగస్వామ్యంతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. అలెన్ 16 బాల్స్ లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. వన్ డౌన్ కేన్ విలియమ్స్ సన్ 23, రెండో డౌన్ గ్లెన్ ఫిలిప్స్ 12 పరుగుల స్కోర్లకు అవుట్ కాగా..ఆల్ రౌండర్ నీషమ్ 26 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.

మరో ఓపెనర్ డేవిడ్ కాన్వే 58 బాల్స్ లో 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 92 పరుగులతో అజేయంగా నిలవడంతో కివీజట్టు..200 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది. కంగారూ బౌలర్లలో హేజిల్ వుడ్ 2 వికెట్లు, ఆడం జంపా 1 వికెట్ పడగొట్టారు.

కంగారూ టాపార్డర్ టపటపా..

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 200 పరుగులు చేయాల్సిన ఆస్ట్రేలియా...పవర్ ప్లే ఓవర్లలోనే ఓపెనర్లు వార్నర్ (5), ఆరోన్ ఫించ్ (13), వన్ డౌన్ మిషెల్ మార్ష్ (18) వికెట్లు నష్టపోయి...పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది. మొదటి 11 ఓవర్లలోనే టాప్ ఆర్డర్‌లోని మొదటి 5 వికెట్లు నష్టపోయి మరి కోలుకోలేకపోయింది. మాక్స్ వెల్ 28, స్టోయినిస్ 7, టిమ్ డేవిడ్ 11, మాథ్యూ వేడ్ 2 పరుగుల స్కోర్లకు ఒకరి వెనుక ఒకరు అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైపోయింది. కమిన్స్ 21 పరుగుల స్కోరుతో పోరాడినా ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలోనే ఆలౌట్ కాక తప్పలేదు. దీంతో న్యూజిలాండ్ 89 పరుగులతో విజేతగా నిలిచింది.

2019 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ-20 పోరులో న్యూజిలాండ్‌కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. న్యూజిలాండ్ విజయంలో ప్రధానపాత్ర వహించిన డేవిడ్ కాన్వేకి `ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్` అవార్డు దక్కింది. సూపర్ -12 గ్రూప్ -1 సమరంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి.

ప్రపంచకప్ తొలిదశ క్వాలిఫైయింగ్ రౌండ్ ప్రారంభ మ్యాచ్ లో శ్రీలంకపై పసికూన నమీబియా సంచలన విజయం సాధిస్తే...సూపర్ -12 తొలి మ్యాచ్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ కంగుతినిపించడం విశేషం.

First Published:  22 Oct 2022 1:46 PM GMT
Next Story