Telugu Global
Sports

సూపర్-8 అర్హతతో అమెరికా స్టార్ బౌలర్ కు కొత్తకష్టం!

టీ-20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్ కు పసికూన అమెరికా అర్హత సాధించడంతో ఆ జట్టులోని భారత సంతతి స్టార్ బౌలర్ కు కొత్త చిక్కు వచ్చి పడింది.

సూపర్-8 అర్హతతో అమెరికా స్టార్ బౌలర్ కు కొత్తకష్టం!
X

టీ-20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్ కు పసికూన అమెరికా అర్హత సాధించడంతో ఆ జట్టులోని భారత సంతతి స్టార్ బౌలర్ కు కొత్త చిక్కు వచ్చి పడింది.

సౌరవ్ నేత్రవల్కర్...ప్రస్తుతం ప్రపంచ, అమెరికా క్రికెట్ వర్గాలలో మార్మోగిపోతున్న పేరు. క్రికెట్ ఓనమాలు దిద్దుకొంటున్న అమెరికాజట్టు..2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సూపర్- 8 రౌండ్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.

ఎవరీ సౌరవ్ నేత్రవల్కర్......

అమెరికా బౌలింగ్ ప్రధాన అస్త్ర్రంగా ఉన్న సౌరవ్ నేత్రవల్కర్ పదేళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లాడు. గతంలో ముంబైజట్టుతో పాటు.. 2010, 2012 అండర్ - 19 ప్రపంచకప్ క్రికెట్ పోటీలలో సౌరవ్ భారత్ కు సైతం నేతృత్వం వహించాడు. అయితే..సీనియర్ స్థాయిలో తనకు భారతజట్టులో చోటు దక్కడం అంతతేలిక కాదని గ్రహించిన సౌరవ్...క్రికెట్ ను కాదనుకొని సాఫ్ట్ వేర్ వృత్తివైపే మొగ్గుచూపాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ , స్వింగ్ బౌలర్ గా పేరున్న సౌరవ్ తన క్రికెట్ కెరియర్ ను పణంగా పెట్టి..2014 లో అమెరికాకు వలస వెళ్లి..అక్కడి ఒరెకిల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూనే..ప్రవృత్తిగా క్రికెట్ ఆడుతూ వస్తున్నాడు.

అమెరికాజట్టులో చోటుతో కొత్తఊపిరి...

ముంబైలో క్రికెట్ ఓనమాలు దిద్దుకొని సూర్యకుమార్ యాదవ్ తో కలసి ఆడిన సౌరవ్ నేతృవల్కర్..గత దశాబ్దకాలంగా ఒరెకిల్ కంపెనీ లో పనిచేస్తూ సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పదోన్నతి సాధించాడు. అంతేకాదు..అమెరికా పౌరసత్వంసైతం సంపాదించి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొన్నాడు.

వారాంతపు సెలవు దినాలలో కాలక్షేపం కోసం క్రికెట్ ఆడుతూ.. అమెరికన్ మేజర్ లీగ్ లో అడుగుపెట్టడం ద్వారా క్రికెటర్ గా పునరుజ్జీవనం సాధించాడు. ఏకంగా అమెరికా జాతీయజట్టులోనే చోటు సంపాదించాడు.

వెస్టిండీస్ తో కలసి అమెరికా సైతం..2024 ఐసీసీ- టీ-20 ప్రపంచకప్ కు సంయుక్త ఆతిథ్యదేశాలలో ఒకటిగా నిలవడంతో..నేరుగా ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే అవకాశం చిక్కింది.

సగంమంది భారత సంతతి ఆటగాళ్లతో...

వికెట్ కీపర్ బ్యాటర్ మోనాంక్ పటేల్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల అమెరికాజట్టులో సగంమంది భారత సంతతి ఆటగాళ్లే కావడం విశేషం. మిగిలిన సగంమంది ఆటగాళ్లలో నెదర్లాండ్స్, వెస్టిండీస్, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక సంతతి ఆటగాళ్లున్నారు.

అయితే..పసికూన అమెరికాజట్టుకు ఓపెనింగ్ బౌలర్ గా సేవలు అందిస్తున్న సౌరవ్ నేత్రవల్కర్...తనజట్టు సూపర్- 8 రౌండ్ కు అర్హత సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు.

కెనడా, పాకిస్థాన్ దేశాలపై అమెరికాజట్టు విజయాలు సాధించడంతో పాటు..భారత్ లాంటి దిగ్గజ జట్టుకు గట్టిపోటీ ఇవ్వడంలో సౌరవ్ కీలకభూమిక నిర్వహించాడు.

ప్రపంచ మాజీ చాంపియన్ పాకిస్థాన్ తో జరిగిన కీలకపోరులో అమెరికా సూపర్ ఓవర్ విజయం సాధించడంలో సౌరవ్ మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. అంతేకాదు..భారత ఓపెనింగ్ జోడీ విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మలను పెవీలియన్ దారి పట్టించడం ద్వారా సౌరవ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

క్రికెట్ ఫీజు కంటే ఉద్యోగవేతనమే ఎక్కువ....

అమెరికాజట్టు..గ్రూప్ లీగ్ దశను విజయవంతంగా అధిగమించి సూపర్- 8 రౌండ్ కు అర్హత సాధించడంతో అభిమానులంతా ఓవైపు గాల్లో తేలిపోతుంటే...స్టార్ పేసర్ సౌరవ్ నేత్రవల్కర్ మాత్రం అయోమయంలో పడిపోయాడు. ఎందుకంటే..ఇప్పటి వరకూ వేతనంతో కూడిన తన సెలవు( 13 రోజులు ) ఉపయోగించుకొని గ్రూపులీగ్ పోటీలలో పాల్గొన్న సౌరవ్...సూపర్- 8 రౌండ్ మ్యాచ్ లు ఆడాలంటే 'లాస్ ఆఫ్ పే' తోనే బరిలోకి దిగాల్సి ఉంది. అమెరికా తరపున ప్రపంచకప్ ఆడుతున్నందుకు వచ్చే మ్యాచ్ ఫీజు కంటే..ఉద్యోగం ద్వారా తనకు వచ్చే వేతనమే ఎక్కువగా ఉండడం సౌరవ్ ను అయోమయంలో పడేలా చేసింది.

ఒరెకిల్ సంస్థ ఏమంటోంది...?

సౌరవ్ నేత్రవల్కర్ టీ-20 ప్రపంచకప్ లో బౌలర్ గా మెరుపులు మెరిపించడంతో అతను ఉద్యోగిగా ఉన్న ఒరెకిల్ కంపెనీ షేర్ మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోయింది. దీనికితోడు ఒరెకిల్ కంపెనీకి డాలర్ ఖర్చు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అంతులేని ప్రచారం వచ్చింది.

తమ కంపెనీలో ఉద్యోగి...టీ-20 ప్రపంచకప్ లో అమెరికాజట్టుకు ఆడుతూ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలవడం తమకు గర్వకారణమని, నేత్రవల్కర్ ను చూసి గర్విస్తున్నామంటూ ఆ సంస్థ హెచ్ ఆర్ ప్రతినిథి ఓ ట్విట్టర్ సందేశం పంపినా..వేతనం పెంచుతామనికానీ, లాస్ పే లేకుండా క్రికెట్ ఆడనిస్తామని కానీ ప్రకటించకపోడం మరింత అయోమయాన్ని సృష్టించింది.

అయితే..అమెరికాలోని క్రికెట్ అభిమానులు మాత్రం..సౌరవ్ నేత్రవల్కర్ కు ఒరెకిల్ కంపెనీ మూడురెట్ల మేర వేతనం పెంచాలని, అతనిని బ్రాండ్ అంబాసిడర్ గా తమ కంపెనీకోసం ఉపయోగించుకోవాలంటే సోషల్ మీడియా వేదికల ద్వారా డిమాండ్ చేస్తున్నారు.

పదిరోజులపాటు సాగే సూపర్- 8 రౌండ్ మ్యాచ్ ల్లో నేత్రవల్కర్ వేతనంతో కూడిన సెలవుపై ఆడతాడా?..లేక వేతన నష్టంతో కూడిన సెలవుపైన ఆడతాడా? అన్నదే ఇక్కడి అసలు పాయింట్....

First Published:  16 Jun 2024 10:35 AM GMT
Next Story