తెలుగోడి దెబ్బతో సరికొత్త ప్రపంచ రికార్డు!
మెరుపువేగంతో సాగిపోయే బ్యాడ్మింటన్లో మరో సరికొత్త ప్రపంచ రికార్డు వచ్చి చేరింది. ఈ ఘనతను ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ సాధించాడు.
మెరుపువేగంతో సాగిపోయే బ్యాడ్మింటన్లో మరో సరికొత్త ప్రపంచ రికార్డు వచ్చి చేరింది. ఈ ఘనతను ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ సాధించాడు...
బ్యాడ్మింటన్..ఈ గేమ్ ను తలచుకోగానే అగ్గిపిడుగుల్లాంటి స్మాష్ లతో...మెరుపువేగంతో సాగిపోయే క్రీడే కళ్లముందు కదలాడుతుంది. పవర్ గేమ్ తో తలపడే ఇద్దరు క్రీడాకారులు తలపడితే..ఆ గేమ్ ను చూడటానికి రెండు కళ్లూ చాలవనటంలో అతిశయోక్తి లేదు. అదే మెరుపువేగంతో..సుదీర్ఘ ర్యాలీలతో..బలమైన షాట్లు, స్మాష్ లతో సాగిపోయే డబుల్స్ మ్యాచ్ ల్లోనే బ్యాడ్మింటన్ లోని అసలు మజా ఏమిటో తెలిసి వస్తుంది.
పురుషులు లేదా మహిళల సింగిల్స్ లోనే కాదు..డబుల్స్ లో సైతం కొందరు క్రీడాకారులు గాల్లోకి ఎగిరి కొట్టే జంప్ షాట్లు లేదా స్మాష్ ల వేగం గంటకు 250 నుంచి 400 కిలోమీటర్ల వరకూ నమోదైన రికార్డులు ఉన్నాయి. అయితే ..ఆ వేగాని 500 కిలోమీటర్లు దాటించిన ఘనతను మాత్రం భారత డబుల్స్ స్పెషలిస్ట్, తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ సొంతం చేసుకొన్నాడు.
565 కిలోమీటర్ల వేగంతో స్మాష్....
ప్రపంచ బ్యాడ్మింటన్లో 2013 వరకూ నమోదైన అత్యంత వేగవంతమైన స్మాష్ 493 కిలోమీటర్లు మాత్రమే. గత దశాబ్దకాలంగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును మలేసియా ఆటగాడు టాన్ బూన్ హ్యాంగ్ సాధించాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన ఈ ప్రపంచ రికార్డును తెలుగు కుర్రోడు సాత్విక్ సాయిరాజ్ బద్దలు కొట్టాడు.
విఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాపరికరాల సంస్థ యోనెక్స్..టోక్యోఫ్యాక్టరీ జిమ్నాజియంలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా ..ఫాస్టెస్ట్ స్మాష్ ల పరీక్ష నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు సైతం హాజరయ్యారు.
స్మాష్ ల వేగాన్ని మదింపు చేయటానికి గిన్నిస్ నిపుణులు ప్రత్యేక పరికరాలను అమర్చారు. ఫోటోగ్రాఫిక్ రికార్డింగ్ టెక్నిక్ తో ఫాస్టెస్ట్ స్మాష్ వేగాన్ని రికార్డు చేశారు.
ఇందులో సాయిసాత్విక్ 565 కిలోమీటర్ల వేగంతో కాక్ ను స్మాష్ చేశాడు. గత పదేళ్లుగా ఉన్న 493 కిలోమీటర్ల స్మాష్ రికార్డు 22 సంవత్సరాల సాయిసాత్విక్ దెబ్బతో తెరమరుగైపోయింది.దాంతో, పురుషుల బాడ్మింటన్‌లో కాక్‌ను బలంగా కొట్టిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో తాజాగా చేరిన ఈ రికార్డును తాము స్పాన్సర్ చేస్తున్న సాయి సాత్విక్ సాధించడం తమకు గర్వకారణమని యోనెక్స్ అధికారికంగా ప్రకటించింది.
మహిళా ప్లేయర్ వేగం 432 కిలోమీటర్లు..
మహిళల విభాగంలో అత్యంతవేగవంతమైన స్మాష్ ఆడిన ప్లేయర్ గా మలేసియాకు చెందిన టాన్ పియర్లీ నిలిచింది. టాన్ కొట్టిన స్మాష్ ను గంటకు 432 కిలోమీటర్ల వేగంగా గిన్నిస్ ప్రతినిధులు గుర్తించారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో ఓ మహిళా స్మాషర్ కు తొలిసారిగా చోటు కల్పించారు. ఆ ఘనతను టాన్ పియర్లీ సొంతం చేసుకోగలిగింది. ఫార్ములావన్ కారు వేగం గంటకు 372.6 కిలోమీటర్లు కాగా...బ్యాడ్మింటన్ స్మాష్ ల వేగం మహిళల విభాగంలో 432 కిలోమీటర్లు, పురుషుల విభాగంలో 565 కిలోమీటర్లు కావడం విశేషం.
ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో గత రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్..చివరకు అత్యంత వేగవంతమైన స్మాష్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించడం తెలుగు రాష్ట్ర్రాలకు మాత్రమే కాదు..భారత్ కే గర్వకారణంగా మిగిలిపోతుంది.
ఇటీవలే ముగిసిన మలేసియన్ మాస్టర్స్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో...జపాన్ జోడీ రెనా మియావురా- అయాకో సకురామోటో తో మలేసియా జంట పియర్లీ టాన్- థినా మురళీధరన్ తలపడిన మ్యాచ్ లో 211 ర్యాలీల ప్రపంచ రికార్డు చోటు చేసుకొన్న కొద్దివారాలలోనే సాయిసాత్విక్, టాన్ పియర్లీ అత్యంత వేగవంతమైన స్మాష్ ల ప్రపంచ రికార్డులు నెలకొల్పడం మరో విశేషం.