Telugu Global
Sports

ప్రపంచ బ్యాడ్మింటన్లో భారతజోడీకి అత్యుత్తమ ర్యాంక్!

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారతజోడీ సాత్విక్-చిరాగ్ అత్యుత్తమ ర్యాంక్ సాధించారు.

Badminton news: ప్రపంచ బ్యాడ్మింటన్లో భారతజోడీకి అత్యుత్తమ ర్యాంక్!
X

ప్రపంచ బ్యాడ్మింటన్లో భారతజోడీకి అత్యుత్తమ ర్యాంక్!

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారతజోడీ సాత్విక్-చిరాగ్ అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారత యువజోడీ జోరు అప్రతిహతంగా కొనసాగుతోంది. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జైత్రయాత్రకు ఎదురేలేకుండా పోయింది.

పలు అంతర్జాతీయ టోర్నీలలో గతేడాది కాలంగా నిలకడగా రాణిస్తూ..పలుకీలక టైటిల్స్ సైతం నెగ్గడం ద్వారా ఈ భారతజోడీ తమ ర్యాంకును అనూహ్యంగా మెరుగుపరచుకోగలిగారు.

4వ ర్యాంకులో భారతజోడీ..

సాత్విక్‌-చిరాగ్‌ అత్యుత్తమ ర్యాంకింగ్‌ భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జోడి సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నారు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ ఒకస్థానం మెరుగై 4వ ర్యాంక్‌కు చేరుకున్నారు.

పురుషుల డబుల్స్ అనగానే చైనా, మలేసియా, ఇండోనీసియా, చైనీస్ తైపీ, జపాన్ దేశాలకు చెందిన జట్లే మొదటి ఐదుర్యాంకుల్లో నిలుస్తూ రావడం సాధారణం.

అయితే...తొలిసారిగా భారత్ కు చెందిన ఓ జోడీ 4వ ర్యాంకులో నిలవడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం గతంలో ఉన్న 5వ ర్యాంక్ నుంచి 4వ ర్యాంక్ కు చేరుకోగలిగారు. భారత్ కు చెందిన ఓ జోడీ పురుషుల విభాగంలో సాధించిన అత్యుత్తమ ర్యాంకు సాత్విక్- చిరాగ్ లు సాధించినదే కావడం విశేషం.

2022- 2023 సీజన్లో సాత్విక్-చిరాగ్ జోడీ..బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకంతో పాటు ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్ -‌750 టైటిల్‌, ఈ సీజన్‌లో స్విస్‌ ఓపెన్‌ సూపర్‌- 300 టైటిల్‌ను గెలుచుకున్నారు. గత 12 టోర్నీలలో ఈ భారతజోడీ మొత్తం 74,651 పాయింట్లు సాధించడం ద్వారా 4వ ర్యాంక్ కు చేరుకోగలిగారు.

ఓ ర్యాంక్ మెరుగు పడిన ప్రణయ్..

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సంఘం పురుషుల ర్యాంకింగ్స్ లో గత వారం వరకూ 9వ ర్యాంక్ లో ఉన్న భారత సింగిల్స్ స్టార్ హెచ్ ఎస్ ప్రణయ్..ఇటీవలే ముగిసిన మలేసియన్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకోడం ద్వారా 8వ ర్యాంక్ సాధించగలిగాడు.

తెలుగుతేజం కిడాంబీ శ్రీకాంత్ మూడుస్థానాలు మెరుగుపరచుకొని 20వ ర్యాంక్ లో నిలిచాడు. భారత యువఆటగాడు లక్ష్యసేన్ 22 నుంచి 23వ ర్యాంక్ కు పడిపోయాడు.

13వ ర్యాంకులో పీవీ సింధు...

మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో మాత్రం పీవీ సింధు పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నతీరుగా ఉంది. గత ఏడాది వరకూ ప్రపంచ అత్యుత్తమ మొదటి 10 మంది ర్యాంకర్లలో ఒకరిగా ఉంటూ వచ్చిన పీవీ సింధు ప్రస్తుత 2023 సీజన్లో వరుస వైఫల్యాలతో దారుణంగా వెనుకబడిపోయింది. 13వ ర్యాంక్ కు దిగజారి పోయింది.

మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్ లో ట్రిసా జోలీ- గాయత్రీ గోపీచంద్ జోడీ 15వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిబంధనల ప్రకారం మొదటి ఆరుర్యాంకుల్లో నిలిచిన జట్లు లేదా క్రీడాకారులకు మాత్రమే ఒలింపిక్స్ మెయిన్ డ్రాలో నేరుగా పాల్గొనే అవకాశం ఉంటుంది.

First Published:  31 May 2023 5:17 PM IST
Next Story