Telugu Global
Sports

ముంబై కుర్రోడికి బరువే శాపమా?

ముంబై పరుగుల యంత్రం సర్పరాజ్ ఖాన్ భారత టెస్టుజట్టులో చోటు కోసం అలుపెరుగని పోరాటమే చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నా సెలెక్టర్లు ఏమాత్రం పట్టించుకోకపోడం చర్చనీయాంశంగా మారింది.

ముంబై కుర్రోడికి బరువే శాపమా?
X

ముంబై పరుగుల యంత్రం సర్పరాజ్ ఖాన్ భారత టెస్టుజట్టులో చోటు కోసం అలుపెరుగని పోరాటమే చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నా సెలెక్టర్లు ఏమాత్రం పట్టించుకోకపోడం చర్చనీయాంశంగా మారింది....

క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ ముంబై ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా, సర్పరాజ్ ఖాన్ సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నా..భారతజట్లలో చోటు కోసం అలుపెరుగని పోరాటమే చేయాల్సి వస్తోంది.

గతంలో సూర్యకుమార్ యాదవ్, ఇటీవలే పృథ్వీ షా తమ అసాధారణ ప్రతిభతో భారత టీ-20 జట్టులో చోటు సంపాదించగలిగారు. సూర్యకుమార్ యాదవ్ తనకు అందివచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడం ద్వారా ప్రపంచనంబర్ వన్ బ్యాటర్ ర్యాంక్ తో పాటు..భారత టీ-20 జట్టు వైస్ కెప్టెన్ హోదాను సంపాదించగలిగాడు.

మరోవైపు..యువఓపెనర్ పృథ్వీ షా ఇటీవలే జరిగిన రంజీమ్యాచ్ లో అసోంపై 379 పరుగుల రికార్డు స్కోరు సాధించడం ద్వారా..న్యూజిలాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో తిరిగి చోటు సంపాదించగలిగాడు.

అయితే..ముంబైకే చెందిన మిడిలార్డర్ ఆటగాడు, 25 సంవత్సరాల యువబ్యాటర్ సర్పరాజ్ ఖాన్ మాత్రం గత మూడుసీజన్లుగా అలవోకగా సెంచరీలు, టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నా భారత టెస్టుజట్టులో చోటు సంపాదించలేకపోతున్నాడు. సెలెక్టర్లు తనవైపు చూడకపోడంతో తీవ్రనిరాశలో పడిపోయాడు.

2019 సీజన్ నుంచి పరుగులే పరుగులు..

అత్యున్నత ప్రమాణాలకు మరోపేరైన ముంబై క్రికెట్లో అత్యంత ప్రతిభావంతులైన బ్యాటర్లలో ఒకడిగా సర్పరాజ్ ఖాన్ గుర్తింపు తెచ్చుకొన్నాడు. ముంబై రంజీజట్టుకు మిడిలార్డర్ ఆటగాడిగా అసమాన సేవలు అందిస్తున్నాడు.

22 ఏళ్ల వయసు నుంచే దేశవాళీ రంజీక్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్ గా గుర్తింపు సంపాదించాడు. 2019, 2020, 2021, 2022 సీజన్లలో సగటున 900 పరుగులు చొ్ప్పున సాధిస్తూ వచ్చాడు. అంతేకాదు..ప్రస్తుత 2023 సీజన్లో ఇప్పటికే మూడుశతకాలు బాదాడు. రంజీట్రోఫీ గ్రూప్- బీ లీగ్ లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న

ప్రస్తుత మ్యాచ్ లో సైతం సర్పరాజ్ ఖాన్ మెరుపు సెంచరీతో అదరగొట్టాడు.

తీవ్రనిరాశలో సర్పరాజ్..

దేశవాళీ క్రికెట్లో గత కొద్దిసంవత్సరాలుగా తాను నిలకడగా రాణిస్తున్నా, సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్నా, పరుగుల మోత మోగిస్తున్నా సెలెక్టర్లు తనను ఏమాత్రం పట్టించుకోకుండా పక్కనపెట్టడంతో సర్పరాజ్ తీవ్రనిరాశకు గురయ్యాడు. తనను కాదని ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి వైట్ బాల్ స్పెషలిస్టులను..ఆస్ట్ర్రేలియాతో త్వరలో జరిగే నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకు ఎంపిక చేయడంతో ఢీలాపడిపోయాడు. తనవంతు అవకాశం వస్తుందని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ గతంలో తనకు అనధికారికంగా హామీ ఇచ్చినా..ఎంపిక సమయంలో తనపేరును పరిగణనలోకి తీసుకోకపోడం పట్ల చిన్నబుచ్చుకొన్నాడు.

భారతజట్టులో చోటు సంపాదించాలంటే తాను ఇంకా ఏంచేయాలని, ఎన్నిసెంచరీలు, పరుగులు సాధించాలని నిలదీస్తున్నాడు.

వయసుకు మించిన బరువే అడ్డంకా?

సర్పరాజ్ ఖాన్ వయసుకు మించిన బరువు ఉండటమే..ఎంపిక చేయకపోడానికి కారణమని మరోవైపు ప్రచారం జరుగుతోంది. అయితే..బరువుతో ప్రమేయం లేకుండా ఈ కుర్రాడు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడని, ఏడాది ఏడాదికీ ఒకేతీరుగా రాణిస్తూ సెంచరీల వర్షం కురిపిస్తున్నాడని భారత మాజీ క్రికెటర్, విమర్శకుడు వెంకటేశ్ ప్రసాద్ అంటున్నారు.

సర్పరాజ్ ఖాన్ ప్రతిభను, గణాంకాలను పట్టించుకోకుంటే..అది దేశవాళీ క్రికెట్ నే అవమానించినట్లవుతుందని సెలెక్టర్లను హెచ్చరించాడు. ప్రస్తుత భారతజట్టులో తమ వయసుకు మించిన బరువున్నఆటగాళ్లు చాలామంది ఉన్నారని గుర్తు చేశాడు.

25 సంవత్సరాల వయసుకే 12 రంజీ సెంచరీలు, 3వేల 380 పరుగులు సాధించిన సర్పరాజ్ ఖాన్ మొరను ఇకనైనా బీసీసీఐ ఎంపిక సంఘం ఆలకించాలన్న ఒత్తిడి నలువైపుల నుంచి రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.

సర్పరాజ్ మాత్రం తనను భారత టెస్టుజట్టుకు ఎంపిక చేసే వరకూ సెంచరీలు బాదుతూనే ఉంటానని మొండిగా చెబుతున్నాడు.

First Published:  18 Jan 2023 6:30 AM GMT
Next Story